దురదృష్టంలోనూ..... అదృష‌్టం...??

Update: 2018-11-30 14:30 GMT

తెలుగుదేశం పార్టీ దురదృష్టంలో అదృష్టాన్ని వెదుక్కొంటోంది. తప్పనిస్థితిలో కాంగ్రెసుతో చేతులు కలిపి తెలంగాణలో కూటమి కట్టింది. ప్రత్యామ్నాయ కూటమి అంటున్నప్పటికీ జాతీయంగా కాంగ్రెసును గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తమ పార్టీ స్థాయిని కుదించుకుని అతి తక్కువ సీట్లకే రాజీపడి తెలంగాణలో పోటీ చేస్తోంది. కాంగ్రెసు కు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ సీట్లు గెలవడం కంటే టీఆర్ఎస్ ను గద్దె దింపడమే టీడీపీకి ప్రధాన కర్తవ్యంగా మారింది. ముఖ్యంగా ఈ గెలుపు కాంగ్రెసుకే కాదు, టీడీపీకి సైతం అత్యంతప్రతిష్ఠాత్మకమనే చెప్పాలి. ఈ రెండు పార్టీలు చేతులు కలిపిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఏమేరకు స్పందన లభిస్తుందనేందుకు ఇదో మచ్చుతునక కాబోతోంది. కూటమి గట్టెక్కితే నైతిక స్థైర్యం లభిస్తుంది. ఏపీలో పొత్తుకు రూట్ క్లియర్ అవుతుంది. జాతీయంగానూ మంచి ఉత్సాహం వస్తుంది. ఫలితం తిరగబడితే టీడీపీ డీలా పడిపోతుంది. ఏపీలో పొత్తు కష్టసాధ్యంగా మారుతుంది. నేషనల్ రోల్ లో టీడీపీకి పెద్దగా ప్రాముఖ్యం దక్కకపోవచ్చు.

అనువుగాని చోట...

తెలంగాణ ప్రచారంలో చంద్రబాబు నాయుడు చాలావరకూ ఒదిగి ఉంటున్నారు. కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడితే ప్రజల్లో భావోద్వేగం రగులుతుందని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయవచ్చు. కాంగ్రెసును నిరోధించవచ్చు. అభ్యర్థుల పరంగా టీఆర్ఎస్ కంటే కాంగ్రెసు బలమైన వారిని రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో అనుకున్నంత సానుకూలత టీఆర్ఎస్ కు లభించడం లేదు. అందుకే చంద్రబాబు ను బూచిగా చూపించి కాంగ్రెసును దుయ్యబడుతున్నారు. బాబు చేతిలో కాంగ్రెసు కీలుబొమ్మగా మారిపోతుందని, దానివల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయనే అంశాన్ని పైకి తెస్తున్నారు. చంద్రబాబు చర్చనీయంగా మారితే కూటమి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్లనే సాధ్యమైనంతవరకూ తన పాత్రను ఆయన కుదించుకుంటున్నారు. రాహుల్ తో కలిసి ప్రచారం చేశారు. టీడీపీకి మార్గనిర్దేశం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ను విమర్శించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ వర్సస్ తాను అన్న భావం ఏర్పడితే సహజంగానే టీఆర్ఎస్ కు పైచేయి దక్కుతుంది. అందుకే అనువుగాని చోట అధికులమనరాదన్నట్లుగా చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

విక్టిమ్ కార్డు...

ముందుగా కేసీఆర్ విక్టిమ్ కార్డును పైకి తీశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం తాను పగలు రాత్రి కష్టపడుతుంటే ఇతర పార్టీలన్నీ తనపై కక్ష సాధింపునకు పూనుకుంటున్నాయంటున్నారు. బీజేపీ, కాంగ్రెసు, చంద్రబాబు లను వేలెత్తి చూపుతూ తనను కాపాడుకోవాల్సిన బాధ్యత, టీఆర్ఎస్ ను గెలిపించు కోవాల్సిన కర్తవ్యం ప్రజలదే అని అన్యాపదేశంగా తేల్చి చెప్పేస్తున్నారు. చంద్రబాబు పెత్తనంలోకి వెళ్లిపోతుంది రాష్ట్రం అని బెదిరిస్తున్నారు. చంద్రబాబును తీవ్రంగానే విమర్శిస్తున్నారు. కేసీఆర్ విమర్శలు ఇప్పుడు తెలుగుదేశానికి మంచి రాజకీయ వనరులుగా మారాయి. కేసీఆర్ తిట్లు, ఏపీలో ఓట్లుగా మారతాయనే అంచనాతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు పాటుపడుతున్నారనే కోణంలో వీటిని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖలు రాయడాన్ని కేసీఆర్ ప్రతి సభలోనూ ఎత్తిచూపుతున్నారు. జనసేన, వైసీపీలు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నాయనే సమాచారాన్ని సైతం టీడీపీ సేకరిస్తోంది. తెలంగాణ ఎన్నికలను ప్రాతిపదికగా చేసుకుంటూ బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ లను ఒకే గాటన కట్టి చంద్రబాబు నాయుడికి ఏపీలో పరిస్థితులను అనుకూలంగా మార్చాలనే వ్యూహంతో ముందుకు కదులుతోంది టీడీపీ. ఒకవేళ తెలంగాణలో పరిస్థితులు కలిసి రాకపోయినా ఏపీలో ఈ మొత్తం తతంగాన్ని అడ్వాంటేజీగా మలచుకుంటూ తెలుగుదేశానికి ప్రయోజనం చేకూర్చుకోవాలని భావిస్తోంది.

‘జై’ కొట్టు...

తెలంగాణ సెంటిమెంటు ఎంత బలమైనదో చంద్రబాబు కు తెలుసు. అందుకే జై తెలంగాణ పల్లవి ఎత్తుకున్నారు. తొలి ప్రచార సభలోనూ కూటమి సాక్షిగా తాను ఇక్కడ పెద్ద పాత్ర పోషించబోవడం లేదని చెప్పేశారు. కేసీఆర్ తనను టార్గెట్ చేయడాన్ని ప్రశ్నిస్తూనే తాను సైబరాబాద్ నిర్మాణానికి ఎంతగా కష్టపడిందీ చెప్పుకొచ్చారు. ఉద్యమ నాయకుడు అయిన కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తే అది రివర్స్ అవుతుంది. అందుకే చంద్రబాబు చాలా సంయమనంతో వ్యవహరించారు. అదే సమయంలో బంగారు తెలంగాణ కోసమే తన తపన అంటూ పాజిటివ్ సందేశాన్నిచ్చేందుకు ప్రయత్నించారు. మీడియా పెద్దలతో సమావేశమైన సందర్భంలోనూ తన పాత్రపరిమితమంటూ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. అదే సమయంలో హైదరాబాదు ఉమ్మడి రాజధాని అన్న సంగతిని గుర్తు చేయడం విశేషం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News