జగన్ ను అలా దెబ్బతీయాలనా?

తెలంగాణలో ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో [more]

Update: 2019-01-24 08:00 GMT

తెలంగాణలో ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేశారు. అయితే, సీన్ రివర్స్ అయ్యింది. పొత్తు బెడిసికొట్టి కాంగ్రెస్ – టీడీపీ కూటమి ఓటమి పాలయ్యింది. తెలంగాణ ఇచ్చిన ఇమేజ్ తో పాటు, అంతోఇంతో బలంగా ఉన్న తెలంగాణలోనే కాంగ్రెస్ తో పొత్తు చంద్రబాబుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. పైగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని ఓ మాటను మూటగట్టుకోవాల్సి వస్తుంది. పైగా ఏపీలో కాంగ్రెస్ బలంగా లేదు గానీ బలమైన నాయకులు మాత్రం కొందరు మిగిలిపోయారు. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. పొత్తు ఉంటే వారిలో చాలామందికి టీడీపీ టిక్కెట్లు వదులుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే ఆ స్థానాల్లో ఎక్కు ఓడిపోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు కాంగ్రెప్ పై పక్కా వ్యూహం రచించినట్లు కనిపిస్తోంది.

ఒంటరి పోరే అని తేల్చిన కాంగ్రెస్

ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసి చంద్రబాబు చర్చించారు. అయితే, నరేంద్ర మోదీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసే దిశగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. అందుకే వీరి భేటీ జరిగిన తెల్లారే జరిగిన ఏపీ కాంగ్రెస్ సమావేశంలో పొత్తు ఉండదని కాంగ్రెస్ అధిష్ఠానం సిగ్నల్ ఇచ్చేసింది. ఆధిష్ఠానం ఆదేశాలతో ఒంటరిగా పోటీ చేస్తున్నామని రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఊమెన్ చాందీ ప్రకటించారు. అయితే, చంద్రబాబు – రాహుల్ గాంధీ మధ్య చర్చల అనంతరమే ఈ నిర్ణయం జరిగినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ తో పెట్టు పెట్టుకుంటే టీడీపీ నష్టమని చంద్రబాబు భావించారు. అదే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి ఎటువంటి నష్టం లేకపోగా వైసీపీకి కొంత నష్టం కలుగుతుందనేది ఆయన అంచనాగా కనిపిస్తోంది.

పొత్తు బెడిసికొడుతుందనే…

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది. చాలామంది నేతలు ఎవరి దారులు వారు చూసుకున్నారు. ఎక్కడా అవకాశం లేని వారు, కాంగ్రెస్ ను వీడేందుకు మనస్సు ఒప్పని వారు మాత్రం పార్టీలో మిగిలిపోయారు. వీరిలో సుమారు 10 – 15 మంది బలమైన నేతలున్నారు. వీరి గెలిచినా గెలవకపోయినా భారీగా ఓట్లు సాధించే అవకాశమైతే ఉంది. అయితే, వీరికి వచ్చే ఓట్లన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడాల్సినవే అనేది టీడీపీ అంచనా. వైసీపీ, కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఒక్కటే. కాంగ్రెస్ ఓటుబ్యాంకే వైసీపీ వైపు మళ్లింది. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా కాంగ్రెస్ కి ఓటేసేవారు టీడీపీకి ఓటేయడం కంటే వైసీపీకి ఓటేసేందుకు మొగ్గు చూపుతారు. కాబట్టి, పొత్తు ఫెయిల్ అవుతుంది. అందుకే కాంగ్రెస్ ఒంటరి పోరుకు దిగనుంది.

వైసీపీ ఓట్లను చీల్చేనా..?

అయితే, కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులను దింపడం ద్వారా ఆయా స్థానాల్లో వైసీపీని దెబ్బతీయాలనేదే చంద్రబాబు వ్యూహం అంటున్నారు. కనీసం 20 – 30 స్థానాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధిస్తే ఆ స్థానాల్లో వైసీపీ విజయావకాశాలు దెబ్బతింటాయని టీడీపీ అంచనా. అయితే, గత ఎన్నికల్లో చాలామంది బలమైన నేతలు ఉన్నా కాంగ్రెస్ కి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంచుమించు అటువంటి నేతలంతా టీడీపీ, వైసీపీ, జనసేనలో చేరిపోయారు. మరికొందరు కూడా లైన్ లో ఉన్నారు. మరి, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా అంటే అనుమానే అని చెప్పారు.

Tags:    

Similar News