కసితో ఒకరు….కట్టడి చేయాలని మరొకరు?

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. అవి ఏ స్థాయిలో ఉన్నా.. నాయ‌కుల మ‌ధ్య పోరు జోరందుకోవ‌డం సాధారణం. ఇప్పుడు కూడా ఇలాంటి వాతావ‌ర‌ణమే రాష్ట్రంలో క‌నిపిస్తోంది. ఈ నెల‌లోనే [more]

Update: 2020-03-13 12:30 GMT

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. అవి ఏ స్థాయిలో ఉన్నా.. నాయ‌కుల మ‌ధ్య పోరు జోరందుకోవ‌డం సాధారణం. ఇప్పుడు కూడా ఇలాంటి వాతావ‌ర‌ణమే రాష్ట్రంలో క‌నిపిస్తోంది. ఈ నెల‌లోనే రాష్ట్రంలో స్థానిక ఎన్ని క‌ల‌కు ప్రభుత్వం తెర‌దీయ‌నుంది. దీంతో అటు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ, ఇటు అధికార ప‌క్షం నుంచి నాయ‌కులు తీవ్రస్థాయిలో స‌త్తా చాటేందుకు పోటీ ప‌డుతున్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ పోరు మ‌రింత ఊపందుకుంది. వాస్తవానికి ఇక్కడ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ ఎప్పుడు పొగ‌లు సెగ‌లు క‌క్కుతూనే ఉన్నాయి. త‌న‌కు తిరుగులేద‌ని, నియోజ‌క‌వ‌ర్గం మొత్తం త‌న‌వెంటే న‌డుస్తుంద‌ని టీడీపీ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ భావిస్తారు.

పునాదులను బలపర్చుకునేందుకు….

అయితే, వైసీపీ త‌ర‌ఫున ఇక్కడ జెండా పాతిన కొఠారు అబ్బయ్య చౌద‌రి మ‌రింత దూకుడుగా వ్యవ‌హ‌రించి చింత‌మ‌నేనికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చెక్ పెట్టారు. దీంతో ఇక్కడ కొఠారి మ‌రోసారి పునాదుల‌ను బ‌ల ప‌రుచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా చింత‌మ‌నేని ప్రభాకర్ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కూడా అంటే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో నూ ఆయ‌న విజ‌యం సాధించేందుకు ప్రయ‌త్నించారు. అస‌లు దెందులూరులో త‌న‌ను ఓడించే వాళ్లే ఇంకా పుట్టలేద‌ని.. త‌న హ్యాట్రిక్ గెల‌ుపు ఖాయ‌మ‌ని ఆయ‌న ప‌దే ప‌దే బీరాలు పోతూ చెప్పేవారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం…

అయితే, వైసీపీ దూకుడు, టీడీపీపై వ్యతిరేక క‌ల‌గ‌లిసి చింత‌మ‌నేని ప్రభాకర్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయి. అబ్బయ్య చౌద‌రి ఆయ‌న ఊహింన‌ విధంగా 17 వేల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ ప‌రిణామంతో చింతమ‌నేని ప్రభాకర్ సైలెంట్ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న జైలులో కూడా ఉండి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే, ఇప్పుడు త్వర‌లోనే స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌రోసారి నాయ‌కులు ఓట్లు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో త‌న ఆధిప‌త్యం చూపించేందుకు క‌సితో ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మూడు మండ‌లాలు ఉన్నాయి.

గాలివాటం కాదని…

మూడు జెడ్పీసీలు, మూడు ఎంపీపీలను త‌న ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ ఎమ్మె ల్యే కొఠారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త‌న అనుచ‌రులు, కార్యక‌ర్తల‌ను ఇప్పటికే ఆయ‌న లైన్‌లో పెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచింది గాలి వాట‌పు గెలుపు కాద‌ని.. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ త‌న స‌త్తా చాటి తానేంటో ఫ్రూవ్ చేసుకోవాల‌ని క‌సితో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో చింత‌మనేని ప్రభాకర్ కూడా మౌనం వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్రజాచైత‌న్య యాత్రల పేరిట ఆయ‌న ప్రజ‌ల్లో తీరిగేందుకు రెడీ అయ్యారు.

ఒకరిపై ఒకరు పై చేయి…..

“ఇది నా కంచుకోట‌. ఎలాగైనా స‌త్తా చాటాలి. గ‌త ఎన్నిక‌ల్లో అంటే.. జ‌గ‌న్‌పై మోజుతో ప్రజ‌లు వైసీపీకి ఓట్లేశారు. ఇప్పుడు మాత్రం టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు“ -అంటూ చింత‌మ‌నేని ప్రభాకర్ త‌న అనుచ‌రుల‌కు బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద‌వేగి, పెద‌పాడు, ఏలూరు రూర‌ల్ మండ‌లంలో గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు పై చేయి సాధించేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేస్తుండ‌డంతో ఒక్కసారిగా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ రాజ‌కీయ పెనుతుఫాను రాబోతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

Tags:    

Similar News