‘జనసేన’ కు ‘మెగా’ గండం…?

మెగాస్టార్ చిరంజీవిని నెమ్మదిగా తన పట్టులోకి తెచ్చుకోవడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం పెరుగుతోంది. చిరు సైతం సానుకూలంగా స్పందిస్తున్న సంకేతాలే వెలువడుతున్నాయి. ఎన్నో ఆశలతో, ఆవేశంతో [more]

Update: 2021-06-26 15:30 GMT

మెగాస్టార్ చిరంజీవిని నెమ్మదిగా తన పట్టులోకి తెచ్చుకోవడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం పెరుగుతోంది. చిరు సైతం సానుకూలంగా స్పందిస్తున్న సంకేతాలే వెలువడుతున్నాయి. ఎన్నో ఆశలతో, ఆవేశంతో నడుపుతున్న జనసేనకు ఈ మెగా బ్రదర్ కదలికలు గండంగా మారుతాయనే అనుమానాలూ నెలకొంటున్నాయి. చిరంజీవి గతంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేసేశారు. రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు, తనకు రాజ్యసభ తో పాటు కేంద్రంలో సహాయమంత్రి పదవి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 17శాతం ఓటింగు వచ్చిన పార్టీ అంతర్థానమై పోయింది. అప్పట్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. సుదీర్ఘ పోరాటానికి సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. పార్టీ పెట్టిన తొలి ఎన్నికలో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి స్వచ్ఛంద సహకారం అందించాడు.2019 ఎన్నికలో ఘోరమైన పరాజయాన్ని చవిచూశాడు. అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు సోదరుడు చిరంజీవి నుంచే జనసేనకు సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంతా సాఫీగా సాగితే మెగాస్టార్ కు అయాచితంగా అగ్ర తాంబూలం ఇచ్చేందుకు వైసీపీ రంగం సిద్దం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పెద్దల సభలో పీఠం వేయడం ద్వారా అన్నాదమ్ముల సవాల్ కు పరోక్షంగా పావులు కదుపుతున్న్టట్లు తెలుస్తోంది.

వీలు దొరికితే చాలు…

ప్రజారాజ్యంలో కలిసి పనిచేశారే తప్ప అన్నదమ్ముల రాజకీయ సిద్ధాంతాలు వేర్వేరు. చిరంజీవి పార్టీని కాంగ్రెసులో కలిపినప్పుడు పవన్ తీవ్రంగానే విభేదించారు. కానీ అన్నపై గౌరవంతో రోడ్డెక్కి రచ్చ చేయకుండా మౌనం వహించాడు. తానే రాజకీయ బాధ్యతను తీసుకోవాలనే ఉద్దేశంతోనే జనసేనను స్థాపించాడు. తమ్ముడు పెట్టిన పార్టీని చిరంజీవి ఆశీర్వదిస్తున్నారు. కానీ ఇంతవరకూ ప్రత్యక్షంగా సహకారం అందించిన దాఖలాలు లేవు. తమ్ముడిని ఆదరించమని అభిమానులకు పిలుపు నిచ్చిన ఉదంతాలు సైతం లేవు. ముఖ్యమంత్రి జగన్, పవన్ ల మధ్య రాజకీయవైరుద్ద్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ సందర్బం దొరికిన ప్రతిసారీ ముఖ్యమంత్రిని మెచ్చుకుంటూ చిరంజీవి జగన్ అబిమానాన్ని చూరగొంటున్నారు. మూడు రాజధానులకు మద్దతు ఇస్తూ గతంలో ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ వైసీపీ కి అండగా నిలిచారు. అమరావతి ఉద్యమ రైతులు కలవడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా చిరు నిరాకరించారు. తద్వారా తాను జగన్ వైపు ఉంటానని స్పష్టంగానే చెప్పేశారు. తాజాగా కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాక్సినేషన్ రికార్డును ప్రశంసిస్తూ ముఖ్యమంత్రికి చిరంజీవి ప్రత్యేకాభినందనలు తెలిపారు. వాక్నినేషన్ వంటి సాధారణ విషయంలోనూ అసాధారణ విజయాన్ని చిరు మాత్రమే గమనించడం ఆయన రాజకీయ వైఖరికి అద్దం పట్టింది.

ప్రయోజనం ఎంతమేరకు..?

