మోడీ బాబును  పలకరిస్తారా..

చంద్రబాబు పొలిటికల్ డిక్షనరీలో శాశ్వత శత్రువులు ఎవరూ  ఉండరు. ఉన్నవారంతా ఆయా సందర్భాల్లో ఏర్పడిన శత్రువులే. అలాంటి సందర్భాల్లో మాత్రం వారిని చెడామడా కడిగేస్తారు. ఇక జనంలో [more]

Update: 2019-11-30 11:30 GMT

చంద్రబాబు పొలిటికల్ డిక్షనరీలో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఉన్నవారంతా ఆయా సందర్భాల్లో ఏర్పడిన శత్రువులే. అలాంటి సందర్భాల్లో మాత్రం వారిని చెడామడా కడిగేస్తారు. ఇక జనంలో వారిని కలవను అన్నట్లుగా ఆయన మాటల, చేతల దూకుడు ఉంటుంది. మోడీ విషయంలో కూడా చంద్రబాబు చేసిందదే. మోడీని ఈ దేశంలో ఎంతో మంది ద్వేషించారు, ఆయన విధానాలు వ్యతిరేకించారు కానీ ఏ నాయకుడు అననన్ని మాటలను చంద్రబాబు అన్నారు. ఇక అమిత్ షా విషయానికి వచ్చినా అంతే. ఆయనపైన అలిపిరిలో జరిగిన రాళ్ళ దాడి మమత బెనర్జీ కొలువు తీరిన పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు, ఇక మోడీకి ఇదే అమరావతి వస్తే నల్ల జెండాలతో నల్ల కుండలతో తమ్ముళ్ళు స్వాగతం పలికారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినపుడు బాబు మళ్ళీ ఎపుడూ మోడీ అన్న పేరు కూడా ఎత్తరని అంతా అనుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే ఇపుడు మోడీని బాబు తెగ పొగుడుతున్నారు.

ప్రేమలేఖలతో ప్రసన్నం :

మోడీ, అమిత్ షాలకు ఈ మధ్య చంద్రబాబు లేఖలు రాశారు. అవి ధన్యవాద లేఖలు. దేని గురించి అంటే అమరావతిని రాజధానిగా ఇండియా మ్యాపులో ఉంచినందుకట. ఈ విషయంలో వారిద్దరినీ పొగుడుతూ బాబు లేఖాస్త్రం సంధించారు. ఇక కడప టూర్లో బాబు ఏకంగా మోడీ మాత్రుభాషపై చూపించిన మమకారం గురించి ప్రశంసలు కురిపించారు. మన్ కి బాత్ కార్యక్రమంలో మోడీ మాత్రుభాషను కాపాడుకోవాలని చెప్పారు. అంతర్జాతీయ మాత్రుభాష దినోత్సవం సందర్భంగా మోడీ రేడియో ప్రసంగంలో మాత్రుభాష గురించి ప్రస్తావించారు. దానికీ ఏపీలో ఆంగ్ల భోధనకు లింక్ పెట్టి మరీ బాబు మోడీ ఈజ్ గ్రేట్ అనేశారు. తెలుగులో బోధన తప్పనిసరి అని మోడీ కూడా చెప్పారంటూ అక్కడా ఇక్కడా కలిపేశారు. అంటే మొత్తానికి మోడీది, తనదీ ఒకే మాట, ఒకే బాట అని చెప్పుకోవడమే ఇక్కడ బాబు ఉద్దేశ్యం.

అమరావతి మీద ఫిర్యాదు :

ఇపుడు అమరావతి అంశాన్ని పెంచి పోషిస్తున్న చంద్రబాబు తాజాగా అక్కడ పర్యటన చేసి వచ్చారు. అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదు, ఆరు నెలలు గడచినా కొత్త ఇటుక కూడా పేర్చలేదని ఆరోపిస్తూ కేంద్రాన్ని తొందరలో బాబు కలుస్తారట. ఈ విషయన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము అమరావతి సమస్యను ఇంతటితో వదిలేయమని, ఢిల్లీ వెళ్ళి జాతీయ స్థాయిలో దీన్ని ప్రస్తావిస్తామని కూడా అంటున్నారు. అంటే ఆరు నెలల తరువాత, అదీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బాబు ఢిల్లీ వెళ్తున్నారు అంటే కేంద్ర పెద్దలతో మంతనాలకేనని అంటున్నారు. మరి ఢిల్లీ వెళ్ళిన బాబు ఎటూ జాతీయ మీడియాతో మాట్లాడతారు, అక్కడ మోడీని పొగుడుతారు కూడా, మరి ఇన్ని రకాలుగా తనపైన మోజు పెంచుకుంటున్న బాబుకు మోడీ కలవమని అపాయింట్మెంట్ ఇస్తారా, అసలు బాబుని మోడీని పలుకరిస్తారా. ముందే చెప్పుకున్నట్లుగా బాబు డిక్షనరీలో శాశ్వత శత్రువులు లేరు కానీ మోడీ, అమిత్ షాలకు మాత్రం పాత వైరాలు ఒక పట్టాన మరచిపోయే రకాలు కారే. మరి బాబు మార్క్ రాజకీయ‌ చాణక్యం ఏంటన్నది ఇక్కడే తెలుస్తుంది. చూడాలి అదేంటో.

Tags:    

Similar News