ఆలీ…కాట్రవల్లీనేనా…?

సినీనటుడు ఆలీ ఎవరి అంచనాలకు దొరకడం లేదు. తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో జరిగే జగన్ పాదయాత్ర ముగింపు సభలో [more]

Update: 2019-01-08 11:00 GMT

సినీనటుడు ఆలీ ఎవరి అంచనాలకు దొరకడం లేదు. తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో జరిగే జగన్ పాదయాత్ర ముగింపు సభలో ఆలీ పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగానే సాగింది. జగన్ ను గత నెల 28వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలవడం, రాజకీయ చర్చలు జరపడం జరిగిపోయాయన్న వదంతులూ వ్యాప్తి చెందాయి. ఈ ప్రచారాన్ని ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాని, అటు ఆలీ కానీ ఖండించలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఆలీ చేరతారని భావించారంతా.

పవన్ ను కలిసి….

అయితే ఆయన మొన్న సండే అందరికీ షాకిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుసుకున్నారు. దాదాపు రెండుగంటలకు పైగానే పవన్ తో ఆలీ చర్చలు జరిపారు. పవన్ తో ఆలీ సాన్నిహిత్యం ఎక్కువే. సినీ పరిశ్రమ నుంచే వీరి స్నేహం మొదలయినా అనేక అంశాల్లో పవన్ తో ఆలీ ఏకీభవిస్తుంటారు. పవన్ ను వెనకేసుకొస్తుంటారు. ఆలీ తొలుత జనసేనలోనే చేరతారని అందరూ అనుకున్నారు. కానీ వైసీపీ ప్రస్తావన రావడంతో పవన్ పార్టీలో చేరడానికి ఆలీకి ఇష్టం లేదేమో అని సరిపెట్టుకున్నారు. చివరకు పవన్ ను కలసి రెండు గంటలు చర్చించడంతో జనసేనలోనే చేరతారన్న చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ నేతలు కూడా పవన్ ను కాదని ఆలీ ఎక్కడకూ వెళ్లరన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుతో భేటీ తర్వాత…..

తర్వాత చంద్రబాబును ఆలీ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా తొలి నుంచి ఆలి తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడిగానే ఉంటూ వస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. గుంటూరు టిక్కెట్ ను కూడా కోరారు. కొన్ని కారణాలతో టీడీపీ అధిష్టానం ఆలీకి టిక్కెట్ ను నిరాకరించింది. దీంతో 2014 ఎన్నికల తర్వాత ఆలీ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబును, పవన్ ను కలవడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికే అని ఆలీ పైకి చెబుతున్నా జనసేన, టీడీపీ అధినేతలతో భేటీ అయింది తన రాజకీయ భవిష్యత్ పై చర్చించేందుకేనని అంటున్నారు.

కామెడీ చేసి వెళ్లారా?

కానీ ఆలీ ఈనెల 9వ తేదీన జగన్ పాదయాత్ర ముగింపు సభలో పార్టీలో చేరాల్సి ఉంది. పవన్, చంద్రబాబులను కలసిన తర్వాత ఆలీ తన మనసును మార్చుకున్నారా? లేక రేపు జగన్ పార్టీలో చేరుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ జనసేనలో చేరేందుకు ఆలీ పవన్ ను కలిశారా? పవన్ నుంచి ఆలీకి ఎటువంటి హామీ లభించింది? ఇటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు దొరకకపోయినా.. ఆలీ మాత్రం ఏపీ రాజకీయాలను కామెడీ చేసి వెళ్లాడరన్నది మాత్రం పొలిటికల్ వర్గాల్లో టాక్. ఆలీ వల్ల అసలు ఉపయోగం ఉంటుందా? ఉండదా? అని పక్కన పెడితే ఎన్నికల వేళ ఎవరు ఏ పార్టీ లో చేరినా అది కొంత లాభం అవుతుందన్న గుడ్డి నమ్మకమే ఆలీకి ప్లస్ అయిందంటున్నారు. మొత్తం మీద ఆలీ మాత్రం ఏపీ రాజకీయాలను ఒక ఆటాడుకుని వెళ్లిపోయారు. మరి రేపు వైసీపీలో చేరతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Similar News