నీచపు నడకను మార్చుకోవా?

సరిహద్దుల్లో చిచ్చు రేపడం చైనాకు అలవాటుగా మారింది. ఆ విధానాన్ని మానడం లేదు. అగ్రదేశంగా ఎదుగుతున్నా, ప్రపంచ శక్తిగా అవతరిస్తున్నా తన కురచ బుద్ధులను విడనాడటం లేదు. [more]

Update: 2021-01-01 16:30 GMT

సరిహద్దుల్లో చిచ్చు రేపడం చైనాకు అలవాటుగా మారింది. ఆ విధానాన్ని మానడం లేదు. అగ్రదేశంగా ఎదుగుతున్నా, ప్రపంచ శక్తిగా అవతరిస్తున్నా తన కురచ బుద్ధులను విడనాడటం లేదు. సంయమనానికి, సహనానికి ససేమిరా అంటోంది. గత ఏడెనిమిది నెలలుగా తూర్పు లద్దాఖ్ లో ఉద్రిక్తతలకు ఊపిరులూదుతున్న బీజింగ్ తాజాగా మరో వివాదానికి తెరలేపింది. తద్వారా భారత్ కు కొత్త తలనొప్పులను కల్పిస్తోంది. ఘర్షణ వాతావరణానికి కారణమవుతోంది. ఒక పక్క అంతర్జాతీయ వేదికలపై నీతులు వల్లిస్తున్న చైనా అధినేత జిన్ పింగ్, సరిహద్దుల్లో మాత్రం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

మూడు గ్రామాలను నిర్మించి….

తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా మూడు గ్రామాలను నిర్మించింది. ఇవి వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కు అతి సమీపంలో ఉండటం గమనార్హం. గ్రామాల నిర్మాణ విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. దిల్లీ కేంద్రంగా నడిచే ఎన్డీటీవీ (న్యూదిల్లీ టెలివిజన్ )ఈ చిత్రాలను సంపాదించింది. సరిహద్దుకు సమీపంలోని కొండపైన వీటిని నిర్మించినట్లు చిత్రాలు స్పష్టీకరిస్తున్నాయి. తొలి గ్రామాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 17న నిర్మించారు. ఇక్కడ సుమారు 20 ఇళ్లకు పైగా ఉన్నాయి. నవంబరు 28 నాటికి మరో రెండు గ్రామాల నిర్మాణం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు గ్రామాల్లో కలిపి 40 నుంచి 50 కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇప్పటిదాకా గ్రామాల విషయం వెలుగులోకి రాకుండా చైనా పకడ్బందీ చర్యలు తీసుకుంది. దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులు (విపరీతమైన మంచు) కూడా తోడయ్యాయి. అయినప్పటికీ భారతీయ నిఘా విభాగం విషయాన్ని పసిగట్టింది. చైనా బండారాన్ని బయటపెట్టింది. దాని నయ వంచనను అంతర్జాతీయ
సమాజానికి ఎరుకపరిచింది.

చట్టబద్ధను ప్రశ్నించేలా…?

మెక్ మహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నించేందుకు వీలుగా ఈ గ్రామాలను చైనా నిర్మించినట్లు చెబుతున్నారు. స్వాతంత్ర్యానికి ముందు నాటి బ్రిటీష్ అధికారి మెక్ మహన్ భారత్- చైనా మధ్య సరిహద్దును నిర్థారించారు. అందుకే దీనికి మెక్ మహన్ రేఖ అని కూడా పిలుస్తుంటారు. కాలక్రమంలో అది వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ) గా మారింది. దీనిని గుర్తించనంటోంది చైనా. దీంతోనే గత ఏడు దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఎన్నిసార్లు ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగినా అడుగు ముందుకు పడటం లేదు. బీజింగ్ మొండి వైఖరే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్-చైనా-భూటాన్ సరిహద్దులు కలిసే బూమ్లా కనుమకు అయిదు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ ఇళ్లు ఉన్నాయి.

మరో సంక్షోభం తప్పదా?

2017 లో భారత్- చైనా బలగాల మధ్య డోక్లాం ప్రతిష్ఠంభన చోటుచేసుకున్న ప్రాంతానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. నాటి ప్రతిష్ఠంభన సద్దుమణగడానికి చాలా సమయం పట్టింది. చైనా తాజా చర్య వల్ల మరో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణరంగ నిపుణులు బ్రహ్మ చెలాని హెచ్చరించారు. బలగాల మోహరింపును మరింతగా పెంచాలని , నిఘాను పటిష్టం చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో చైనా ద్వంద్వ నీతిని అంతర్జాతీయంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. చైనా సర్కారు అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ సైతం గ్రామాల నిర్మాణ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే వారు పశువుల కాపరులని బుకాయిస్తోంది. నిజంగా పశువుల కాపరులు అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు నీళ్లు నములుతోంది. ఇక్కడే బీజింగ్ ద్వంద్వ నీతి బహిరంగమవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News