స్పెషల్ స్ట్రాటజీ ఏమవుతుందో?

అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి అంశాన్ని తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమయింది. అసెంబ్లీలో వైసీపీని అడ్డుకునేంత బలం తెలుగుదేశం పార్టీకి లేదు. సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ [more]

Update: 2020-01-20 02:00 GMT

అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి అంశాన్ని తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమయింది. అసెంబ్లీలో వైసీపీని అడ్డుకునేంత బలం తెలుగుదేశం పార్టీకి లేదు. సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానులపై బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. అయితే తెలుగుదేశం మాత్రం అమరావతి తరలింపును వ్యతిరేకిస్తుంది.

ఇప్పటికే జిల్లాల్లో….

ఇప్పటికేే అమరావతి పరిరక్షణ పేరుతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటయింది. ఈ జేఏసీలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా వివిధ జిల్లాలో పర్యటిస్తూ అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఆరు జిల్లాలను తిరిగిన చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆంధ్రులు రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. జోలె పట్టి విరాళాలు సేకరించారు.

విప్ జారీ చేసి…..

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. సభకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ ఇప్పటికే జారీ చేసింది. అమరావతి నిర్మాణం ఎందుకు జరిగింది? ప్రభుత్వం వేస్తున్న నిందలపై చంద్రబాబు సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. విశాఖను తరలించడం వల్ల జరిగే లాభనష్టాలను కూడా చంద్రబాబు సభలో తెలియజేయనున్నారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు చేత దీనిపై విమర్శలు చేయాలన్న వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు.

ఓటింగ్ కు పట్టుబడితే….?

విప్ జారీ చేయడంతో పాటు ఓటింగ్ కు కూడా తెలుగుదేశం పార్టీ పట్టుబట్టే అవకాశముంది. ఓటింగ్ కు పట్టుబడితే ఉత్తరాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితిపై కూడా అనుమానంగానే ఉంది. అమరావతి తరలింపు నిర్ణయాన్ని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా టీడీపీ ప్రయత్నించాలని భావిస్తుంది. రైతులు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలను తుంగలో తొక్కితే న్యాయపరంగా కూడా ఎదుర్కొనాలని టీడీపీ సిద్ధమయింది. మరికాసేపట్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అమలు పర్చనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News