కిందా మీదా పడుతున్నా…?

చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో దక్కిందే ఘోరమైన ఓటమి. దాంతోనే కిందా మీద అవుతున్నారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారే.. నేను ప్రజలకు ఏం అన్యాయం చేశాను [more]

Update: 2020-01-19 06:30 GMT

చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో దక్కిందే ఘోరమైన ఓటమి. దాంతోనే కిందా మీద అవుతున్నారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారే.. నేను ప్రజలకు ఏం అన్యాయం చేశాను అని చంద్రబాబు బాధపడని రోజు లేదు. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా వారైనా గెలవబట్టి చంద్రబాబు ప్రతిపక్ష హోదా అయినా నిలబడింది. ఇపుడు అందులో నుంచి కూడా ఇద్దరిని తప్పించేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. బాబుకు దమ్ముంటే తన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, అమరావతి రాజధాని అంశం మీద ఉప ఎన్నికలకు సిధ్ధపడాలని ఆయన గట్టి సవాల్ చేశారు. సవాల్ సంగతి పక్కన పెడితే 21 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అనడమే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

చుట్టాలైపోయారా?

టీడీపీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి ఒకసారి జగన్ ని కలిసారు, అంతే ఆయన కూడా వైసీపీ చుట్టమైపోయారా అన్న ప్రశ్న వస్తోంది. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎటూ అసెంబ్లీలో ప్రత్యేక సీట్లో కూర్చుంటున్నారు. దాంతో రెండు తగ్గించి చెప్పామని, లెక్క ఇప్పటికైతే సరిపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికైతే అనడంలోనే మరో ట్విస్ట్ ఉందని కూడా అంటున్నారు. చంద్రబాబు మరింత ఆలస్యం చేస్తే మరింతమంది ఎమ్మెల్యే తమ్ముళ్ళు కూడా తమవైపే వస్తారని కూడా వైసీపీ నేతల ధీమా. అపుడు ఎంచక్కా చంద్రబాబు ఒక్కరే పార్టీలో ఉండొచ్చు, ఈ ఉప ఎన్నికల సవాళ్ళూ తప్పుతాయని సెటైర్లు వేస్తున్నారు.

అంత ఆశేంటో?

ఎన్నికలు అయి గట్టిగా ఎనిమిది నెలలు కూడా కాలేదు, అయినా చంద్రబాబు ప్రతిపక్ష పాత్రలో ఉండేందుకు అసలు ఇష్టపడడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన చూపు అంతా సీఎం సీటు మీదనే ఉందని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన జగన్ ని రాజీనామా చేయమనడం ఏంటని కూడా మండిపడుతున్నారు. చంద్రబాబు జగన్ ని సీఎంగా ఒప్పుకోలేకపోతున్నారని అందుకే ఏవో కాకమ్మ కధలు చెబుతూ అసెంబ్లీ రద్దు చేయమని కుంటి సవాళ్ళు విసురుతుతున్నారని కూడా అంటున్నారు.

సరదా తీరుతుందా…?

రాజీనామాలు మేమెందుకు చేయాలి, అధ్బుతమైన మెజారిటీ కట్టబెట్టిన జనం తీర్పుని ఇది అపహాస్యం చేసినట్లే అవుతుందని వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ కూడా అంటున్నారు. మీకు అంత సరదాగా ఉంటే రాజీనామాలు చేసుకోండి, ఆ సీట్లు కూడా మాకే జనం ఇస్తారు, అపుడు ఆ సరదా కూడా తీరుపోతుందని ఆయన సలహా ఇస్తున్నారు. ఇదే మాటను అవంతి కూడా అంటున్నారు విశాఖ, రాయలసీమలో తమ్ముళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలవగలవా చంద్రబాబూ అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ రద్దు అని కలవరించడం కాదు, ముందు టీడీపీ రద్దు కాకుండా చూసుకోమని వైసీపీ నేతలు చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News