కాంగ్రెస్ కి చావని “చిరు” ఆశ

ఆంధ్రప్రదేశ్ లో విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన తప్పుడు వ్యూహం కొంతైతే మరికొంత జగన్ చరిష్మా [more]

Update: 2021-07-01 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉంది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన తప్పుడు వ్యూహం కొంతైతే మరికొంత జగన్ చరిష్మా తో ఆ పార్టీ రెండు రాష్ట్రాల్లో దెబ్బయిపోవడం మరో కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇలా రెండింటికి చెడ్డ రేవడి గా మారిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లో కొంత ఆశలు ఉన్నాయి. అక్కడ నాయకత్వానికి ఢోకా లేదు. కానీ అనైక్యంగా ఉన్న కాంగ్రెస్ బలాన్ని సంఘటితం చేసి నడిపే శక్తి ఇప్పటివరకు లేదనే చెప్పాలి. అయితే కొత్త అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చాకా కొంత జోష్ ఆ పార్టీ క్యాడర్ కి ఏర్పడింది. కానీ ఏపీ లో మాత్రం నానాటికి తీసికట్టు కాంగ్రెస్ పరిస్థితి అన్నట్లే ఉంది.

ఆయన రావాలి లేకపోతే … ?

తన సినీ చరిష్మా తో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అది వర్క్ అవుట్ కాకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడై కేంద్రమంత్రి అయ్యారు. ఎప్పుడైతే కాంగ్రెస్ అశాస్త్రీయ విభజనకు పాల్పడి ఏపీ లో చులకన అయ్యిందో నాటి నుంచి ఆ పార్టీ కి రాజీనామా చేయకుండా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు మెగాస్టార్. పోనీ అలా అని ఆయన యాక్టివిటీస్ ఏమి లేవా అంటే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూ కరోనా కాలంలో సినీ కళాకారులను పెద్ద ఎత్తునే నిత్యావసరాలు ఇచ్చి ఆదుకున్నారు. వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ సైతం నిర్వహించారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్ లు సైతం నెలకొల్పారు. ఇలా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నా కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ కి మాత్రం చిరంజీవి దూరంగానే ఉన్నారు. ఇలా ఉన్న చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నారు అంటూ ఏపీ పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ ప్రకటించుకున్నారు అంటే హస్తం దీనపరిస్థితి చెప్పక చెప్పినట్లు అయ్యింది.

జై జగన్ అంటున్న చిరు …

మరోపక్క చిరంజీవి కాంగ్రెస్ వ్యతిరేక పనులే ఎక్కువ చేస్తున్నారు. ఏపీ సిఎం ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి రావడం ఆ తరువాత ఎప్పుడు వీలుంటే అప్పుడు జగన్ చర్యలను ప్రశంసించడం రొటీన్ గా చేస్తూ వస్తున్నారు. ఇటీవలే జగన్ చేపట్టిన రికార్డ్ స్థాయి వ్యాక్సినేషన్ ను సైతం మెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న చిరంజీవి కాంగ్రెస్ కి ఎలా దగ్గరగా ఉన్నారో ఎవరికి అర్ధం కాని విషయం అనే చెప్పాలి. మరో పక్క చిరు చర్యలు అటు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కాపు ఓటు బ్యాంక్ గంపగుత్తగా తమకే ఉంటుందనుకుంటున్న జనసేనకు చిరంజీవి పరోక్షంగా చెక్ పెడుతున్నారనే ఆందోళన సైతం ఆ పార్టీ క్యాడర్ ను వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఇంకా తగ్గని ఆశకు చిరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News