బంధం గట్టిదేనటగా

ఏడు నెలల జగన్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి సాధిస్తోందని తెలంగాణా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యనే కితాబు ఇచ్చారు. జగన్ బాగానే పనిచేస్తున్నారని [more]

Update: 2020-01-04 13:30 GMT

ఏడు నెలల జగన్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి సాధిస్తోందని తెలంగాణా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యనే కితాబు ఇచ్చారు. జగన్ బాగానే పనిచేస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇది జరిగిన తరువాత తాజాగా మరోసారి ఆయన జగన్ ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ కి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రాతో ఎటువంటి ఇబ్బందులు లేవు, మేము కలసిమెలసి ఉంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే టీఆర్ఎస్ అజెండా అని కూడా అన్నారు.

దూరం దగ్గరైందా…?

నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా నెగ్గిన మొదటి రెండు మూడు నెలల్లో ఎన్నో మీటింగులు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగాయి. కేసీఆర్ విజయవాడ వస్తే జగన్ ఇంటికి వెళ్ళేవారు, ఇద్దరూ కలసి స్వాముల పీఠాలకు వెళ్ళేవారు. మరో వైపు జగన్ హైదరాబాద్ కి వస్తే చాలు కేసీఆర్ తో భేటీలు వేసేవారు. మరి ఇపుడు అలాంటి ముచ్చట్లు ఎక్కడా లేకపోవడంతో దూరం పెరిగిందని అంతా భావించారు. అదే సమయంలో రాజకీయపరమైన నిర్ణయాలు కూడా ఇద్దరికీ కాస్తా ఎడం పెంచాయని అనుకున్నారు.

ఉమ్మడి నీటి ప్రాజెక్టులకు చెక్…

గోదావరి జలాలను ఒడిసిపట్టి కృష్ణా నదికి పంపించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్, జగన్ కలసి కొత్తల్లో ఒక ప్రతిపాదన చేశారు. లక్ష కోట్ల వరకూ ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసుకున్నారు. ఇది కనుక జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు, తెలంగాణాలోకి మరో నాలుగు జిల్లాలకు కూడా సాగు నీరు, తాగు నీరు అందుతుందని భావించారు. ఏమైందో తెలియదు కానీ తరువాత ఎవరికి వారే సొంత ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేయమని అధికారులను ఆదేశించారు. ఇక పోలవరం మీద కృష్ణా రివర్ బోర్డ్ కు తెలంగాణా ఫిర్యాదు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆంధ్ర అధికారులు ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీ లొల్లి…..

ఇది చాలదన్నట్లుగా ఆర్టీసీ లొల్లి ఒకటి ఇద్దరి సీఎం లను మరింత దూరం చేసిందని అంటున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయమని తెలంగాణా ఉద్యోగులు ఆందోళన చేస్తే ఏపీ సీఎం జగన్ దాన్ని ఆచరణలో చేసి చూపించారు. దాని మీద కేసీఆర్ గుస్సా అయ్యారు. ఏపీలో ఆర్టీసీ ఎక్కడ విలీనం అయిందని ఎగతాళి కూడా చేశారు. దీని మీద ఇక్కడ మంత్రి పేర్ని నాని కూడా హాట్ కౌంటర్లు ఇచ్చారు. కొత్త ఏడాదితోనే ఆర్టీసీని విలీనం చేసి జగన్ చూపించారు కూడా. ఇవన్నీ కూడా ఇద్దరు మధ్య కొత్త విభేదాలు స్రుష్టించారని అనుకున్నారు.

అంతలోనే మార్పు …

కేటీఆర్ తాజాగా రెండు సందర్భాలో జగన్ ని పొగడం అంటే మామూలు విషయం కాదు, జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా ఇప్పటికైతే దాఖలాలు లేవు. అయితే జగన్ తమకు మంచి మిత్రుడు అని కేటీఆర్ అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీతో దూరంగా ఉంటున్న టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ అని ఆ మధ్య హడావుడి చేసింది. మళ్ళీ దాన్ని బయటకు తీసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. దాంతో జగన్ అవసరం రాజకీయంగా పడిందని అంటున్నారు. అందుకే ఈ ముందస్తు పొగడ్తలు అన్న అంచనాలు ఉన్నాయి. మరి జగన్ విషయంలో అయితే ఇప్పటికీ బీజేపీతో మంచిగానే ఉంటున్నారు. పైగా జగన్ ఏపీ సీఎంగా ఇపుడు బాగానే కుదురుకున్నారు. దాంతో గతంలోలా తరచూ కేసీఆర్ తో భేటీలు ముచ్చట్లు ఉండే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి.

Tags:    

Similar News