ఆశీర్వాదం దొరుకుతుందా?

దివంగత రాజ్యసభ సభ్యుడు, లోక్ జనశక్తి (ఎల్ జే పీ) అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా ఒంటరయ్యారు. రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. [more]

Update: 2021-08-04 16:30 GMT

దివంగత రాజ్యసభ సభ్యుడు, లోక్ జనశక్తి (ఎల్ జే పీ) అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా ఒంటరయ్యారు. రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు జనంలోకి వెళ్లాలని చిరాగ్ పాశ్వాన్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ప్రజల్లో తనకు, తన కుటుంబానికి గల పట్టును నిరూపించుకునేందుకు ‘జన్ ఆశ్వీరాద్’ యాత్రను చిరాగ్ పాశ్వాన్ ప్రారంభించారు. తన తండ్రి జన్మదినమైన జులై 5న దీనికి శ్రీకారం చుట్టారు. దివంగత నేత సొంత నియోజకవర్గమైన హాజీపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు.

తన తండ్రి బాటలోనే…?

హాజీపూర్ నుంచే రామ్ విలాస్ పాశ్వాన్ ఎనిమిది సార్లు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. హాజీపూర్ ను రామ్ విలాస్ పాశ్వాన్ తన కర్మభూమిగా పేర్కొనేవారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. నరేంద్రమోదీ మంత్రివర్గ విస్తరణలో ఆయన చోటు సంపాదించుకున్నారు. ఆహారశుద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రస్తుతానికి బాబాయ్ పశుపతి, అబ్బాయ్ చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా బద్ధశత్రువులు. ఒకరి పొడ అంటే మరొకరికి ఎంతమాత్రం గిట్టదు. పార్టీకి గల ఆరుగురు ఎంపీల్లో అయిదుగురు పశుపతి వెంట వెళ్లిపోయారు. అసలైన ఎల్ జే పీ తనదేనని పశుపతి ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పశుపతి నాయకత్వంలోని ఎల్ జే పీ నే అసలైన పార్టీ అని ప్రకటించారు. దీంతో చిరాగ్ పాశ్వాన్ దెబ్బతిన్నారు. చివరికి పశుపతిదే పైచేయి అయినది.

రాజకీయంగా నిలదొక్కుకునేందుకు….?

ఈ నేపథ్యంలో అన్నివిధాలా ఒంటరైన 38 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా నిలదొక్కుకునేందుకు జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన జన్ ఆశ్వీరాద్ యాత్రతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన బాగానే ఉంది. తన తండ్రి ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారని, వారి మద్దతుతోనే రాజకీయాల్లో రాణించారని, తానూ ఆయన బాటలోనే ప్రయాణిస్తున్నానని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. తన బాబాయి పశుపతి కుమార్ పాశ్వాన్ కేంద్ర మంత్రి అయినప్పటికీ, పార్టీకి చెందిన అయిదుగురు ఎంపీలు ఆయన వెంట ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తన వెంటే ఉన్నారని చిరాగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మద్దతుతో పార్టీకి పూర్వవైభవం తీసుకువ స్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

రెండో భార్య కుమారుడు….

రామ్ విలాస్ పాశ్వాన్ రెండో భార్య రీనాదేవి కుమారుడైన చిరాగ్ పాశ్వాన్ బీటెక్ పట్టభద్రుడు. ఆయన గతంలో ‘మిలే హమ్ ’ అనే హిందీ చిత్రంలో కంగనా రంగౌత్ సరసన నటించారు. ఆ చిత్రం అంతగా ప్రజాదరణ పొందలేకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019 ల్లో జముయి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కొంతకాలం ఓ స్వచ్ఛంద సంస్థ నడిపారు. ఎల్ జే పీ ని చీల్చడంలో, పార్టీని దెబ్బతీయడంలో ముఖ్యమంత్రి నితీశ్ హస్తం ఉందన్నది చిరాగ్ పాశ్వాన్ ఆరోపణ. గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీని సమర్థిస్తూనే మరోపక్క నితిశ్ ను వ్యతిరేకించేవారు. అందుకే నాటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న తన పార్టీకి నితీశ్ కేవలం 25 సీట్లు కేటాయించడంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారు.

ఆరు శాతం ఓట్లు సాధించి…

135 సీట్లకు పోటీచేసి దాదాపు ఆరు శాతం ఓట్లు సాధించారు. ఒక్క సీటూ గెలవలేకపోయారు. అయితే తాను ఒంటరిగా పోటీ చేయడం ద్వారా నితీశ్ ను నష్టపరిచానని, ఆయన పార్టీ బలాన్ని 43కు పరిమితం చేయగలిగానని చిరాగ్ పాశ్వాన్ చెబుతుంటారు. అందువల్లే ఆయన పార్టీ రెండో స్థానానికి పరిమితమైందని, ఇదే తన బలమని చిరాగ్ పాశ్వాన్ చెబుతుంటారు. పార్టీకి చెందిన అయిదుగురు ఎంపీలు చౌదరి మెహబూబ్ ఆలీ ఖైసర్ (ఖగారియా),చందన్ కుమార్ (నవాడ), వీణాదేవి (వైశాలి), ప్రిన్స్ంజ్ (సమస్తిపూర్), పశుపతి కుమార్ పాశ్వాన్ (హాజీపూర్) బయటకు వెళ్లినా పార్టీ బలంగానే ఉందని, ప్రజలు తనవెంటే ఉన్నారని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. సమస్తిపూర్ మాజీ ఉప ప్రధాని, దివంగత నేత బాబూ జగ్జీవన్ రామ్ నియోజకవర్గం. హాజీపూర్ రామ్ విలాస్ నియోజకవర్గం. ఇద్దరూ దళిత నేతలుగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

 

ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News