ఎప్పడూ జగడమేనా…?

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఛైనా డజనుకు పైగా దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. దాదాపు ప్రతి దేశం తోనూ దానికి కయ్యమే. ఇక [more]

Update: 2021-05-22 16:30 GMT

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఛైనా డజనుకు పైగా దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. దాదాపు ప్రతి దేశం తోనూ దానికి కయ్యమే. ఇక భారత్ తో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడువేలకు పైగా కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును నిత్యం వివాదాస్పదంగా మార్చడంలో దాని తీరే వేరు. ఎప్పుడూ ఏదో ఒక పేరుతో రెండు దేశాల మధ్య సరిహద్దుగా పిలిచే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద ఉద్రిక్తతలకు ఊపిరిలూదడం బీజింగ్ నైజం. గతఏడాది తూర్పు లద్దాఖ్లో సరిహద్దులను యుద్ధభూమిగా మార్చింది. నాటి ఘటనల్లో 22 మందికి భారతీయ జవాన్లు అమరులయ్యారు. ఆ దేశానికీ అంతే స్థాయిలో నష్టం జరిగినప్పటికీ ఆ విషయం చెప్పుకోలేదు. తరవాత సరిహద్దుల్లో కృత్రిమ గ్రామాల నిర్మాణం, ఎగువనున్న బ్రహ్మపుత్ర నదీ జలాలను బిగపట్టడం వంటి చర్యల ద్వారా భారత్ ను ఇరుకున పెట్టింది.

5 జీ సిగ్నల్ కేంద్రం…

తాజాగా భారత్ సరిహద్దుల్లోని టిబెట్ లో అత్యాధునిక సౌకర్యాలతో 5జి సిగ్నల్ స్టేషన్ నెలకొల్పింది. ఇది భారత్, భూటాన్ సరిహద్దులకు అత్యంతసమీపంలోనే ఉండటం గమనార్హం. ఈ స్టేషన్ ద్వారా భారత్ పై బీజింగ్ కవ్వింపులకు దిగుతోంది. ఒకప్పటి స్వతంత్ర దేశమైన టిబెట్ ను చైనా ఆక్రమించుకుని దానికి స్వయం ప్రతిపత్తి కల్పించింది. టిబెట్ మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు టిబెట్ లోని నాగర్జ్ కౌంటీలో 5జీ సిగ్నల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో (5,374 మీటర్లు) దీనిని నిర్మించింది. గన్ బాలా రాడార్ స్టేషన్ వద్ద దీనిని నిర్మించింది. భారత సైనిక స్థావరాలకు, సరిహద్దులకు అతి సమీపంలో ఇది ఉండటం గమనార్హం.

చైనా సైన్యానికి…?

5జీ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు వల్ల చైనాకు ప్రయోజనమన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనివల్ల చైనా సైన్యానికి అధునాతన, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సౌకర్యాలు లభిస్తాయి. కొండలు, గుట్టలు, పర్వతాల మయంగా ఉండే సరిహద్దుల్లో సైనికులకు ఏ సమాచారం చేరవేయాలన్నా, సందేశం పంపాలన్నా ఇబ్బందిగా ఉండేది. అరకొర, అస్పష్ట సమాచారం అందేది. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయింది. మారుమూల ప్రాంతాల్లో గస్తీ కాసే జవానుకు కూడా ఇక నుంచి తక్షణం విషయాన్ని సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియజేయవచ్చు. అదే సమయంలో భారతీయ జవాన్ల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచే సౌకర్యం కలుగుతుంది. సరిహద్దుల్లోని భారతీయ సైనిక శిబిరాలు, వాటి శిక్షణ కార్యకలాపాల తీరుతెన్నుల గురించి కొంతవరకైనా తెలుసుకునే అవకాశం ఈ సిగ్నల్ కేంద్రం వల్ల కలుగుతుంది. 5జీని భారత్ అధికారికంగా ఇంకా ఆమోదించలేదు. అయితే భద్రతా అవసరాల మేరకు దీనిని మున్ముందు ఆమోదించే అవకాశం ఉంది.

భారత్ సయితం…?

సాధారణంగా ఏ దేశమైనా సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా రహదారులు, వంతెనలు, చిన్నపాటి విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు నిర్మిస్తాయి. వీటివల్ల అత్యవసర సమయాల్లో సైనికులు, ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రి తరలింపునకు సౌకర్యంగా ఉంటుంది. మౌలిక వసతులతోపాటు ఈ నిర్జన ప్రదేశాల్లో కనీస కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పిస్తాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్ల నియంత్రణకు పటిష్టమైన కంచెలను భారత్ నిర్మించింది. భూటన్ ,మయన్మార్, నేపాల్ వంటి మిత్రదేశాల సరిహద్దుల్లో కేవలం చెక్ పోస్టుల ఏర్పాటుకే భారత్ పరిమితమైంది. తీరప్రాంత సరిహద్దు గల శ్రీలంకతో సముద్ర గస్తీకే పరిమతమైంది. చైనా తాజా చర్యలతో భారత్ సైతం అదేస్థాయిలో దీటుగా స్పందించాల్సిన అవసరం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News