చింతమనేని చివరకు కొంపముంచుతాడా ఏంది?

రాజ‌కీయాల్లో ఎప్పుడు.. ఎలాగైనా జ‌ర‌గొచ్చు. ఎవ‌రు ఎవ‌రితో అయినా.. క‌లిసి ముందుకు సాగొచ్చు. కానీ, అలా క‌లిసేవారు.. క‌ల‌సిక‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారు.. గ‌తంలో ఏం చేశార‌నేది కీల‌కం. వారు [more]

Update: 2021-03-18 03:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు.. ఎలాగైనా జ‌ర‌గొచ్చు. ఎవ‌రు ఎవ‌రితో అయినా.. క‌లిసి ముందుకు సాగొచ్చు. కానీ, అలా క‌లిసేవారు.. క‌ల‌సిక‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారు.. గ‌తంలో ఏం చేశార‌నేది కీల‌కం. వారు నిజంగానే రాజ‌కీయాలు చేస్తున్నారా ? లేక ప్రజ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు వ్యవ‌హ‌రిస్తున్నారా ? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన‌లో చ‌ర్చనీయాంశాలుగా మారాయి. ఏలూరు కార్పొరేష‌న్‌లో టీడీపీ అభ్యర్థులు కొన్ని డివిజ‌న్లలో నామినేష‌న్లు ఉపసంహ‌రించుకునేందుకు సిద్ధం కావ‌డంతో… ఆ డివిజ‌న్లలో తాను జ‌న‌సేన త‌ర‌ఫున ప‌ర్యట‌న చేసి ప్రచారం చేస్తాన‌ని చెప్పారు. నిజానికి ఇదొక సంచ‌ల‌న ప్రక‌ట‌న.

గత ఎన్నికల్లో మాత్రం…..

ఎందుకంటే.. గ‌త 2019 సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యంంలో ఇదే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఇద్దరూ వ‌చ్చి దెందులూరులో పోటీ చేయాల‌ని.. వారిని ఖ‌చ్చిత‌గా తాను ఓడించి తీరుతాన‌ని ప్రక‌టించారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌ర‌ఫున అభ్యర్థి విజ‌యం సాధించ‌గా.. ఇటు ప‌వన్ పార్టీ అభ్యర్థి, అటు చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఇద్దరూ ఓడిపోయారు. మ‌రి ఇంత‌లోనే ఆయ‌న‌కు జ‌న‌సేన‌పై అంత ప్రేమ ఎక్కడి నుంచి వ‌చ్చింది ? ఎందుకిలా వ్యాఖ్యానించారు? అనేది కీల‌క అంశంగా మారింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. అనూహ్య విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో……

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు ముగిసిన నాలుగు విడ‌త‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన అభ్యర్థులు ఉన్న చోట టీడీపీ స‌ర్దుబాటు చేసుకుంది. టీడీపీ స‌ర్దుబాటు కోరిన చోట జ‌న‌సేన సర్దుకు పోయింది. కొన్ని చోట్ల రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఫ‌లితాలు వెల్లడైన త‌ర్వాత .. అంద‌రూ ఈ విష‌యం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక‌, తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం కొన‌సాగుతోంది. కొన్ని చోట్ల జ‌న‌సేన‌-టీడీపీ సంయుక్తంగా అవ‌గాహ‌న‌కు వ‌చ్చి పోటీ చేస్తున్నాయి.

లైన్ ను ముందే ఓపెన్ చేసి….

ఇక‌, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చింత‌మ‌నేని ప్రభాక‌ర్ ఈ ప‌రిణామాలు గ్రహించి ముందే కూసిన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని.. అందుకే తాను స్వయంగా రంగంలోకి దిగి.. జ‌న‌సేన అభ్యర్థుల‌ను గెలిపించేందుకు కృషి చేస్తాన‌ని ప్రక‌టించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి చింత‌మ‌నేని ప్రభాక‌ర్ దూకుడు పార్టీ ర‌హ‌స్యాల‌ను స్పష్టం చేస్తోంద‌ని.. టీడీపీలో మెజార్టీ నేత‌లు ఏ లైన్లో ఉన్నారో అదే లైన్‌ను ఆయ‌న ముందే ఓపెన్ చేశార‌ని అంటున్నారు.

Tags:    

Similar News