Chiranjeevi : ఆచార్యా.. ఆదుకోవా?

ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పైన, మంత్రులపైన చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయాల నుంచి [more]

Update: 2021-09-29 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పైన, మంత్రులపైన చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయాల నుంచి అటు టాలీవుడ్ కు చుట్టుకుంది. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ వర్సెస్ అదర్స్ మాదిరి తయారైంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా కుటుంబం ఆధిపత్యం నడుస్తోంది. సినీ పరిశ్రమలో నెలకొన్న ఇబ్బందులపై మెగాస్టార్ చిరంజీవి పెద్దగా వ్యవహరిస్తున్నారు.

సినీ పరిశ్రమ ఇబ్బందులను…

ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారు. జగన్ తో త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని కూడా డైలమాలోకి నెట్టాయి. ఇటు తమ్ముడు పవన్ కల్యాణ్, అటు సినీ పరిశ్రమ. ఈ రెండింటిలో చిరంజీవి దేనిని ఎంచుకుంటారన్న ఆసక్తి నెలకొంది. చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులున్నారు.

జగన్ కు అనుకూలంగానే…..

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అడపా దడపా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా చిరంజీవి స్వాగతిస్తూ వస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి కూడా చిరంజీవి మద్దతు తెలపలేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిన జగన్ ప్రభుత్వాన్ని చిరంజీవి అభినందించారు.

పవన్ వ్యాఖ్యలతో….

ఈ పరిస్థితుల్లో పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని కూడా బాధించి ఉంటాయి. అయితే టాలీవుడ్ పెద్దగా సినీ పరిశ్రమలో నెలకొన్న విభేదాలను చిరంజీవి మాత్రమే పరిష్కరించాల్సి ఉంది. ప్రతి చిన్న అంశంపై చిరంజీవి ట్వీట్ చేస్తారు. కానీ పోసాని వర్సెస్ జనసేనానిల మధ్య జరుగుతున్న పోరులో మాత్రం ఆయన మౌనంగానే ఉన్నారు. టాలీవుడ్ కు చుట్టుకున్న పవన్ కల్యాణ్ కామెంట్స్ చిచ్చు రేపుతున్నాయి. మరి చిరంజీవి స్పందిస్తారో? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News