పవన్ కల్యాణ్ కు విస్తృతమైన ప్రజాదరణ ఉన్నమాట వాస్తవం. కానీ ఆయా వర్గాల నుంచి ఓట్లు రావు. జనసేనకు లభించిన ఓట్లలో 80 శాతం మేరకు కేవలం తన సామాజిక వర్గం నుంచే వచ్చాయనేది ఒక అంచనా. ఉభయగోదావరి జిల్లాలలోనే ఆ పార్టీ ఎంతోకొంత ప్రబావం చూపడం ఇందుకు నిదర్శనం. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గత ఎన్నికల్లో పతాకస్థాయి లో పెర్ ఫార్మెన్స్ చూపగలిగింది. తెలుగుదేశంతో పోలిస్తే పదకొండు శాతం పైగా ఓట్ల ఆధిక్యాన్ని తెచ్చుకుంది. జనసేన అయిదు శాతం ఓట్లకు పరిమితమైంది. బీజేపీ ఒక శాతం ఓట్లను రాబట్టింది. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కడతాయని ప్రచారం సాగుతోంది. ఆయా పార్టీలు మనుగడ సాగించాలంటే చేతులు కలపడం ఒక రాజకీయ అనివార్యత. అదే జరిగితే ఉత్తరాంధ్ర మొదలు గుంటూరు జిల్లా వరకూ వైసీపీకి దీటైన పోటీ ఎదురవుతుంది. రాయలసీమలో వైసీపీ ఆధిక్యం కొనసాగించగలిగినప్పటికీ కోస్తా జిల్లాల్లో కూటమి పైచేయి సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఎన్నికల నాటికి ఎంతో కొంత వ్యతిరేకత పెరిగితే రాయలసీమ జిల్లాల్లోనూ పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. చిరంజీవిని రాజకీయంగా సముచిత రీతిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా గౌరవించగలిగితే పరోక్షంగా కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడం సాధ్యమవుతుందని వైసీపీ బావిస్తోంది. ఇది జనసేన ఓటింగుకు గండి కొడుతుంది. తెలుగుదేశంతో కూటమి కట్టినప్పటికీ ప్రభావాన్ని నామమాత్రం చేయడం సాధ్యమవుతుంది.

ఆయనకు తప్పదు…

చిరంజీవి సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ గత వైభవం మళ్లీ పొందడం కష్టం. సెకండ్ ఇన్నింగ్స్ తొలి సినిమాకు లభించిన ఆదరణ ఆ తర్వాత పలచనై పోయింది. చివరి దశలో మెరుపులు తప్ప, మళ్లీ కొత్త తరంతో పోటీ పడి తన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం అసాధ్యం. 65 సంవత్సరాల వయసులో తాను ఇంకా చలనచిత్ర రంగంలో సాధించేదేమీ ఉండదని చిరంజీవికి కూడా తెలుసు. పై పెచ్చు టాలీవుడ్ లోనే ఆరేడుగురు హీరోలతో కుటుంబ వారసత్వం కొనసాగిస్తున్న పెద్ద ఫ్యామిలీ మెగాస్టార్ దే. రాజకీయ రంగంలో తనకు ఇక చాన్సు లేదనే ఉద్దేశంతోనే విసిగిపోయి తిరిగి తెరపైకి వచ్చారనేది ఒక వాదన. ఒకటి రెండు సంవత్సరాలు సినిమాలు చేసినా హీరోగా ఆ తర్వాత కొనసాగడం కష్టం. అమితాబ్ తరహాలో క్యారెక్టర్ పాత్రలు చేయడం చిరంజీవి ఇమేజ్ కు సరిపోదు. గౌరవ ప్రదమైన సామాజిక జీవనానికి, హోదాకు రాజకీయాన్ని మించింది లేదు. అందుకుగాను జనసేనతో కలిసి పనిచేయాలి. గౌరవంగా చూసుకున్నప్పటికీ అక్కడ ద్వితీయ స్థానమే ఉంటుంది. పైపెచ్చు జనసేన రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి రాజ్యసభ ఆఫర్ వస్తే వి స్వీకరించేందుకే చాన్సులు ఎక్కువ. వచ్చే ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. విజయసాయి రెడ్డి పదవి కొనసాగింపు ఒక్కటే జగన్ కు సంబంధించి తప్పనిసరి. మిగిలిన స్థానాలు తనకు ఇష్టారీతిలో కేటాయించుకొనే చాయిస్ ఉంది. పార్టీ నుంచి పెద్దగా ఒత్తిడి చేయగల వారూ లేరు. అందువల్ల చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం వల్ల వైసీపీకి పోయిందేమీ లేదు. చేతులు కలుపుతాయనుకుంటున్న కూటమి పార్టీల ఓటింగుకు ముందుగానే గండి కొట్టినట్లవుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News