నమ్మకమైన నేతలు కూడా నలిగిపోతున్నారే

రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. పార్టీ పట్ల విధేయత అంతకంటే ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్లకు ఎవరైనా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సామాజికవర్గం [more]

Update: 2021-01-10 02:00 GMT

రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. పార్టీ పట్ల విధేయత అంతకంటే ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్లకు ఎవరైనా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సామాజికవర్గం సాకుగా చూపడం, ఆర్థిక వనరులను లెక్కేసి పదవుల పంపకం చేయడం వంటివి ఎప్పటికైనా వారిలో అసంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జగన్ కు నమ్మకమైన నేతల్లో ఇద్దరి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజాల్లో నెలకొన్న అసంతృప్తికి గల కారణాలేంటి?

పార్టీ పెట్టిన నాటి నుంచి…..

జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన వెంటే నడిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి అధికార పార్టీపై విరుచుకుపడటంలో వెనకాడలేదు. చంద్రగిరి నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో ముఖ్య భూమిక పోషించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో ఇరుకున పెట్టడంలో చెవిరెడ్డిది ప్రధాన పాత్ర అనే చెప్పాలి. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జగన్ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి సంతృప్తి పర్చారు.

మంత్రి జోక్యంతో…..

అయితే చంద్రగిరి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహించలేక పోతున్నారు. తన అసంతృప్తిని ఇటీవల సీఎం సన్నిహితుడి వద్ద చెవిరెడ్డి వెళ్లగక్కినట్లు తెలిసింది. తమ నియోజకవర్గంలో మంత్రుల పెత్తనమేంటని ఆయన నిలదీసినట్లు సమాచారం. ఇక మరో నమ్మకమైన నేత ఆర్కే రోజా. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోనూ మంత్రుల జోక్యంతో ఆమె ఇబ్బంది పడుతున్నారు.

సహించలేక…..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజాలకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అయినా తన వ్యతిరేక వర్గమైన కెజే శాంతికి ఈడిగ కార్పొరేషన్ గా నియమించడాన్ని రోజా సహించలేకపోతున్నారు. దీనిపై బహిరంగానే సీఎంవోలో రోజా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. భవిష్యత్ లో మంత్రి పదవి వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే తనపట్ల విధేయతగా ఉన్న నేతల సమస్యలను జగన్ వినాల్సి ఉంటుంది. వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే జగన్ కు నేరుగా తమ అసంతృప్తిని తెలియజేయాలని ఈ ఇద్దరు నేతలు భావిస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News