ఏపీలో స్టార్ట్....కట్...యాక్షన్....!

Update: 2018-04-06 15:30 GMT

ఏపీలో ఇక యాక్షన్ సీన్ స్టార్టయింది. ఇది రాబోయే ఏడాది ఎన్నికలకు యాంటీక్లైమాక్స్ గా చెప్పుకోవాలి. అయితే దీర్ఘకాలం కొనసాగే ఉత్కంఠభరిత సన్నివేశాలు తప్పవు. రాజమౌళి సినిమాలో బాహుబలి యుద్దం వంటి రాజకీయ కదంబం ఇక కొనసాగబోతోంది. అన్నిపార్టీలు తొలి అడుగు వేసేశాయి . నడక ఆపితే నగుబాటు తప్పదు. ప్రజాక్షేత్రంలో పరాజయం, పరాభవం కూడా వెన్నంటి వస్తాయి. అందువల్ల చావో రేవో తేల్చుకోవాల్సిందే. వెనకడుగు వేస్తే ఓటమిని అంగీకరించినట్లే అవుతుంది. బలాబలాలకు సంబంధించిన సమీకరణలు, కూటములపై కూడా కొంత క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం ఒంటరిగా వెళ్లబోతోంది. వైసీపీ కూడా అదే పంథా. జనసేన, వామపక్ష శ్రేణులతో కలిసి నడుస్తోంది. జెండాలు ఖరారైపోయాయి. అజెండా కూడా ఒకటే. ప్రజావిశ్వాసం ఎవరికి లభిస్తుందనేదే ప్రశ్న. ఓటర్ల మన్ననలు, ఆదరణ పొందేందుకు ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు. వ్యూహాలు పన్నుతున్నారు. మూడు ప్రధానపార్టీలు తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నాయి. కాంగ్రెసు , బీజేపీలు ఆటలో అరటిపండు పాత్రకే పరిమితమవుతాయి. అయితే ఇందులోనూ కేంద్రంలోని బీజేపీది ప్రత్యేక వ్యూహం. ఎవరో ఒకరిని దెబ్బతీసి ప్రధానపక్షాల్లో మరొకరిని అక్కున చేర్చుకోవడానికి అవసరమైన మార్గాన్ని వెదుక్కొంటోంది. పూర్తిగా ఆంధ్రానుంచి లభించే సీట్ల మద్దతును వదులుకోలేకపోవడమే ఇందుకు ప్రధానకారణం.

టీడీపీ ముందస్తు ఎత్తుగడలు..

ఎదుటిపక్షం వ్యూహాన్ని బట్టి తామే ముందుగా అందుకు విరుగుడు ఎత్తుగడలు వేస్తోంది తెలుగుదేశం. అవిశ్వాసం పై తొలిదశలో అసలు పట్టించుకోని టీడీపీ దాని తీవ్రతను గమనించిన తర్వాతనే రంగంలోకి దిగింది. వైసీపీ అవిశ్వాసానికి తాను మద్దతిస్తే పరువు పోతుందని టీడీపీ సొంతంగా ప్రతిపాదించింది. తగిన మద్దతునూ కూడగట్టగలిగింది. 35 సంవత్సరాలకు పైగా జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియార్టీ దృష్ట్యా జాతి దృష్టిని తనవైపు తిప్పుకోగలిగింది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగబోతున్నారన్న ప్రకటన రాగానే టీడీపీ పార్లమెంటులోనే దీక్ష పేరిట హంగామా సృష్టించింది. జనసేన,వామపక్షాలు పాదయాత్ర చేపడుతున్నాయని ప్రకటించడంతో అదేరోజు ఉదయం ముఖ్యమంత్రి స్వయంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలవారీ టీడీపీ శ్రేణులన్నీ సైకిల్ యాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారమంతా చూస్తే తెలుగుదేశం పార్టీలో అంతర్లీనంగా చోటు చేసుకుంటున్న భయాందోళనలు కూడా తేటతెల్లమవుతున్నాయి. హోదా పోరులో తమను ప్రతిపక్షాలు ఎక్కడ అధిగమిస్తాయోనన్న భయం టీడీపీని వెన్నాడుతోంది. అందుకే ప్రతిపక్షాల తరహాలోని నిరసనలనే కొంచెం ముందుగా తాను చేపడుతోంది. అయితే ఉద్యమాలు, ఆందోళనల ఫలితం అధికారంలో ఉన్నవారికంటే విపక్షాలకే ఎక్కువగా లాభిస్తుందనేది చారిత్రక సత్యం. ఈ వాస్తవం రివర్స్ అయితేనే టీడీపీ చరిత్ర తిరగరాయగలుగుతుంది.

ఎర్రతనమే ఎత్తిన జెండా...

