ఎందుకు ఈమెకు అంత పట్టుదల?

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు సీనియర్ నేతల నుంచి మెళుకువలను నేర్చుకోవాలి. వారితో సఖ్యతగా మెలిగి ప్రజల్లో గ్రిప్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. రాజకీయాలంటే తెలియకుండానే [more]

Update: 2020-12-17 06:30 GMT

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు సీనియర్ నేతల నుంచి మెళుకువలను నేర్చుకోవాలి. వారితో సఖ్యతగా మెలిగి ప్రజల్లో గ్రిప్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. రాజకీయాలంటే తెలియకుండానే అదృష్టం కొద్దీ పదవులు దక్కిన వారు తొలిసారే అసంతృప్తిని కొని తెచ్చుకుంటున్నారు. అందులో పార్లమెంటు సభ్యులు అంటే పెద్దగా ప్రజల్లో పని ఉండదు. అయితే తోటి పార్టీ నేతలతో విభేదాలు తెచ్చుకుని కొత్తగా ఎన్నికైన వారు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇందులో ముందు వరసలో ఉన్నారు అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనూరాధ.

కొత్తగా ఎన్నికై…..

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచి మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి, హర్షకుమార్ వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. రిజర్వ్ డ్ కావడంతో కొత్త వారికి అవకాశాలు పార్టీలు ఇస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో బాలయోగి కుమారుడు హరీశ్ చంద్రకు టీడీపీ టిక్కెట్ ఇవ్వగా, చింతా అనూరాధకు వైసీపీ టిక్కెట్ కేటాయించింది. అంతకు ముందు ఇక్కడ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు వైసీపీలోకి వచ్చినా ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా చింతా అనూరాధకు ఇచ్చారు.

మంత్రితో వైరం..?

ీఅయితే తొలిసారి ఎన్నికైన ఎంపీ చింతా అనూరాధకు పార్టీ నేతలతో పొసగడం లేదు. ముఖ్యంగా తన భాగస్వామ్యం లేకుండా పార్టీ కార్యక్రమాలు జరగడంపై చింతా అనూరాధ మండిపడుతున్నారు. మంత్రి పినిపి విశ్వరూప్ ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె మంత్రి పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. పదిహేను నెలలుగా ఇదే తంతు జరుగుతున్నా పార్టీ సీనియర్ నేతలు కూడా పట్టించుకోవడం లేదు.

అన్నింటికి దూరంగా…..

మంత్రి వస్తున్నారంటే చింతా అనూరాధ ఆ కార్యక్రమానికి కావాలని గైర్హాజరవుతున్నారట. దీంతో అధికారులు సయితం తలలు పట్టుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా చింతా అనూరాధ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మంత్రి విశ్వరూప్ కూడా ఎంపీ చింతా అనూరాధ వ్యవహారంపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ హైకమాండ్ కూడా సీిరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కొత్తగా ఎంపీగా ఎన్నికైన చింతా అనూరాధ రాజకీయాల్లో నిలదొక్కుకునే ఆలోచనలో లేనట్లే కనపడుతున్నారు.

Tags:    

Similar News