గెలుపుపై బాబు ఆశ అదొక్కటే..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఫీవర్ వచ్చేసింది. పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆరోపణలు, విమర్శలతో రాజకీయ నేతలు మాటతూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం తెలుగుదేశం [more]

Update: 2019-01-26 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఫీవర్ వచ్చేసింది. పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆరోపణలు, విమర్శలతో రాజకీయ నేతలు మాటతూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండటంతో రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు అవుతున్నా అధికారంలోకి రాకపోవడంతో జగన్ కి ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో ఓడితే ఆ పార్టీ పూర్తిగా నైరాశ్యంలో పడిపోతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికలు చాలా కీలకం. ఒకవేళ ఆ పార్టీ ఓడి జగన్ కనుక అధికారంలోకి వస్తే జగన్ మరింత బలమైన నాయకుడిగా ఎదుగుతారు. అలాగైతే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. దీంతో రెండు పార్టీలకూ ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు చేతిలో మూడు అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

కుట్రలు అంటే జనం నమ్ముతారా..?

మొదటిది తనకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి జగన్ తో కుట్ర చేస్తున్నారనే ఆరోపణ. ఈ విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. మోదీని ఏపీలో విలన్ గా చూపించడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఇక, జగన్ తో కేటీఆర్ భేటీ తర్వాత టీడీపీ కేసీఆర్ ని టార్గెట్ చేసింది. ఆంధ్రా ప్రజల పాలిట కేసీఆర్ రాక్షసుడు అన్న రేంజ్ లో ప్రచారం చేస్తోంది. వీరిద్దరితో జతకలిసిన జగన్ ఆంధ్రాద్రోహి అంటోంది. అయితే, బీజేపీ విషయంలో టీడీపీ ప్లాన్ కొంతవరకు సక్సెస్ అయినా కేసీఆర్ విషయంలో అంతగా వర్కవుట్ అవ్వడం లేదు. మొన్నటివరకు కేసీఆర్ తో కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. దీంతో కేసీఆర్ ని బూచీగా చూపిస్తే ఏపీ ప్రజలు నమ్మే ఛాన్స్ లు తక్కువే. ఇక, వీరిద్దరితో జగన్ కుమ్మక్కయ్యారనేది టీడీపీ ఆరోపణ. అయితే, బీజేపీతో జగన్ కలిశారనే ప్రచారం మాత్రం జగన్ కి కచ్చితంగా నష్టం చేసే అవకాశం ఉంది. తనకు బీజేపీతో సంబంధం లేదని జగన్ ప్రజలకు చెప్పుకోలేకపోవడంతో టీడీపీకి కొంతమేర కలిసి వచ్చే అవకాశమైతే ఉంది. అందునా మొన్నటివరకు చంద్రబాబే బీజేపీతో కలిసి ఉన్నారు కదా అనే విషయం ప్రజల్లో ఉంది.

అభివృద్ధి పట్ల ప్రజలు హ్యాపీనేనా..?

ఇక, చంద్రబాబు చేతిలో ఉన్న మరో అస్త్రం అభివృద్ధి. గత ఎన్నికల్లో జగన్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నాయకుడు అయితే మేలు అని ప్రజలు భావించి చంద్రబుబ నాయుడుకి పట్టం కట్టారు. ఇప్పుడు కూడా ఈ అభివృద్ధి, అనుభవం నినాదాన్ని చంద్రబాబు మరోసారి నమ్ముకున్నారు. అయితే, అమరావతిలో అభివృద్ధి పట్ల ప్రజలు కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇక, అమరావతి ఒక్కటే అభివృద్ధి అయితే సరిపోతుందా అనే భావన కూడా మిగతా జిల్లాల ప్రజల్లో ఉంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ఇప్పుడు శంకుస్థాపనలతో కొంచెం హడావుడి చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియా ప్రభావంతో ప్రతీ విషయాన్నీ గమనిస్తున్న ప్రజలు ఎన్నికల వేళ శంకుస్థాపనలను నమ్మడం తక్కువే. ఇక, టీడీపీ మళ్లీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుంది, రాజధాని మారుస్తారు అనే ప్రచారాలను కూడా ఆ పార్టీ మొదలుపెట్టింది. అయితే, తాను వస్తే అభివృద్ధి మరింత వేగంగా చేస్తానని, అమరావతిని వేగంగా పూర్తి చేస్తానని జగన్ చెప్పుకోలేకపోతున్నారు. ఇది చంద్రబాబుకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

సంక్షేమమే రక్షించాలి…

ఇక, చంద్రబాబు చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం సంక్షేమం. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు చేయని విధంగా ఆయన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సంక్షేమంపై మక్కువ చూపించారు. అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పింఛన్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇక, ఎన్నికల వేళ ఆయన పింఛన్లను రెట్టింపు చేసి గంపగుత్తగా పింఛన్ దారుల ఓట్లకు గాళం వేశారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అన్ని గ్రామాల్లో ఘనంగా చేయాలని ఆయన నిర్ణయించారు. పింఛన్ దారులకు భోజనం పెట్టి మరీ ఒక పండగ వాతావరణం తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక, రైతు రుణమాఫీ కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు నెలల్లో ఆయన మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరడంలో అనేక లోపాలు ఉన్నాయి. మధ్యవర్తుల వ్యవస్థ వల్ల లబ్ధిదారుల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. పింఛన్ల పెంపు టీడీపీకి కచ్చితంగా కొంతమేర కలిసివచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కుట్ర ఆరోపణలు, అభివృద్ధి, అనుభవం అనే టీడీపీ అస్త్రాలు ఈసారి పనిచేసే అవకాశాలు తక్కువే అయినా సంక్షేమ పథకాలు మాత్రం కొంత ఊరట కలిగిస్తాయంటున్నారు.

Tags:    

Similar News