చంద్రబాబు చిన్నచూపుతోనే?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి. ఇక్కడ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. 1983లో మిన‌హా 2004 వ‌ర‌కు ఇక్కడ ఆ పార్టీదే ఆధిప‌త్యం. [more]

Update: 2019-11-29 11:00 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి. ఇక్కడ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. 1983లో మిన‌హా 2004 వ‌ర‌కు ఇక్కడ ఆ పార్టీదే ఆధిప‌త్యం. ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ స్వల్ప తేడాతో ఓడిపోయినా 2014లో ఇక్కడ నుంచి పోటీచేసిన పీత‌ల సుజాత గెలుపు గుర్రం ఎక్కారు. ఆమెకు చంద్రబాబు మంత్రిగా కూడా ప్రమోష‌న్ ఇచ్చారు. అయితే, త‌ర్వాత ఈమెకు ఇక్కడ ఎంపీగా ఉన్న మాగంటి బాబుకు మ‌ధ్య తీవ్ర విభేదాలు రావ‌డం, ఆధిప‌త్య రాజ‌కీయాల నేప‌థ్యంలో ఈ ఏడాది ఎన్నిక‌ల్లో ఆమెను త‌ప్పించి క‌ర్రారాజారావుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఇక్కడున్న నాయ‌కుల‌ను క‌లుపుకొని పోవ‌డంలోను, పార్టీని గెలిపించుకోవ‌డంలోను కూడా క‌ర్రా రాజారావు విఫ‌ల‌మ‌య్యారు. ఇంకా చెప్పాలంటే ఆయ‌న అవుట్ డేటెట్ నాయ‌కుడిగా ముద్ర ప‌డిపోయారు.

భారీ ఓట్ల తేడాతో ఓడినా….

ఈ ఏడాది ఎన్నిక‌ల్లో రాజారావు 35 వేల ఓట్ల భారీ తేడాతో చిత్తుగా ఓట‌మి పాల‌య్యారు. విచిత్రం ఏంటంటే 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన రాజారావు ప‌లు పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. అలాంటి నేత‌కు తిరిగి ప‌దేళ్లకు చంద్రబాబు మ‌ళ్లీ సీటు ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో రాజారావుకు సీటు ఇవ్వడంతోనే బాబు రాంగ్‌స్టెప్ వేశారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత పార్టీని ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో ఇక్కడున్న టీడీపీ సానుభూతిప‌రులు ఇప్పటికైనా చంద్రబాబు ఇక్కడి ప‌రిస్థితిని స‌రిదిద్దుతార‌ని ఆశ పెట్టుకున్నారు.

నానుస్తూ వస్తూ….

చంద్రబాబు ఇటీవ‌ల కాలంలో జిల్లా స‌మీక్షలు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితుల‌పై స‌మీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చింత‌లపూడిపై చంద్రబాబు త‌గిన విధంగా స్పందించి న్యాయం చేస్తార‌ని అనుకున్నారు. జిల్లాలో పెద్ద నియోజక‌వ‌ర్గం కావ‌డం, ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కావ‌డంతో ఇక్కడ పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ప‌రిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత లేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. దీంతోనే ఇక్కడ పార్టీ ఓట‌మి పాలైంది. అయితే, ఆయా విష‌యాల‌పై ఎప్పటిక‌ప్పుడు స్పందించి చ‌ర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు మాత్రం త‌న‌కేమీ ప‌ట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మ..మ అనిపిస్తూ….

ఇక్కడ కార్యక‌ర్తల అభిప్రాయాల‌కు విలువ లేకుండా పోయింద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల త‌ణుకులో నిర్వహించిన స‌మీక్షలో కార్యక‌ర్తలు పార్టీ ప‌రిస్థితిని వినిపించేందుకు ప్రయ‌త్నించారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో ఏయే గ్రామాల్లో మెజారిటీ వ‌చ్చిందో వారితోనే మాట్లాడి స‌మీక్షకు చాప‌చుట్టేశారు చంద్రబాబు. దీంతో కార్యక‌ర్తలు, దిగువ శ్రేణి నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద మ‌హా అయితే నాలుగైదు గ్రామాల్లో మెజార్టీ రాగా వాళ్లతో మాట్లాడించేసి మ‌మ అనిపించ‌డంతో కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

గంటలోనే ముగించి….

క‌నీసం ఎన్టీఆర్ పార్టీ పెట్టిన స‌మ‌యం నుంచి ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు మాట్లాడేందుకు ప్రయ‌త్నించినా.. చంద్రబాబు అవ‌కాశం ఇవ్వక‌పోవ‌డంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పార్టీలో క‌నీసం త‌మ అభిప్రాయాల‌ను వినే ప్రయ‌త్నం కూడా చేయ‌లేద‌ని అంటున్నారు. జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్షల‌కు రెండు.. రెండున్నర గంట‌ల‌కు పైగా టైం ఇచ్చిన చంద్రబాబు చింత‌ల‌పూడి విష‌యంలో ప‌ని ఉంద‌ని.. కేవ‌లం గంట‌లో మ‌మ అనిపించేయ‌డంతో చంద్రబాబుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో ఇంట్రస్ట్ లేద‌ని ఆ పార్టీ వాళ్లే గుస‌గుస‌లాడుకుంటోన్న ప‌రిస్థితి.

ఉపయోగం లేదని చెబుతున్నా……

అస‌లు క‌ర్రా రాజారావుతో పార్టీకి ఉప‌యోగం లేద‌ని.. ఇక్కడ ఇప్పటి నుంచే నాయ‌క‌త్వ మార్పుపై ఆలోచన చేయ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్ అభిప్రాయం తెలుసుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ చంద్రబాబు స‌మీక్షను మ‌మ అని పించేయ‌డంతో ఇక్కడ పార్టీ ఎప్పట‌కీ బాగు ప‌డుతుంద‌ని వాళ్లంతా త‌ల‌లు ప‌ట్టుకున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అస‌లు చింత‌ల‌పూడిలో చంద్రబాబు ఏం చేయాల‌ని అనుకున్నారు? ఇక్కడ పార్టీ ఎలా ఉన్నా ఫ‌ర్వాలేద‌నే తీర్మానానికి వ‌చ్చేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమ‌వుతున్నాయి.

Tags:    

Similar News