చంద్రబాబు సెట్ చేసేశారు....!!!

Update: 2018-10-26 15:30 GMT

తెలంగాణ జనసమితి ముందుగా హుంకరించి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. మహాకూటమిలో మన్ననదక్కేలా, మాట నిలబడేలా మధ్యేమార్గాన్ని ఎంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెసు పార్టీ తాము అడిగినన్నిసీట్లు ఇచ్చే అవకాశం లేదన్న విషయం స్పష్టమైపోయింది. ఇచ్చినవాటితో సర్దుకు పోక తప్పదన్న సంగతీ తెలిసిపోయింది. తమకంటే పెద్దపార్టీ అయిన తెలుగుదేశమే కొండ దిగొచ్చింది. సీపీఐ సైతం సర్దుకునేందుకు సిద్ధమైపోతోంది. ఇప్పుడు పంతానికి పోతే తమ పరువే రోడ్డున పడుతుందని గ్రహించారు. హస్తం పార్టీ అధిష్టానం చాలా తెలివిగానే పావులు కదుపుతోంది. అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే దఫదఫాలుగా గడువులతో గాండ్రిస్తూ వచ్చిన జనసమితి నాయకుల బెదిరింపులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమకు కేటాయించే సీట్ల సంఖ్యను తేల్చాలని ఎన్నిసార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. ముందుగా కనీస ఉమ్మడి ప్రణాళిక ను రూపకల్పన చేయాలని నిర్ణయించారు. అది తేలేవరకూ సీట్ల సంఖ్యను ప్రకటిస్తే అందరి పరువు పోతుందని కాంగ్రెసు రాష్ట్రస్థాయి నాయకత్వం సర్ది చెప్పింది. లేకపోతే కేవలం అధికారం కోసం పాకులాడుతున్నామన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల కూటమి అవకాశాలు దెబ్బతింటాయని కాంగ్రెసు తనమిత్రులకు చెప్పేసింది. ఇది టీజేఎస్ నాయకత్వాన్ని పునరాలోచనలో పడేసింది.

టీడీపీ దిక్సూచి...

ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెసు పార్టీ తలపోటును తెలుగుదేశం తగ్గించిందనే చెప్పాలి. చంద్రబాబునాయుడు రంగంలోకి దిగేవరకూ స్థానిక టీడీపీ నాయకులు చెట్టెక్కి కూర్చున్నారు. తమకు కనీసం 35 స్థానాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ వచ్చారు. ఇందులో 15 స్థానాలు 2014 ఎన్నికల్లో గెలిచినవి. మరో 14 స్థానాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి 29 స్థానాలు అదనంగా మరో ఆరు స్థానాలు కలిపి కేటాయిస్తే తమ పార్టీకి న్యాయం జరుగుతుందనే వాదనను ముందుకు తెచ్చారు. 30 స్థానాలు టీడీపీకి, మరో 30 స్థానాలు టీజేఎస్, సీపీఐలకు కేటాయించడమంటే కాంగ్రెసుకు ఆత్మహత్యా సదృశమే. ఈ స్థితిలో పంతాలు, పట్టింపులు పెరిగిపోయాయి. ముందుగా తెలంగాణ జనసమితి కూటమికి దూరంగా జరిగే సూచనలు కనిపించాయి. సీపీఐ సైతం తమను అవమాన పరుస్తున్నారంటూ అలకబూనింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. కేసీఆర్ ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు. తమ పార్టీ కంటే కాంగ్రెసునాయకులు బరిలో నిలిచిన ప్రాంతాల్లోనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చి చెప్పారు. కచ్చితంగా టీడీపీ గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 9 స్థానాల వరకూ టీడీపీ గెలిచే అవకాశం ఉందని తనవద్ద ఉన్న సర్వేల వివరాలను బయటపెట్టారు. మరో ఆరుస్థానాలను అడగవచ్చన్నారు. దీంతో మొత్తం చిత్రం స్పష్టమైపోయింది.

గౌరవప్రదంగా...

తెలుగుదేశం పార్టీ పదిపన్నెండు స్థానాలకు సర్దుకుపోతోందన్న సమాచారం జనసమితి నాయకులను ఆలోచనలో పడేసింది. నెగ్గలేని స్థానాలు తీసుకున్నా అవమానం తప్ప మరేమీ మిగలదని గ్రహించారు. అంతేకాకుండా కాంగ్రెసు నేతలు పూర్తిగా సహకరించరు. దీంతో అసమ్మతి అభ్యర్థులు బరిలో దిగే ప్రమాదం ఉంది. కూటమి ఒకే గమ్యం దిశలో పయనించే అవకాశాలుండవు. అసమ్మతినేతలను అధికారపార్టీ ప్రోత్సహించి అర్థ,అంగబలాలు సమకూర్చి జనసమితి అభ్యర్థులపై రెబల్స్ గా నిలిపే చాన్సుంది. ఇవన్నీ టీజేఎస్ కు ప్రతికూలమే. ఓటమి ఎదురైతే అధికారపార్టీకి జనసమితి లోకువై పోతుంది. అస్తిత్వమే ఉండకపోవచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మధ్యేమార్గంగా రాజీపడాలని జనసమితి నాయకులు యోచిస్తున్నారు. 30 కిపైగా సీట్లు డిమాండు చేసిన తాము పదిలోపు స్థానాలకు పరిమితమైతే గౌరవం దక్కదు. అందులోనూ కాంగ్రెసు పార్టీ జనసమితి గుర్తుపై కాకుండా హస్తం గుర్తుపైనే పోటీ చేయమని అభ్యర్థిస్తోంది. దీనివల్ల ఓట్ల చీలిక ఉండదు. కాంగ్రెసు సంప్రదాయ ఓటు బ్యాంకు జనసమితి అభ్యర్థులకు పడే అవకాశం ఉంటుంది. లేకపోతే క్రాస్ ఓటింగుకు అవకాశాలు పెరుగుతాయి. కాంగ్రెసు నుంచి రెబల్ అభ్యర్థులు బరిలో దిగితే చీలిక మరింత ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలోకి దిగారు టీజేఎస్ నాయకులు.

మధ్యేమార్గంలో సీఎంపీ ఛైర్మన్...

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి వెళ్లే మహాకూటమి లేదా ప్రజాకూటమికి చైర్మన్ గా కోదండరామ్ ను పెట్టాలని టీజేఎస్ తొలుత డిమాండు చేసింది. దీనికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. కాంగ్రెసు నుంచి స్పందన లభించలేదు. కనీస ఉమ్మడి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కోదండరామ్ కు అప్పగిస్తూ కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ గా అయినా ఆయనను నియమించుకోవాలనే డిమాండు తాజాగా ముందుకువస్తోంది. కోదండరామ్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ బాధ్యతను అప్పగిస్తే కూటమికి క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఈ సూచన పట్ల కాంగ్రెసు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జనసమితికి తక్కువ సీట్లు కేటాయించినా ఇబ్బంది ఉండదు. అధికారం కోసం పాకులాడుతున్నారనే ముద్ర పడదు. కాంగ్రెసు గుర్తుపైనే పోటీ చేయవచ్చు. కూటమికి ఉన్న ప్రధాన చికాకు తొలగిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెసులో దీనిపైనే చర్చ సాగుతోంది. జనసమితి నాయకులు సైతం ఈవిషయంలో మరింతగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న తమ నాయకుల నుంచి వ్యతిరేకత ప్రబలకుండా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ఒక కొలిక్కి వస్తే కూటమి ఏర్పాటు గట్టెక్కినట్లే.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News