ఈ సాహసానికి చెల్లించాలా.. మూల్యం..?

Update: 2018-04-20 14:30 GMT

చంద్రబాబు నాయుడు వ్యూహకర్త, చతురుడు. రాజకీయ చాణుక్యుడు. కానీ సాహసించడు. పొలిటికల్ రిస్క్ చేయడు. అన్ని లెక్కలు కుదిరితేనే స్టెప్ తీసుకుంటాడు. గతచరిత్ర తవ్వి తీస్తే వెల్లడయ్యే సత్యమిదే. తాజాగా బీజేపీతో పొత్తు వదిలేసుకోవడంలోనూ, కేంద్రంపై పోరాటమంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనూ రాజకీయ లెక్కలున్నాయి. అయితే ఈసారి కొంత రిస్క్ కూడా తోడైంది. ఇది ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నది తేలాలంటే ఎన్నికల వరకూ ఆగాలి. తెలుగుదేశం చేసే రాజకీయ ఉద్యమాలను ఏపీ ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారు? విశ్వసిస్తారు? అన్నదానిపై ఆధారపడే ఎన్నికల పంట పండుతుంది. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా సీరియస్ గానే దీక్షలు, ఆందోళనల పేరిట క్యాడర్ ను ఉరుకులుపరుగులు తీయించాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నిరసన దీక్ష చేపట్టడమూ ఇందులో భాగమే. తానే దీక్షకు కూర్చున్నప్పుడు పార్టీ శ్రేణులు సై అనక తప్పదుగా అన్న లాజిక్ . ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తే మ్యాజిక్ ఇందులో దాగి ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆచితూచి అడుగులు...

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకుంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం చంద్రబాబు నాయుడి రాజకీయ చరిత్రలో పెద్ద సాహసంగా చెప్పుకోవాలి. 1995లో ఎన్టీరామారావును పదవీ చ్యుతుడిని చేసిన సందర్బంలో సైతం ఎన్నో లెక్కలు వేసుకున్న తర్వాతనే ఆ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కుటుంబం మొత్తాన్ని ఆయనకు వ్యతిరేకంగా మార్చారు. తన ప్రత్యర్థి వర్గంలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన గూటికి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేలను సామదానభేదోపాయాల ద్వారా శిబిరంలో చిలుకలుగా మార్చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలను తానే కలుసుకోలేని ఒక వలయాన్ని ఎన్టీయార్ కు అడ్డంగా పెట్టేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని కచ్చితంగా వర్కవుట్ అవుతుందనుకున్న తర్వాతనే ఎన్టీయార్ ను గద్దె దించారు. 1999లో బీజేపీతో చేతులు కలిపే సందర్భంలో మైనారిటీ ఓటు దూరమవుతుందని తెలిసినా అంతకుమించి కార్గిల్ ప్రభావంతో దేశభక్తి ఊపేస్తోందని తెలిసిన తర్వాతనే పొత్తు పెట్టుకున్నారు. వై.ఎస్.ను ఒంటరిగా ఓడించలేమని గ్రహించి 2009లో మహాకూటమి కట్టారు. కొంతమేరకు ఫలితమిచ్చినా చిరంజీవి ప్రజారాజ్యం ప్రవేశంతో పూర్తిగా సర్కారీ వ్యతిరేక ఓటు మహాకూటమికి లభించలేదు. కానీ తెలుగుదేశం మాత్రం 2004తో పోలిస్తే బాగా పటిష్ఠమైంది. ఇక్కడా లెక్కలే ప్రాధాన్యం వహించాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత రెండు కళ్ల సిద్దాంతం పేరుతో ఎటూ తేల్చకుండా తెలివిగా పావులు కదిపారు, రిస్క్ తీసుకోవడానికి సాహసించలేదు. సమ న్యాయం పేరిట అటుఇటు ఓట్లు చెల్లాచెదురుకాకుండా చూసుకోవాలని యత్నించారు. ఇది కొంతమేరకు టీడీపీని కాపాడింది. తెలంగాణ ప్రజలు టీడీపీని శత్రువుగా భావించలేదు. అటు ఆంధ్రాప్రజలూ దూరం పెట్టలేదు. 2014లో మోడీ, పవన్ ల తో చేతులు కలపడంలోనూ గణాంకాలు, సెంటిమెంటును చక్కగా వాడుకున్నారు. ఇంతటి తెలివైన వ్యూహకర్త ఇప్పుడు మాత్రం ఎంతో కొంత రిస్కుకు సిద్దపడుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

తొలిసారి పెద్ద రిస్కు...

