బీజేపీ మీద మోజు పెంచుకుంటే?

బీజేపీ ఇపుడు తిరోగమనంలో ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2014లో మోడీ దేశంలో అధికారంలోకి వచ్చినపుడు జాతీయ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉందో ఇపుడు అదే స్థాయిలోకి [more]

Update: 2019-12-06 14:30 GMT

బీజేపీ ఇపుడు తిరోగమనంలో ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2014లో మోడీ దేశంలో అధికారంలోకి వచ్చినపుడు జాతీయ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉందో ఇపుడు అదే స్థాయిలోకి తిరిగి వచ్చేసిందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. 2018 మార్చి నాటికి చూసుకుంటే దేశంలోని 20కి పైగా పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాల్లో కూడా మిత్రులతో కలుపుకుని ఆ పార్టీ ఉంది. ఇపుడు మాత్రం సగానికి సగం బలం తగ్గిపోయింది. ఇక రేపటి రాష్ట్రాల ఎన్నికలు వరసబెట్టి చూసుకున్నా కూడా బీజేపీకి కలసివచ్చేవి తక్కువేనని అంటున్నారు. ఈ నేపధ్యంలో దేశంలో కాంగ్రెస్ గతం కంటే ఏ మాత్రం పుంజుకున్న ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు తిరిగి తలెత్తి కొత్త రాజకీయం దేశంలో తయార‌య్యే అవకాశాలు ఉన్నాయని తలపండిన రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలివైన రాజకీయ నాయకులు ఆచీ తూచీ అడుగులు వేయాల్సిఉంటుందని కూడా అంటున్నారు.

మళ్ళీ దొరుకుతారా…?

రాజకీయం కూడా రంగులరాట్నమే. పైకి వెళ్ళిన తరువాత మళ్ళీ కిందకు దిగిరాకతప్పదు, అలా కనుక చూసుకుంటే బీజేపీ వరసగా రెండు ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారం సంపాదించారు. ఇక 2024 నాటికి 75 ఏళ్ళు వచ్చేసి ప్రధాని రేసు నుంచి మోడీ కూడా తప్పుకుంటారు, ఆ పార్టీపై మోజు కూడా ఇదివరకులా ఉండదని కూడా లెక్కలు కడుతున్నారు. ఇపుడు ఏపీ లాంటి రాష్ట్రాలను చూసుకుంటే అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు బీజేపీలో కలసి ప్రయాణం చేసేందుకు సిధ్ధంగా ఉన్నాయి. కానీ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలం కాకపోతే ఆ పార్టీ వ్యతిరేకతతో ఈ రెండు పార్టీలు కూడా మరో మారు చతికిలపడే ప్రమాదం కూడా ఉండొచ్చని అంటున్నారు. రాజకీయం గాలి వాటును చూసుకుని ఎన్నికల వరకూ బండిని లాగడం ద్వారా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే ఏపీలో టీడీపీ, జనసేనలకు ఒడ్డున పడే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు.

మరో యూటర్న్…..

ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు సైతం ఇలాంటి విషయాలను ముందే ఊహించి తదనుగుణంగా పావులు కదపగలరని అంటున్నారు. అయితే మరో నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి చెడ్డ కాకుండా ఓ వైపు ప్రేమ లేఖలు రాస్తూనే వచ్చే ఎన్నికల ముందు చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అందుకే చంద్రబాబు ఇప్పటి అవసరాన్ని బట్టి పొత్తుల వరకే మాట్లాడుతూ జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ మాత్రం ఇప్పటి నుంచే బీజేపీ ట్రాప్ లో పడిపోయి సొంత దుకాణం కనుక బంద్ చేస్తే మాత్రం 2024 నాటికి కచ్చితంగా పరిస్థితులు మారితే మరోమారు బోల్తా కొట్టకతప్పదని అంటున్నారు. మరి చంద్రబాబు లాగానే పవన్ యూటర్న్ తీసుకోవాలన్నా కూడా జనసేన అప్పటికి అస్థిత్వంలో ఉండాలి. ఈ మధ్యలో తొందరపడితే మాత్రం ఫలితం శూన్యమేనని విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News