అక్కడ అడుగు పెట్టరేంటి..?

తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ పర్ట్ నర్ అని, వారి మధ్య రహస్య స్నేహముందనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. వైఎస్సార్ కాంగ్రెస్ కు [more]

Update: 2019-04-04 03:30 GMT

తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ పర్ట్ నర్ అని, వారి మధ్య రహస్య స్నేహముందనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. వైఎస్సార్ కాంగ్రెస్ కు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనేదే ఈ రెండు పార్టీల రహస్య వ్యూహమని ప్రతీరోజూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, వైసీపీ నేతలది తప్పుడు ప్రచారమని తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యర్థే అని, రెండు పార్టీలతో సమాన దూరం పాటిస్తున్నామని, తామే వాటికి ప్రత్యామ్నాయమని జనసేన పార్టీ చెప్పుకుంటుంది. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ తమకు మిత్రుడే అని చెప్పిన వీడియోలో వైరల్ గా మారాయి. అయితే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార తీరు మాత్రం కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఎమైనా అవగాహన ఉందా అన్న భావన తలెత్తుతోంది.

ముందు నుంచే అవే ఆరోపణలు చేస్తున్న వైసీపీ

ఈ ఇద్దరు అధినేత ప్రచార శైలిలో ఒకరిపై ఒకరికి సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. చంద్రబాబు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారి తప్ప ఇంకోటి తెలియదని ఎద్దేవా చేస్తున్నారు. దీనికి అర్థం ఎంటో అంతుచిక్కడం లేదు. చంద్రబాబు టార్గెట్ మొత్తం జగన్ అన్నట్లుగా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం జగన్ ను టార్గెట్ చేసినంతగా చంద్రబాబును టార్గెట్ చేయడం లేదు. జగన్ ను ఆరు మాటలు అంటే పవన్ మూడు మాటలు అన్నట్లుగా ఆయన ప్రచారం సాగుతోంది. దీంతో వీరిద్దరి మధ్య అవగాహన ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక, అభ్యర్థుల ఖరారు విషయంలోనూ ఇటువంటి ఆరోపణలే వైసీపీ చేసింది. వైసీపీ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా జనసేన అభ్యర్థులను పెట్టారనేది ఆరోపణ. అయితే, మంగళగిరి స్థానాన్ని బలమున్న జనసేన కాకుండా సీపీఐకి కేటాయించడం మినహా వైసీపీ చేసిన ఈ ఆరోపణలో పెద్దగా బలం కనిపించడం లేదు.

ఆ నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరం

ఇక, తాజాగా ఈ ఇద్దరు నేతల ప్రచారంపై వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం స్థానాల్లో చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ రెండు స్థానాలూ టీడీపీ సిట్టింగ్ స్థానాలే. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అయితే గాజువాకకు ప్రచారానికి రావాల్సిందిగా చంద్రబాబును కోరారని, అయినా ఇంతవరకు వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే ప్రచారం చేయలేదు. మరి, ప్రచారానికి ఇంకా ఆరు రోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికైనా ఈ స్థానాల్లో చంద్రబాబు, పవన్ ప్రచారం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ప్రచారం చేయకపోతే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే అవకాశం ఉంది.

Tags:    

Similar News