కాంగ్రెసు బాగా పుంజుకోలేని స్థితిలో మూడో ఫ్రంట్ వంటివి ఇంకా కప్పలతక్కెడగా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ బీజేపీదే అధికారమనే వాదనలకు బలం చేకూరుతోంది. 2019లో సీట్ల సంఖ్య తగ్గినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు దీటుగా యూపీఏ తలపడలేదనేది అందరూ అంగీకరిస్తున్న వాదన. ఈ వాస్తవం కళ్లముందు కదలాడుతున్నా చంద్రబాబు బీజేపీతో తెగతెంపులకు సాహసించారంటే పెద్ద రిస్కును తీసుకున్నట్లే. తనను, తనపార్టీని కేంద్రప్రభుత్వ రూపంలో మోడీ, అమిత్ షా ఇబ్బంది పెడతారని తెలిసినా రిస్కు తీసుకున్నారు. మరోవైపు కాపు ఓట్లు దూరమవుతాయని గ్రహించినా పవన్ కల్యాణ్ విడిపోయేందుకు మార్గం సుగమం చేశారు. ఈ రెండు నిర్ణయాలు చంద్రబాబు సహజధోరణికి భిన్నమైనవే. కానీ తప్పలేదు. క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే బీజేపీని దూరంగా ఉంచి ఇంతవరకూ పెద్దగా ప్రగతి సాధించని ఏపీ వైఫల్యాలను కేంద్రం పద్దులోకి తోయాలన్న తపన కనిపిస్తోంది. నిజానికి బీజేపీ, టీడీపీలు సమబాధ్యత వహించాలి. కానీ వైఫల్యాలను చక్కగా కమలం చెవిలో పెట్టేస్తే సరిపోతుందనుకున్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్రంతో పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తేనే ప్రజలు విశ్వసిస్తారు.అందుకే ఆ వైఖరినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం విషయాన్ని గ్రహించలేని అమాయకత్వంలో లేదు బీజేపీ. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం వస్తే మంచిదేనని చంద్రబాబు సిద్దపడిపోయారు. తనపై కేసులు నమోదవుతాయంటూ ఆయన ముందస్తుగానే ప్రకటనలు చేయడంలోని ఆంతర్యమదే. ఒకవేళ కేంద్రం తెగించి ఏదో రకమైన కేసుల్లో తనను ఇరికిస్తే టీడీపీకి ప్రజల సింపథీ లభిస్తుంది. పార్టీ గెలుస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

బీజేపీ యుద్దనీతి...

చంద్రబాబు ఊహించినట్లు కేసులు పెట్టేసి టీడీపీని సులభంగా గట్టెక్కిస్తే కమలం పార్టీ ఎందుకవుతుంది? అందులోనూ మోడీ, అమిత్ షాల జంట అంత తెలివితక్కువగా ప్రత్యర్థికి అస్త్రాలు అందచేస్తారా? అందుకే వారి సారథ్యంలో మరొక వ్యూహం సిద్ధమైందంటున్నారు. పట్టిసీమ, పోలవరం లలో చోటుచేసుకున్న అవకతవకలపై నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ పైన, రాజధానిపై వచ్చిన ఆరోపణల సంగతి తేల్చేందుకు మంత్రి నారాయణపైన కేసులు నమోదు చేయించే విషయంపై కేంద్రం వ్యూహరచన చేస్తోందనేది సమాచారం. బాబు జోలికిపోకపోవడం వల్ల టీడీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపించదు. ఆ పార్టీకి పొలిటికల్ మైలేజీ లభించదు. అదే సమయంలో తన సహచర మంత్రులపై విచారణలు, దర్యాప్తులు మొదలైతే చంద్రబాబు నైతిక స్థైర్యం దిగజారుతుంది. కొట్టకుండానే కన్నీళ్లు పెట్టించడమంటే ఇదే. పాత కాలంలో యుద్దాలు జరిగే సమయంలో ముందుగా సారథిని కుప్పుకూల్చివేసేవారు. తర్వాత రథాలను, అమ్ముల పొదిని నాశనం చేసి రాజును నిస్సహాయుడిగా రణక్షేత్రంలో నిలబెట్టేవారు. తర్వాత ప్రాణమున్నా, పోయినా ఒకటే. రాజు అస్త్ర సన్యాసం చేసి లొంగిపోవడమో, శరణాగతి కోరడమో జరిగేది. అదే వ్యూహాన్ని చంద్రబాబుపై బీజేపీ ప్రయోగించబోతోందనేది ఢిల్లీ వర్గాల సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News