ముందు ముందు కష్టాలే

ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు నాయకులకు పెద్దగా టైం ఇవ్వడంలేదు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరిస్తే మంచిదే. లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ పార్టీని, నాయకున్ని ఓడించేస్తున్నారు. చంద్రబాబు [more]

Update: 2019-07-22 05:00 GMT

ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు నాయకులకు పెద్దగా టైం ఇవ్వడంలేదు. తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరిస్తే మంచిదే. లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ పార్టీని, నాయకున్ని ఓడించేస్తున్నారు. చంద్రబాబు విషయంలో ఇది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇపుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన సైతం అలవి కాని హామీలను ఇచ్చారు. ఇపుడు చూస్తే బాబుకు ఉన్న రాజకీయ అనుకూలత కూడా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి లేకపోవడం విశేషం. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇపుడు అన్ని వైపుల నుంచి రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా కూడా పోరాడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. ఓ విధంగా చూసుకుంటే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి ఇది అగ్ని పరీక్ష అనే చెప్పాలి. ఓ వైపు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో అలా టీడీపీ నేతలు గట్టిగా విమర్శలతో తగులుకుంటున్నారు. ఇంకో వైపు బీజేపీ ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోతోంది. అన్ని అనర్ధాలకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కారణమన్నట్లుగా మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం విషయం చూస్తే ఏపీకి సాయం చేస్తారో లేదో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. మొత్తం మీద వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్న ఆనందమే తప్ప మిగిలినవన్నీ కూడా విషమ పరీక్షలే ఎదుర్కొంటున్నారు.

అన్ని విధాలుగా అనుకూలం….

ఇక చంద్రబాబు 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినపుడు ఆయనకు అన్ని విధాలుగా సాయం లభించింది. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక్కడ బీజేపీ మంత్రులను బాబు తీసుకున్నారు. దన్నుగా కేంద్రం నాలుగేళ్ళ పాటు బాబుని కాపాడింది. ఆయన విదేశీ యాత్రలు కానీ, అలవి కాని విధంగా చేసిన అప్పుల విషయం కానీ కేంద్రం చూసీ చూడనట్లుగా వదిలేసింది. ఇక కేంద్రం కూడా తాను చేయాల్సిన సాయం చేసింది. బాబుకు బీజేపీ మిత్రుడుగా వెంకయ్యనాయుడు అప్పట్లో ఉండి అన్ని రకాలుగా అండగా నిలిచారు. రాజకీయంగా చూస్తే ఏపీలో ఒక్క వైసీపీ తప్ప ఆయనకు ఎదురు నిలిచే విపక్షమే లేదని చెప్పాలి. పవన్ జనసేన సైతం నాలుగేళ్ళ పాటు మద్దతుగానే నిలబడింది. ఇక ఏపీ సర్కార్ కు ఉన్న, పరిమితులు ఆలోచించకుండా చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేసి తొలి అయిదేళ్ళు ఆర్ధిక ఇబ్బందులను దాటేశారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

చక్రబంధంలో జగన్….

ఇపుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు, అప్పు చేయాలన్నా రూపాయి పుట్టని వాతావరణం. కేంద్రంలో ప్రభుత్వం అర కొర సాయమే తప్ప గట్టిగా ఇచ్చేది ఏదీ లేదు. ఇక రాజకీయంగా కూడా బీజేపీతో చెలిమి లేదు. దాంతో ఇక్కడ ఆ పార్టీ నాయకులు వైసీపీని ఘాటుగా విమర్శించేస్తున్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా విఫలం అంటూ పరుష పదజాలమే ఉపయోగిస్తున్నారు. ఇంకో వైపు సామాజికపరంగా చూస్తే బలమైన కమ్మ సామాజికవర్గం టార్గెట్ వైసీపీ అన్నది స్పష్టం. దాంతో సోషల్ మీడియాలో ఉన్నదీ లేనిదీ రాసేస్తున్నారు. కాపులకు అయిదు శాతం అగ్ర కులాల రిజర్వేషన్లో వాటా కోరిన ముద్రగడ పద్మనాభం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి ఈ మేరకు లేఖ రాశారు. ఇపుడు జగన్ స్పందించకపోతే ఆయన ఉద్యమ బాట రేపైనా పట్టడం ఖాయం. మరో వైపు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంద క్రిష్ణ మాదిగా అగ్గి రాజేస్తున్నారు. మాలల విషయంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు. ఓ వైపు ఇచ్చిన హామీలకు నిధులు లేక మెల్లగా ఇబ్బందులు మొదలవుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు రాకపోవడం వెనక కూడా రాజకీయం ఉందని అంతా అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ముందు ముందు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి భారీ కష్టాలే పొంచి ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News