నయవంచన… దీని ఇంటి పేరు

నయవంచన చైనా నైజం.. నమ్మకద్రోహానికి డ్రాగన్ నిలువెత్తు నిదర్శనం అధినేతల పర్యటనల సమయంలో పలకరింపులు, కౌగిలింతలు, కరచాలనాలతో హడావిడి చేయడం బీజింగ్ కు వెన్నతో పెట్టిన విద్య. [more]

Update: 2020-06-27 16:30 GMT

నయవంచన చైనా నైజం.. నమ్మకద్రోహానికి డ్రాగన్ నిలువెత్తు నిదర్శనం అధినేతల పర్యటనల సమయంలో పలకరింపులు, కౌగిలింతలు, కరచాలనాలతో హడావిడి చేయడం బీజింగ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఎంత గాఢంగా హత్తుకుంటుందో అదే స్ధాయిలో విశ్వాసఘాతకానికి పాల్పడటం చైనా విధానంగా మారింది. ఇది స్థూలంగా చైనా గురించి దౌత్యవర్గాల్లో నెలకొన్న అభిప్రాయం. ఇరుగు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, వాటిని రెచ్చగొట్టడం, అవకాశం చుాసి దాడి చేయడం బీజింగ్ నేతల దుందుడుకుతనానికి నిదర్శనం. దాదాపు అన్ని ఇరుగుపొరుగు దేశాలతో ఇదే పరిస్ధితి.

మొదటి నుంచీ అంతే……

భారత్ విషయంలో బీజింగ్ మెుదటినుంచి నమ్మకద్రోహానికి పాల్పడుతూనే ఉంది. 1962 నాటి యుద్ధం నుంచి నేటి లడఖ్ లో ఘర్షణ వరకు నమ్మించి మెాసం చేయడమే అవుతుంది. రెండుదేశాల మద్య గల దాదాపు 4 వేలమీటర్ల సరిహద్దు పై ఏకాభిప్రాయం లేదు. దీనినే వాస్తవాదీన రేఖ అని, మెక్ మెహన్ రేఖ అని వ్యవహరిస్తారు. 60 వ దశకంలో నేటి చైనా ప్రదాని చౌఎన్ లై , అధ్యక్షుడు మావో జెడాంగ్ భారత్ తో స్నేహం నటించారు. ‘ పంచశీల’ ఒప్పందంపై సంతకాలు చేశారు. సహజంగా సోషలిస్టు భావాలుగల నాటి భారత ప్రధాని నెహ్రూ చైనాను విశ్వసించారు. దానికి స్నేహహస్తం చాటారు. ఒక కమ్యుానిస్టు ప్రభుత్వం మరో సోషలిస్టు దేశంపై దాడిచే యదని ఆయన భావించారు. నాటి అగ్ర రాజ్యాలైన అమెరికా – సోవియట్ యుానియన్ ల మధ్య సమదూరం పాటించారు. చైనాకు ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యత్వం దక్కడం వెనుక నెహ్రు కృషి ఎంతో ఉంది. మెుదటి శాశ్వత సభ్యత్వం భారత్ కు ఇచ్చేందుకు సోవియట్ యునియన్ సుఖంగా ఉన్నప్పటికి పెద్ద దేశమైన చైనాకు ఇవ్వాలని నెహ్రుా సూచించారు.

నెహ్రూ టైంలో ఏం జరిగిందో?

ఇంత చేసినా విశ్వాస ఘతాకానికి పాల్పడిన చైనా 1962 లో భారత్ పై దాడి చేసింది. ఆక్సాయ్ బిన్ లో ప్రాంతాన్ని ఆక్రమించింది. గాల్వాన్ కు తమ సరిహద్దును మార్చింది. 1962 అక్టోబరు 20 న రోజులపాటు జరిగిన యుద్ధం దాదాపు 138 మంది భారత్ సైనికులు అమరులయ్యారు. కొంత మందిని చైనా బంధించింది. మరికొంతమంది కానరాకుండా పోయారు. చైనా సైనికులు 722 మంది హతులైనట్లు అంచనా. అంతిమంగా నాటియుద్ధంలో భారత్ ఓటమి పాలైంది. నాటి ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి వి.కె.కృష్ణమీనన్ దీనిని అవమానంగా భావించారు. వామపక్ష దేశమైన చైనా తమను నమ్మించి మెాసగించిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆవేదన, అవమాన భారంతో నే నెహ్రు మరణించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. 1962 మాదిరిగానే ఇప్పుడు కుాడా బీజింగ్ నమ్మకద్రోహానికి పాల్పడింది. నాడు నెహ్రు ను మెాసగించిన మాదిరిగానే నేడు మెాదీని మెాసగించింది.