జనసేన పార్టీ బలమూ, బలహీనత రెండూ పవన్ చేపట్టిన పాదయాత్రలో స్పష్టమయ్యాయి. ఎర్రజెండాల అండతో ఉద్యమపతాక ఎగసింది. దీంతో జనసేన కంటే కమిటెడ్ కార్యకర్తలున్న వామపక్షాల హడావిడే ఎక్కువగా కనిపించింది. జనసేన శ్రేణులను ఎవరూ గుర్తించను కూడా గుర్తించలేదు. పవన్ ను చూసేందుకు ఎగబడిన అభిమానులు విస్తృత స్థాయి ప్రజాదరణకు సింబాలిక్ గా నిలిచారు. మొత్తమ్మీద నిర్మాణాత్మకమైన పార్టీల అండదండలనేవి జనసేన ఎంచుకున్న తెలివైన వ్యూహమే. పార్టీ నిర్మాణం లేకపోయినా ఆ కొరతను తీర్చేందుకు ఈ శ్రేణులు ఉపకరిస్తాయి. అదే సమయంలో ఏదేని అంశంలో సీపీఐ,సీపీఎంలతో విభేదాలు తలెత్తితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఎర్రజెండాలు కలిసిరావడమనేది రాజకీయప్రభావం వరకూ మంచిదే. కానీ సొంతబలం విషయంలో ఒక స్పష్టతకు రాలేని పరిస్థితి జనసేనది. ప్రధాన పార్టీకి కుడిఎడమల సీపీఐ,సీపీఎంలు. అవే ప్రధాన పార్టీలుగా మారితే అనుకున్న ఫలితం సాధించడం కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో వామపక్ష సిద్దాంతాలపై ఇప్పటికే అవగాహన ఉంది. ఒక నూతన రాజకీయ ఒరవడిని స్రుష్టించలేకపోతే కేవలం ఎర్రపార్టీల బాటనే అనుసరిస్తామంటే ఈ కాలంలో కొంత కష్టమేనంటున్నారు పరిశీలకులు.

పక్కాగా జగన్ పంఖా ...

వైసీపీ కొంత ఆనందంగానే కనిపిస్తోంది. పవన్ అండ టీడీపీకి దూరమైంది . బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు మద్దతునిచ్చే వామపక్షాలు జనసేనను ఆశ్రయించడం కూడా కలిసొచ్చే అంశంగానే వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. బీజేపీ నుంచి దూరమైన తెలుగుదేశానికి సీపీఐ,సీపీఎం దన్నుగా నిలిస్తే దాదాపు 20 నియోజకవర్గాల్లో దాని ప్రభావం వైసీపీపై పడుతుంది. ఇప్పుడా సమస్య లేదు. జనసేన, వామపక్షాలు ఒక కూటమిగా ఉంటాయి. తమ ఓటు బ్యాంకు తమకే ఉంటుంది. టీడీపీ కి బీజేపీ, జనసేన దూరమవ్వడం వల్ల కనీసంగా అయిదుశాతం ఓట్లు కోల్పోతుంది. దీంతో దాదాపు పదిహేను లక్షల ఓట్ల వరకూ టీడీపీ కంటే తమకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఆధిక్యం దక్కుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంద్రలతోపాటు ఎస్సీ,ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో తమకు స్పష్టమైన మెజార్టీ దక్కునున్నట్లు తేలిందని వైసీపీ సంబరపడుతోంది. తాము కదిలిన తర్వాతనే టీడీపీ అనుసరిస్తోందన్న విషయం రాష్ట్రప్రజలు గుర్తించగలుగుతున్నారని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. తాము ఇప్పటికే లీడింగ్ పార్టీగా నైతికంగా విజయం సాధించామనేది వైసీపీ పార్టీ వ్యక్తం చేస్తున్న విశ్వాసం.

అంతా మా వాళ్లే...

ఎవరు గెలిస్తే ఏం పోయిందన్నట్లుగా ఉంది బీజేపీ ధోరణి. టీడీపీ రాజకీయ అనివార్యతతోనే తమకు దూరంకావాల్సి వచ్చిందని ఇప్పటికీ కమలనాథులు విశ్వసిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే రాష్ట్రప్రయోజనాల పేరిట తిరిగి తమ చెంతకు రావాల్సిందేనన్న ధీమా బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ నాయకులు ఇప్పటికే తాము ఎవరికీ దూరం కాదంటూ చెప్పేశారు. భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలపడానికి ఎటువంటి అభ్యంతరం లేని రాజకీయ స్థితిని వారు తమ వద్దనే ఉంచుకున్నారు. కాంగ్రెసు కూడా ఆశగానే ఉంది. టీడీపీ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పరోక్ష మద్దతు ఇస్తుందన్న ఆశాభావం కాంగ్రెసులో ఉంది. జనసేన, వామపక్షాలు కలిసి గెలిస్తే బీజేపీకి వ్యతిరేకంగా కచ్చితంగా తమకు బయట నుంచైనా బాసటగా నిలవాల్సిందేనని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. రెండు జాతీయ పార్టీలు సొంతబలంపై కాకుండా ఏదోరకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు కనీస సంఖ్యలోనైనా మద్దతు లభిస్తుందనే భరోసాతో ఉండటమే రాజకీయ విచిత్రం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News