అన్యాయమా? అది మోసమా?

Update: 2018-04-04 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు హల్ చల్ చేశారు. అసలెవరూ పట్టించుకోవడం లేదంటూ బీజేపీ,వైసీపీ ఎద్దేవా చేశాయి. ఎగతాళి పట్టించాయి. అద్భుతం ఇక కేంద్రం దిగిరావాలసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికగా అన్ని పక్షాలూ ఏకతాటిపైకి వచ్చేస్తున్నాయి. ఇక కేంద్రంపై, బీజేపీ పై యుద్ధమే అంటూ టీడీపీ నాయకగణం హోరెత్తిస్తోంది. రెండూ పాక్షిక సత్యాలే. పూర్తి నిజాలు లేవు. జాతీయ నాయకునిగా చంద్రబాబు నాయుడికి గతంలో ఉన్నకరిష్మా లేదన్నది నూటికి నూరుపాళ్లు ఒప్పుకోవాల్సిన విషయం. అదే సమయంలో చంద్రబాబు రాజకీయ నైపుణ్యాన్ని విపక్షాలు పూర్తిగా విస్మరించాయని చెప్పలేం. ఆయన కలిసిన నాయకులందరూ కూడా ఏపీ సమస్యల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సంఘీభావమూ తెలిపారు. కానీ మీ కోసం మేం పోరాటం చేస్తామన్నంత స్థాయిలో హామీలేమీ లభించలేదు. ప్రత్యేక హోదా జాతీయాంశంగా మారితే ఏపీలో ఎంతమేరకు ఓట్లు కురుస్తాయనేది చంద్రబాబు లెక్క. మొత్తానికి దక్షిణాది నుంచి ఒక కీలక నేత ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశారు. మోడీకి పచ్చి శత్రువుగా మారిపోయాడు. దీనిని ఎంతమేరకు రాజకీయ అవకాశంగా మలచుకుని మోడీని దుమ్మెత్తి పోయొచ్చనేది విపక్షాల లెక్క. చంద్రబాబు స్వరంలోని మార్పు కాంగ్రెసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా చేతులు కలిపేందుకు సిద్ధమేనన్న సంకేతాలు అందిస్తోంది. ఏపీ ప్రయోజనాల పేరిట ఆ పార్టీ నుంచి డైరెక్టుగానే సహకారాన్ని కోరుతున్నారు. జాతీయస్థాయిలో ఇన్ డైరెక్టుగా కాంగ్రెసుకు అవసరమైన మద్దతు ఇచ్చే దిశలోనూ అడుగులు పడుతున్నాయనేది పరిశీలకుల అంచనా. బాబు పర్యటనలో ఈ అంశాన్ని కీలకపరిణామంగా చెప్పుకోవచ్చు. తెలిసో తెలియకో అన్యాయం చేసిన కాంగ్రెసును క్షమించవచ్చు. ఉద్దేశపూర్వకంగా మోసం చేసిన బీజేపీని క్షమించకూడదన్న సందేశాన్ని మాత్రం అందించగలిగారనే చెప్పాలి. కాంగ్రెసు, బీజేపీల మధ్య తన వైఖరిలోని వ్యత్యాసాన్ని సైతం స్పష్టం చేశారు.

స్థాయి..స్థానం ..సర్దుబాటు...

ప్రజాస్వామ్యంలో నాయకులకు ప్రజాబలమే కొండంత అండ. వారు ఎన్నికేసులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల్లో మద్దతు ఉంటే నిరంతరం ప్రేరణ పొందుతుంటారు. అధికారయంత్రాంగం భయభక్తులతో ప్రవర్తిస్తుంది. ప్రజల్లో పాపులారిటీ తగ్గుతుందని గ్రహించిన వెంటనే అందరూ ప్లేటు ఫిరాయిస్తారు. ఎన్నికలకు ముందు నుంచీ కొందరు అధికారులు గాలివాటం గ్రహించి ప్రతిపక్ష నాయకుల శిబిరాలకు వెళ్లి మరీ కోటరీలో చేరిపోతూ ఉండటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. జాతీయ రాజకీయాల్లో నంబర్ గేమ్ కూడా చాలా కీలకం. సంకీర్ణాల యుగంలో పదిమంది సభ్యులున్న పార్టీ సైతం తమ పంతం నెగ్గించుకునేది. అటువంటి పరిస్థితుల్లోనే ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు జాతీయంగా చక్రం తిప్పగలిగారు. 42 లోక్ సభ స్థానాలు, 16 రాజ్య సభ స్థానాలున్న ఏపీ సీఎంగా నేషనల్ పాలిటిక్స్ లో ఎంతో ప్రాధాన్యం లభించేది. 1996 నుంచి 2004 వరకూ కీలక జాతీయ నేతగా గుర్తింపు పొందగలిగారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా, ఎన్డీఏ ముఖ్య భాగస్వామిగా ఆయన చెప్పింది చెల్లుబాటయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఏపీ, తెలంగాణల రాజకీయ ప్రాబల్యం తగ్గింది. చంద్రబాబు ఒక మోస్తరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే. అందులోనూ సంకీర్ణాల యుగానికి చెల్లుచీటి పాడి మోడీ నేతృత్వంలోని బీజేపీ ఏకపార్టీ మెజార్టీ సాధించగలిగింది. అందువల్ల కూడా ప్రాంతీయ పార్టీలు , భాగస్వామ్య పార్టీలు జాతీయంగా రాజకీయ ప్రాముఖ్యాన్ని కోల్పోయాయి. అందువల్లనే మిగిలిన ప్రాంతీయ నేతల మాదిరిగానే చంద్రబాబు స్థాయి కుదించుకుపోయినట్టుగానే భావించాలి. అందులోనూ ఏపీ వంటి రాష్ట్రంలో బలమైన పార్టీ ప్రతిపక్షంగా ఉండటమూ టీడీపీ కి ఇరకాటమే. నువ్వు కాకపోతే వారు అన్నట్టుగా బీజేపీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అందుకే గత వైభవాన్ని పక్కనపెట్టి సర్దుబాటుతోనే సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఉసూరుమనిపిస్తున్న ఉపన్యాసాలు....

