అందుకేనా…. ఈ హడావిడి అంతా?

చిరాగ్ పాశ్వాన్ చిన్న వయసులోనే పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అయితే బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన అనుసరించిన వైఖరి ఆయనకు, పార్టీకి ఏ రకమైన ప్రయోజనం [more]

Update: 2020-10-25 17:30 GMT

చిరాగ్ పాశ్వాన్ చిన్న వయసులోనే పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అయితే బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన అనుసరించిన వైఖరి ఆయనకు, పార్టీకి ఏ రకమైన ప్రయోజనం చేకూరుస్తుందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేస్తుండటంతో ఆయనపై జాతీయ మీడియా అంతా దృష్టి పెట్టింది.

మోదీకి వీరభక్తుడిని అంటూ….

అయితే చిరాగ్ పాశ్వాన్ మోదీకి వీరభక్తుడినని చెబుతున్నారు. తన గుండె చీల్చి చూసుకున్నా మోదీ బొమ్మ కనపడుతుందని అంటున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీ నామస్మరణ ఎందుకన్నది జేడీయూ, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మోదీ ఫొటో పెట్టుకుని తిరగాలని ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కూడా బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జి దేవేంద్ర ఫడ్నవిస్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు.

విపక్ష కూటమికి కూడా….

అయితే ఇలా ఉంటే చిరాగ్ పాశ్వాన్ దృష్టంతా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైనే ఉంది. జేడీయూ ను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే చిరాగ్ పాశ్వాన్ తన అభ్యర్థులను జేడీయూ పోటీ చేసిన చోటే దించడం విశేషం. ప్రతి సభలోనూ నితీష్ కుమార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ సూచన మేరకే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని ఆయన పదే పదే చెబుతున్నారు.

ఏ ప్రభుత్వం వచ్చినా…..

కానీ ఇటు బీజేపీతో సత్సంబంధాలను తెంచుకోకుండా, అటు నితీష్ కుమార్ ను తిడుతూ ఆర్జేడీ, కాంగ్రెస్ లకు చిరాగ్ పాశ్వాన్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వం ఏర్పడినా తన పార్టీకి అధికారం దక్కుతుందన్న ధోరణిలోనే చిరాగ్ పాశ్వాన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోతే తానే కీలకంగా మారతానని చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు. అయితే ఆయన భ్రమల్లో బతుకుతున్నారని జేడీయూ నేతలు కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద చిరాగ్ పాశ్వాన్ రెండు ప్రధాన పార్టీలకూ దగ్గరగా వ్యవహరిస్తూ కీలకంగా మారాలని యోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News