మోడీకి ‘ఏ’ టీమ్ చెక్…!!!

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు [more]

Update: 2018-12-29 16:30 GMT

ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. అఫీషియల్ మస్కాట్ గా నరేంద్రమోడీ ఉంటారు. అమిత్ షా కు మాత్రం పూర్తిగా రెక్కలు కత్తిరించబోతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో వీరిద్దరు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. రాష్ట్రపతి మొదలు ముఖ్యమంత్రుల వరకూ అన్ని ఎంపికలూ వారిష్టమే అన్నట్లుగా సాగిపోయాయి. కేంద్రప్రభుత్వంలో కీలక పదవులు, రాజ్యాంగబాధ్యతల్లోనూ తమకు నచ్చినవారినే కూర్చోబెట్టారు. అందులోనూ గుజరాత్ అధికారులకు అగ్రతాంబూలమిచ్చారు. చెప్పినట్లు ఆడించారు. వరస విజయాలతో వారికి ఎదురుచెప్పే సాహసం చేయలేకపోయారు. నిజానికి వాజపేయి తర్వాత అద్వానీ పార్టీని, ప్రభుత్వాన్ని శాసిస్తారని అందరూ భావించారు. బీజేపీలో రాళ్లెత్తిన కూలీ పాత్రకే ఆయన పరిమితమైపోయారు. మోడీ, షాలు వ్యూహాత్మకంగా మొత్తానికి మొత్తంగా పాత తరాన్ని పక్కనపెట్టేశారు. దక్షిణాది నుంచి బీజేపీలో పెద్దనాయకుడిగా పేరు తెచ్చుకున్న వెంకయ్యనాయుడిని సైతం ఉపరాష్ట్రపతి పదవి సాకుతో రాజకీయాలకు దూరం చేసేశారు. విజయాలకు తాజాగా బ్రేకు పడటంతో మళ్లీ పాతకాపులు పైకి లేస్తున్నారు. ‘ఏ’టీమ్ గా పార్టీలో గుర్తింపు పొందిన అద్వానీకి సన్నిహితంగా మెసిలే, అభిమానించే వర్గం 2019 ఎన్నికలకు పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

యూపీ నుంచే మొదలు…

దేశంలో భారతీయజనతాపార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడానికి ప్రధానకారణంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచే మార్పు మొదలు కాబోతోంది. 71 లోక్ సభ స్థానాలు, 325 వరకూ అసెంబ్లీ స్థానాలతో బీజేపీ యూపీలో గట్టి శక్తిగా నిలిచింది. 2014, 17 ల్లో లభించిన ఆ బలాన్ని తిరిగి నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యమని కమలనాథులకు తెలుసు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు అన్నీతానై వ్యవహరించి విజయాలను సాధించిపెట్టింది అమిత్ షా. సోషల్ ఇంజినియరింగ్ తో ప్రత్యర్థులను కకావికలు చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల్లో పరాజయాలు ఎదురవుతున్నాయి. గుజరాత్ కు చెందిన వ్యక్తే అయినా మోడీ, షాలను వ్యతిరేకించే గోర్దన్ జడాఫియాను రంగంలోకి దింపింది ఆర్ఎస్ఎస్. భావజాలంలో మోడీ, అమిత్ షా లకు దీటైన వ్యక్తిగా పార్టీలో పేరుంది. అంతేకాకుండా వారితో విభేదాలూ ఉన్నాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో 2019 కి యూపీకి ఎన్నికల ఇన్ ఛార్జిగా బాధ్యతలను గోర్దన్ కు అప్పగిస్తున్నారు. ఇది పార్టీ పరంగా కీలకపరిణామంగానే చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా గెలుపునకు సంబంధించి ప్లాన్ చేయడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో ఆర్ఎస్ఎస్ కూడా భాగస్వామిగా నిలుస్తుంది. షా పాత్రను సాధ్యమైనంతవరకూ కుదించాలనేది యోచన.

