పాపం చింతా మోహన్… ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ [more]

Update: 2021-04-05 09:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్యనే పోరు ఉండనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ బరిలోకి దిగుతున్నారు. ఆయన ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి ఎంతవరకూ సఫలమవుతాయన్నదే ప్రశ్న.

కాంగ్రెస్ పార్టీని….

2014లో రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పార్టీని ప్రజలు దూరం పెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో చింతా మోహన్ తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే అప్పుడు ఆయన వ్యక్తిగత బలం అనేకంటే వైఎస్ హవాతోనే గెలిచారని స్పష్టంగా చెప్పవచ్చు. పక్కనే ఉన్న చిత్తూరులో టీడీపీ గెలిచినా తిరుపతిలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో చింతామోహన్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పీసీసీ చీఫ్ రేసులో కూడా ఆయన పేరు విన్పించింది.

కాంగ్రెస్ పాపం ఏమీ లేదట….

ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో చింతామోహన్ అసలు బలమెంతో తేలనుంది. అయితే ఆయన తన ఓట్ల సంఖ్యను పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ కాదని, వైఎస్ వల్లనేనని ిఇటీవల వ్యాఖ్యానించారు. వైఎస్ తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమని, ఆయన హయాంలోనే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఈ వాదాన్ని బలంగా పైకి తెచ్చారని చింతామోహన్ చెబుతున్నారు.

తిరుపతి రాజధాని అంటూ….

దీంతో పాటు ఇటీవల మరో సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని తిరుపతి అవుతుందని చింతా మోహన్ చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనూ అదే ఉందన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఇలా పాత విషయాలను, కొత్త విషయాలను కలగలిపి చింతా మోహన్ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సీనియర్ నేత ట్రిక్కులు ఏమాత్రం సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News