మెగా బ్రదర్స్ మధ్య జగన్ చిచ్చు ?

జగన్ ఏపీకి సీఎం. మెగా బ్రదర్స్ తో ఆయనకు ఏం పని అన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ రాజకీయాలకు సంబంధం లేని రంగం లేదు కదా. [more]

Update: 2021-04-22 08:00 GMT

జగన్ ఏపీకి సీఎం. మెగా బ్రదర్స్ తో ఆయనకు ఏం పని అన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ రాజకీయాలకు సంబంధం లేని రంగం లేదు కదా. పైగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన జనసేన పార్టీ అధినేత కూడా. ఇక పవన్ జగన్ ని గట్టిగా ద్వేషిస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్ సర్కార్ ఏమి మంచి పని చేసినా మెచ్చుకుంటారు. పైగా జగన్ ఇంటికి వెళ్ళి విందారగించి వచ్చిన మంచితనం చిరంజీవిది.

అదే తప్పుట …

ఇటీవల జగన్ సర్కార్ సినీ పరిశ్రమకు కొన్ని రాయితీలు ప్రకటించింది. సినీ ఎగ్జిబిటర్లకు విద్యుత్ రాయితీలతో పాటు వారి రుణాలకు వడ్డీ రాయితీలను ప్రకటించింది. అలాగే వారు కట్టాల్సిన వాటి మీద మారిటోరియాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. దీని మీద సినీ పెద్దగా మెగాస్టార్ జగన్ ని మెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు అందిస్తున్న వరాలుగా ఆయన అభివర్ణించారు. అయితే ఇది పవన్ ఫ్యాన్స్ కి తప్పుగా అనిపించింది. అంతే వారు ఏకంగా చిరంజీవినే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలెట్టారు.

చిరంజీవికే ట్రోల్స్ ….

చిరంజీవి వల్లనే పవన్ రాజకీయం ఇబ్బందులో పడుతోంది అని కూడా హాట్ కామెంట్స్ కూడా పెట్టారు. పవన్ జగన్ ని వ్యతిరేకిస్తూంటే చిరంజీవి పొగడడం ఏంటి అని కూడా మండిపోతున్నారు. ఇక్కడొక విషయం ఏంటి అంటే చిరంజీవి సినీ పెద్దగా మాత్రమే జగన్ ని పొగిడారు. అది అవసరం కూడా. పైగా మంచి పని ఒక ప్రభుత్వం చేస్తే మెచ్చుకోకుండా ఉంటే అది కుసంస్కారమే. ఇక చిరంజీవి వ్యక్తిగతంగా చూస్తే ఏ రాజకీయ పార్టీలో లేరు. ఆయన రాజకీయాలు ఎపుడో వదిలేశారు. తన శేష జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. సినీకార్మికుల కోసం ఏదో చేయాలని తపన పడుతున్నారు. మరి దాన్ని అర్ధం చేసుకోకుండా ఇలా ట్రోల్ చేయడమేంటని మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు.

ఆయన లేకపోతే…?

నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి ఒక్కడుగా వచ్చాడు. ఇపుడు ఆయనే ఇండస్ట్రీ అయ్యాడు. ఆయన ఘనమైన వారసత్వాన్నే పవన్ అందిపుచ్చుకున్నారు. చిరంజీవి లేకపోతే పవన్ హీరో అయ్యేవారా అన్న మాట కూడా వస్తోంది. మరో వైపు చూస్తే చిరంజీవి సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికపుడు చర్చలు జరుపుతున్నారు. ఆయన పనిని ఆయన్ని చేయనివ్వరా అన్నది మెగా ఫ్యాన్స్ మాట. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ముల దారులు ఎపుడూ వేరుగానే ఉంటూ వస్తున్నాయి. చిరంజీవి ఎవరినీ ద్వేషించరు, పరుష పదజాలమే వాడరు. బహుశా ఈ కారణాల వల్లనే ఆయన రాజకీయంగా రాణించలేకపోయారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా పవన్ రాజకీయానికి చిరంజీవి అడ్డు కాదని ఎవరి పని వారిదేనని కూడా మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం మొత్తం మెగా ఫ్యామిలీ అంతా జగన్ ని వ్యతిరేకించాలని అంటున్నారు. అది జరిగే పనేనా. ఎవరి ఆలోచనలు వారివి అన్నది సినీ పెద్దల మాట కూడా ఉంది. మొత్తానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం మెగా స్టార్, పవన్ స్టార్ల మధ్య కొత్త చిచ్చు ఇలా మొదలైందా అన్న మాట అయితే వినవస్తోంది.

Tags:    

Similar News