మాజీ గవర్నర్ మైండ్ లో ఉన్నది అదేనా?

గవర్నర్ గా పనిచేసిన వారు ఎవరైనా రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అదే వారికి అత్యున్నత పదవి కావడంతో రాజకీయంగా వారు విశ్రాంతిని కోరుకుంటారు. కానీ మహారాష్ట్ర గవర్నర్ [more]

Update: 2021-01-25 11:00 GMT

గవర్నర్ గా పనిచేసిన వారు ఎవరైనా రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అదే వారికి అత్యున్నత పదవి కావడంతో రాజకీయంగా వారు విశ్రాంతిని కోరుకుంటారు. కానీ మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు మాత్రం రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తాను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రానున్నట్లు ప్రకటించారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న విద్యాసాగర్ రావు తిరిగి పార్టీలో కీలక భూమిక పోషించనున్నారు.

సీనియర్ రాజకీయ వేత్తగా….

చెన్నమనేని విద్యాసాగర్ రావు సీనియర్ పొలిటీషియన్. బీజేపీకి పెద్దగా బలం లేనప్పుడే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పదవులను పొందరు. 1980లో తొలిసారి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినా కుంగిపోకుండా 1985లో మెట్ పల్లి అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. విద్యాసాగర్ రావు మొత్తం మూడు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. రెండు సార్లు లోక్ సభకు ఎంపికయ్యారు.

తిరిగి జర్నీ…..

వయసు మీద పడటం, పార్టీకి చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని విద్యాసాగర్ రావును బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా నియమించింది. ఆ పదవీ కాలం పూర్తి కావడంతో తిరిగి విద్యాసాగర్ రావు పొలిటికల్ జర్నీ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న విద్యాసాగర్ రావు బీజేపీ నాయకత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ పరోక్షంగా సహాయ సహకారాలను అందిస్తున్నారు.

సీఎం పదవి కోసమేనా?

ఇక తాజాగా ఆయన చేసిన పొలిటికల్ కామెంట్స్ మరోసారి హీటెక్కించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విద్యాసాగర్ రావు చెప్పారు. బండి సంజయ్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని చెప్పడానికే విద్యాసాగర్ రావు యాక్టివ్ అయినట్లు కన్పిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద విద్యాసాగర్ రావు యాక్టివ్ కావడం ఆ పార్టీకి మంచి పరిణామమే అయినా ఒక వర్గం నేతలకు మాత్రం రుచించడం లేదు.

Tags:    

Similar News