ఆర్ఎస్ఎస్ అలర్ట్స్ …

గడచిన ఏడాది కాలంగా బీజేపీ నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్ హెచ్చరిస్తూ వస్తోంది. ఏకపక్ష నిర్ణయాలతో మోడీ, అమిత్ షా లు పార్టీకి దీర్ఘకాలంలో నష్టం వచ్చేలా చేస్తున్నారని పలు సందర్బాల్లో రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నాయకత్వం స్పష్టం చేసింది. తాజాగా మూడు రాష్ట్రాల్లో పరాభవానికి అగ్రనాయకత్వం పాత్ర ఎంతైనా ఉందని భావిస్తోంది. ఛత్తీస్ గఢ్ ఏర్పాటైనప్పట్నుంచి అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. తొలిసారిగా పరాజయం పాలైంది. ముఖ్యమంత్రికి మంచి పేరుంది. మూలమూలకు విస్తరించిన క్యాడర్ ఉంది. కాంగ్రెసుకు, బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ అజిత్ జోగిలు ఫ్రంట్ కట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత చీలికకు ఆస్కారం ఏర్పడింది. అయినా పరాజయం తప్పలేదు. రాజస్థాన్ లో షా అతి జోక్యంతో అభ్యర్థుల గందరగోళం కొనసాగింది. మధ్యప్రదేశ్ లో కేంద్రప్రభుత్వ విధానాల పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో స్థానిక నాయకత్వ పటిష్ఠత అధికారాన్ని నిలబెట్టలేకపోయింది. వీటన్నిటినీ ఆర్ఎస్ఎస్ అంతర్గత సమావేశాల్లో గట్టిగానే ఎత్తిచూపింది. ఇప్పటికే బీజేపీలోని అద్వానీ సానుకూల వర్గం కొద్దికొద్దిగా స్వరం పెంచుతోంది. గడ్కరీ గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆయనకు ఆర్ఎస్ ఎస్ నుంచి మంచి మద్దతు ఉంది. నాగపూర్ కేంద్రంగానే ఆయన రాజకీయాల్లో ఎదిగారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు పార్టీలో మంచి పేరుంది. వీరిద్దరి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ చేస్తూ మోడీ, అమిత్ షాల శిబిరానికి చెక్ పెట్టాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది.

ఫ్రంటుల తంటాలు…

ఇంకోవైపు బీజేపీకి ఫ్రంట్ ల తంటాలు మొదలయ్యాయి. ఒకవైపు ప్రత్యర్థిగా యూపీఏ ఉంది. దానిని విస్తరించి మరొక విస్తారమైన కూటమిగా మార్చాలనే యత్నాలు సాగుతున్నాయి. సెక్యులర్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చెప్పులేసుకుని తిరుగుతున్నారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ ఒక రకంగా చూస్తే బీజేపీ వ్యతిరేక ఓటును చీలుస్తుందనే భావన ఉంది. అదే సమయంలో ఈ కూటమి పోటీ చేస్తున్న చోట్ల కాంగ్రెసు బలం అంతంతమాత్రమే. అందువల్ల ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్తులో కాంగ్రెసు నేత్రుత్వంలోని కూటమితో జట్టు కట్టే అవకాశాలున్నాయి. దానివల్ల బీజేపీ బలహీనపడుతుంది. బేరమాడే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫెడరల్ ఫ్రంట్ లోని నాయకులు బలహీన నాయకత్వంతోనే కలిసి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కోణంలో చూస్తే కాంగ్రెసుకే చాన్సులెక్కువ. ఇక సొంత కూటమిలోనూ పరిస్థితులు ఏమంత సానుకూలంగా లేవు. అప్నాదళ్ వంటి చిన్నచితక పార్టీలు సైతం బెదిరింపులకు దిగుతున్నాయి. మహారాష్ట్రలో శివసేనతో పయనం శల్యసారథ్యంగా మారిపోయింది. ఇవన్నీ 2019 ఎన్నికలకు బీజేపీకి పరీక్ష పెట్టబోతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News