బాబు మెల్లగా సర్దుకుంటున్నారా…!!

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బంపర్ మెజారిటీతో జగన్ సర్కార్ కొలువు తీరింది. దారుణంగా టీడీపీ ఓడింది. కనీసం అసెంబ్లీలో ఏడవ వంతు సీట్లు కూడా రాలేదు. చావు [more]

Update: 2019-07-04 06:30 GMT

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బంపర్ మెజారిటీతో జగన్ సర్కార్ కొలువు తీరింది. దారుణంగా టీడీపీ ఓడింది. కనీసం అసెంబ్లీలో ఏడవ వంతు సీట్లు కూడా రాలేదు. చావు తప్పిన చందంగా 23 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. వారంతా పార్టీని వీడిపోతారని ఇన్నాళ్ళు అనుకున్నా జగన్ ఫిరాయింపులపై గట్టిగా నిలబడడంతో చంద్రబాబునాయుడుకు పెను భారం దిగిపోయింది. ఏపీలో తమ్ముళ్ళను సైకిల్ దించేయాలని బీజేపీ అనుకున్నా కూడా జగనే ఓ అడ్డంకిగా మారడం కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు. మొత్తానికి అలకలు, అల్లర్లు, గొడవలు ఎన్ని జరిగినా ఏపీలో వైసీపీకి ధీటైన పార్టీ టీడీపీయే అని ఇప్పటికైతే తమ్ముళ్ళు సరిపెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు సైతం వారిని చేరదీసి బుజ్జగించడం ద్వారా పార్టీలో ప్రస్తుతానికి సంక్షోభాన్ని లేకుండా చేసుకోగలిగారు.

ఆ ఆశతోనేనా…?

ఇక ఏపీలో ఎంత కాదనుకున్న టీడీపీ బలమైన పార్టీ. 65 లక్షల సభ్యత్వం ఉన్న అతి పెద్ద ప్రాంతీయ పార్టీ. మరో వైపు వైసీపీ అధికారంలో ఉండడంతో బలంగా కనిపిస్తున్నా ఆ పార్టీ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడమే ఇపుడు ఇబ్బందిగా ఉంది. దాంతో అందరికీ పదవులు దక్కకపోవడంతో వారంతా స్తబ్దుగా ఉండడం కూడా టీడీపీకి భవిష్యత్తు మీద ఆశలు పెంచుతోందంటున్నారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీకి వైసీపీకి మధ్య సంబంధాలలో కూడా మార్పులు వస్తాయని టీడీపీ నమ్ముతోంది. అదే జరిగితే జగన్ కి కేంద్రం సహాయం చేయకుండా మోకాలడ్డుతుందని అంటున్నారు. అపుడు జగన్ పాలనాపరంగా ఇబ్బంది పడతారని చంద్రబాబునాయుడు వ్యూహకర్తలు లెక్కలేస్తున్నారు.

ఊరిస్తున్న ముందస్తు….

ఇక కేంద్రంలో రెండవ మారు అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ జమిలి ఎన్నికల విషయంలో గట్టి పట్టుదల మీద ఉంది ఎలాగైనా 2023 మొదట్లో ఎన్నికలు పెట్టాలని నిర్ణయిస్తారని అంటున్నారు. అదే జరిగితే జగన్ ప్రభుత్వం ఉండేది కేవలం మూడున్నరేళ్ళే. అంటే కళ్ళు మూసుకుంటే ఇట్టే రోజులు తిరిగేస్తాయని చంద్రబాబునాయుడు ధీమాగా ఉన్నారు. జగన్ కి పాలనానుభవం లేకపోవ‌డం, ఆయన మంత్రివర్గంలో అంతా కొత్త వారు కావడం, అధికారుల మీద పూర్తిగా అధారపడడం వంటి వాటితో పాటు, కేంద్ర సాయం సరిగ్గా దక్కపోతే మాత్రం జగన్ ఇచ్చిన హామీలు తీర్చలేక జనంలో పూర్తిగా చెడ్డపేరు తెచ్చుకుంటారని టీడీపీ నమ్ముతోంది. మరో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు ఉంటాయి. అప్పటికి జగన్ సర్కార్ మీద మోజు కొంత తగ్గుతుందని, గట్టిగా పోరాడి మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే ఇక టీడీపీకి తిరుగు ఉండదని, పార్టీ నుంచి వెళ్ళిపోయే వారు ఎవరూ ఉండరని పైగా బయట నుంచి వచ్చే వారే ఉంటారని చంద్రబాబునాయుడు సైతం గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి రానున్న ఆరు నెలలూ జగన్ కి అగ్ని పరీక్ష అని చెప్పాలి.

Tags:    

Similar News