అభిశంసన....అంత ఆషామాషీ కాదు

Update: 2018-04-23 18:29 GMT

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగంలోని ప్రధాన వ్యవస్థలు. పరస్పరం సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సంక్షేమానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడాలి. ఏ వ్యవస్థా ఒకదానికంటే ఒకటి అధికమైంది కాదు. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది. అందువల్ల న్యాయవ్యవస్థ కీలకమైనది. అని చెబుతుంటారు. అదేవిధంగా న్యాయవ్యవస్థ తన పరిధులను అతిక్రమిస్తున్నట్లు భావిస్తే దానిని అభిశంసించే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుంది. ప్రస్తుతం జరిగింది అదే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించింది. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నందున అభిశంసన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్లు రాజ్యసభలో విపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ చెబుతున్నారు.

వెంకయ్య తిరస్కరించడంతో....

అయితే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఈ అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారు. సుదీర్ఘంగా న్యాయనిపుణులతో చర్చించిన వెంకయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం కుదరదని తేల్చిచెప్పేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పింది.వెంకయ్య నాయుడు నిర్ణయంపై అసంతృప్తిిని వ్యక్తం చేసింది. అయితే దేశ చరిత్రలో ఇంతవరకూ ఏ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అభిశంసన ద్వారా పదవిని పోగొట్టుకోలేదు. కొందరు అభిశంసన ఎదుర్కొన్నప్పటికీ ఆ ప్రక్రియకు ముందే పదవి నుంచి వైదొలిగారు. విశేషం ఏమిటంటే ఇంతవరకూ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఇలాంటి చేదు అనుభవం చూడాల్సి వస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అనుకున్నారు. కాని అలాంటిదేమీ లేకుండానే అభిశంసన తీర్మానాన్ని వెంకయ్యనాయుడు తిరస్కరించడం ఆయనకు ఊరట కల్గించే అంశమే. అయినా అభిశంసన గతంలో ఎందరు ఎదుర్కొన్నారు? ఏమైందన్న విషయాలను ఒకసారి చూద్దాం.

ఐదు అభియోగాలు.....

ఒడిషాకు చెందిన దీపక్ మిశ్రా ఈ ఏడాది అక్టోబరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనపై ఐదు ప్రధాన అభియోగాలను కాంగ్రెస్ మోపింది. ఒడిశాలోని ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కేసులో లంచాలు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. ఈ ట్రస్ట్ కేసును సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు తనకున్న పాలన, న్యాయపరమైన అధికారాలను జస్టిస్ దీపక్ మిశ్రా ఉపయోగించుకుని కేసును పక్కదారి పట్టించారన్నది మరో ఆరోపణ. ఈ కేసు లిస్టింగ్ అంశంపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు పాత తేదీలతో కూడిన నోట్ ను రిజిస్ట్రీ ద్వారా న్యాయమూర్తుల ముందు ఉంచారన్నది జస్టిస్ దీపక్ మిశ్రా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టులో జస్టిస్ మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి. ఆయన మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. తాను, జస్టిస్ మిశ్రా ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణంచేసినప్పటికీ ముందుగా మిశ్రా ప్రమాణస్వీకారంచేయడంతో ప్రధాన న్యాయమూర్తి అయ్యారన్నది జస్టిస్ జాస్తి అభిప్రాయం. తన భూములకు సంబంధించి తప్పుడు అఫడవిట్ దాఖలు చేశారన్నది జస్టిస్ మిశ్రా ఎదుర్కొంటున్న మరో అభియోగం. కీలక కేసుల్లో తీర్పులను ప్రభావితం చేయడానికి కొన్ని నిర్దిష్ట ధర్మాసనాలకు కేసులను కేటాయిస్తున్నారన్నది జస్టిస్ మిశ్రాపై ఉన్న ఆరోపణ.

అభిశంసన చాలా కష్టం.....

అభిశంసన ప్రక్రియ ఆషామాషీ కాదు. ఇందులో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. తీర్మానానికి వందమంది లోక్ సభ సభ్యులు, లేదా యాభై మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. రాజ్యాంగంలోని 124 (4) అధికరణ కింద దుష్ప్రవర్తన, అసమర్థత కింద సభాధిపతులకు తీర్మానాలను అందజేయాలి. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ లకు దీనిని ఆమోదించే, తిరస్కరించే అధికారం ఉంది. ఒకవేళ అనుమతిస్తే సుప్రీంకోర్టులోని ఒక సీనియర్ న్యాయమూర్తి, ఒక హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ నిపుణుడితో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలి. న్యాయమూర్తిపై వచ్చిన అభియోగాలపై ఇది దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అభిశంసన తీర్మానాన్ని కమిటీ సమర్థిస్తే పార్లమెంటులో చర్చ చేపట్టవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీతో ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆమోదం కోసం రాష్ట్రపతికి సమర్పిస్తారు. అంతిమంగా రాష్ట్రపతి ఉత్తర్వులతో న్యాయమూర్తి పదవీచ్యుతుడవుతారు.

ఎందరో న్యాయమూర్తులపై.....

ముందు పేర్కొన్నట్లు అభిశంసన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎన్నో దశలను దాట వలసి ఉంటుంది. ఏదో ఒక దశలో ముందుగానే న్యాయమూర్తి రాజీనామా చేయడమో, లేదా సభలో మెజారిటీ లేక తీర్మానం వీగిపోవడమో జరుగుతుంది. ఇప్పటి వరకూ ఆరుగురు న్యాయమూర్తులు అభిశంసనను ఎదుర్కొన్నప్పటికీ ఏ ఒక్కరూ ఈ తీర్మానం కారణంగా రాజీనామా చేయకపోవడం గమనార్హం. 1987-1989 మధ్య కాలంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రామస్వామి నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొన్నారు. 1993లో ఆయనపై ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో తగినంత మెజారిటీ లేని కారణంగా వీగిపోయింది. నిధుల దుర్వినియోగంపై అభిశంసన ఎదుర్కొన్న కోల్ కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రాసేన్ పై 2011లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అది లోక్ సభకు వెళ్లేలోపే ఆయన రాజీనామా చేశారు. అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.డి. దినకరన్ తనపై విచారణకు నియమించిన కమిటీపై నమ్మకం లేదంటూ 2011లోనే రాజీనామా చేశారు. మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. గంగెలే పైన వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని త్రిసభ్య కమిటీ నిర్ధారించడంతో ఆయన బయటపడ్డారు. 2015లో రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.బి. పర్నివాలా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో అభిశంసన ఆగిపోయింది. 2017లో జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డిపై అభిశంసన ప్రక్రియ తగిన బలం లేక నలిచిపోయింది. తాజాగా దీపక్ మిశ్రాపై ప్రతిపక్షం అభిశంసన తీర్మానం ఇచ్చినా దానిని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తొలిదశలోనే తిరస్కరించడంతో దీపక్ మిశ్రా కూడా దీన్ని నుంచి బయటపడ్డారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News