జాతీయ మీడియా చంద్రబాబు పర్యటనను గతంలో మాదిరిగా పెనుప్రభావం చూపించే అంశంగా చూడటం లేదు. మీడియాకు కావాల్సిన పెప్ బాబు అందించలేకపోతున్నారు. పదునైన విమర్శలు, ఆరోపణలకు ఆధారాలు, ప్రత్యర్థులపై కాయిన్ చేసి ప్రజల్లోకి పంపగల బలమైన వర్డ్స్ , భాషా పటిమ ఆయన ఉపన్యాసాల్లో లోపించింది. ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటూ నాలుగేళ్లుగా చెబుతున్న విషయాన్నే మళ్లీ మళ్లీ గంటలతరబడి చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలోనూ పస లోపించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో చంద్రబాబు గడచిన నెలరోజుల్లో 40 వరకూ సమావేశాలు, టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు. అసెంబ్లీలోనూ గంటల తరబడి ప్రసంగాలు చేశారు. బహిరంగ సమావేశాలు, వివిధ వేదికలపై చేసిన ఉపన్యాసాల సంఖ్య 18 వరకూ ఉంది. అన్నిటా చెప్పే విషయం ఒకటే. ఒకే విషయం ఆకట్టుకునే రీతిలో చెప్పలేకపోవడం వల్ల ప్రజలు,ప్రేక్షకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, పార్టీ నాయకులు విసుగెత్తి పోతున్నారు. అధికారిక సమావేశాల్లోనూ అదే విషయాన్ని చంద్రబాబు వల్లెవేస్తున్నారని యంత్రాంగం వాపోతోంది. ఏం చేస్తే బాగుంటుంది? ఎలా ముందుకు వెళ్లాలనే దిశానిర్దేశం కంటే కూడా ఆవుకథనే పదేపదే నెమరు వేయడం ఏం ప్రయోజనమని పార్టీ కార్యకర్తలే ఆక్షేపిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఇది ప్రధాన ప్రతిబంధకంగా మారింది. ఆయన చెప్పే మాటలను క్యాడర్ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆయన ధోరణిని మరోవైపు మలిచే సాహసం ఎవరూ చేయడం లేదు. దీనిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అసలు విషయం ప్రజలకు చేరువకాదు.

అనుకరించడం ఒక ఆర్ట్ ..

సొంతంగా చేయడమే కాదు, ఒకరిని అనుకరించడం కూడా ఒక కళే. భావోద్వేగాలు రేకెత్తించడానికి చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీని నిలదీయకుండా సహజీవనం చేసి తాజాగా తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పుడే ఎందుకు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. రెండూ ఒకటే. బీజేపీ విషయంలో చంద్రబాబు వేచిచూసినట్టే, పవన్ కూడా టీడీపీ విషయంలో వేచి చూసి ఇప్పుడు బయటపడ్డారని జనసేన చేస్తున్న వాదన సహేతుకంగా కనిపిస్తోంది. ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకోవడం, తనను విజయసాయి నిందించారని భావోద్వేగానికి గురికావడం వంటి అంశాలన్నీ చంద్రబాబు సహజధోరణికి భిన్నమైనవి. వీటిని రక్తి కట్టించడంలో టీడీపీ శ్రేణులు వైఫల్యం చెందుతున్నాయి. నిజానికి అంతటి సీనియర్ నేత కన్నీళ్లు పెట్టారంటే రాష్ట్రమంతా ఊగిపోవాలి. కోపంతో, భావోద్వేగంతో రగిలిపోవాలి. కానీ అటువంటి పరిస్థితులేమీ ఏపీలో కనిపించడంలేదు. మోడీ తరహాలోనే పార్లమెంటు మెట్లకు చంద్రబాబు చేసిన వందనంపైనా సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ఈ తరహా విన్యాసాలు చేసేవారు కాదు. ఇప్పుడే ఆ సెంటిమెంటును ప్రయోగించబూనడం కృతకమైన అనుకరణగా విమర్శకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా ఫెడరల్, మూడోఫ్రంట్ అంశాలు చర్చకు వచ్చినా బాబు స్థానం మాత్రం శరద్ పవార్, మమతా బెనర్జీ, మాయావతి వంటివారి తర్వాతేనన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. ఏతావాతా ఈ పర్యటన ఫలితాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News