చేతులు కలిపారనుకుంటే…?

గత ఏడాది అక్టోబరు 11,12 తేదీ ల్లో చైనా అధినేత జిన్ పింగ్ భారత్ లో పర్వటించారు. తమిళనాడు రాజధాని చెన్నైనగరానికి సమీపంలోని మహాబలిపురంలో రెండురోజుల పాటు పర్యటించారు. మహా బలిపురాన్ని గతంలో మమళ్ళపురం అని వ్యవహరించారు. మోదీతో పాటు జిన్ పింగ్ ఊయలలో ఊగారు. పంచెకట్టుతో ప్రజలను అలరించారు. గంభీర ప్రసంగాలు చేశారు. ఉభయదేశాలు కలసి పనిచేస్తే ప్రపంచాన్ని ఏలగలవని నమ్మబలికారు. ప్రపంచంలోనే రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు పెద్దవని పేర్కొన్నారు. చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని వంటి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. శాంతి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దీంతో బీజింగ్ వైఖరి మారిందని అంతాభావించారు. జిన్ పింగ్ పర్వటన ముగిసిన 8 నెలలు గడవక ముందే దాడికి దిగడం ద్వారా బీజింగ్ తన నైజాన్ని మరోసారి చాటుకుంది. గాల్వన్ లోయ తనదేనని పేర్కొనడం ద్వారా దుందుడుకుతనాన్ని ప్రదర్శించింది. ఈనెల 6 వ తేదిన ఉభయ దేశాల సైనిక జనరల్ తో చర్చలు జరిపారు. అంతా సర్దుకుంటుందని భావిస్తున్న సమయంలో అనుాహ్యంగా దాడికి దిగడం ద్వారా చైనా మరోసారి కుటిలత్వాన్ని ప్రదర్శించింది. 20 మంది సైనికులు వీరమరణం పొందారు. బందీలుగా పట్టుకున్న మరో 10 మందిని విడుదల చేసింది దాడికి దిగడం ద్వారా శాంతి ఒప్పందాలను చాపచుట్టింది. 1993 లో పి.వి.నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు కుదిరిన శాంతి ఒప్పందానికి నీళ్ళు వదిలింది. ఎల్ఓసీ కి రెండువైపులా గల బలగాలను ఉపసంహరించుకోవాలన్నది ఒప్పందం సారాంశం. ఎవరైనా గీత దాటితే అవతలి పక్షం చెప్పగానే వెనక్కి వచ్చేయాలన్నది కీలక అంశం.

నమ్మడానికి లేదు…..

1996 లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందాన్ని కుాడా బీజింగ్ తుంగలో తొక్కింది. గతకొంతకాలంగా అంతర్జాతీయంగా భారత్ కు లభిస్తున్న గౌరవం, పేరుప్రతిష్టలు, అనుసరిస్తున్న విధానాలు చైనాకు కంటికింపుగా మారాయి. ముఖ్యంగా సంపన్న దేశాల కుాటమిగా పేరుగాంచిన జి-7 లో భారత్ కు సభ్యత్వం ఇస్తామని అమెరికా పేర్కొనటం బీజింగ్ కు మింగుడు పడటంలేదు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ కలసి ‘చతుర్బుజ ‘ కుాటమిగా ఏర్పడటం కుాడా దానికి కంటక ప్రాయంగా మారింది. కరోనా మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొన్నతీరు, మరణాల రేటును నియంత్రించడం వంటి చరర్యలను బీజింగ్ జీర్ణించుకోలేక పోతోంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, విస్తరణ, మౌలికసదుపాయాల కల్పనను బీజింగ్ భూతద్ధంలో చుాస్తుంది. ఇవన్నీ ఘర్షణకు దారితీశాయి. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి ఒప్పందం కుదిరినప్పటికీ బీజింగ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సదా సన్నద్ధంగా ఉండాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News