బాబుని బిగించేస్తున్నారుగా

ఏపీలో రాజకీయాలు నడవడంలేదు. ప్రత్యర్ధులుగా నేతలు లేరు. అంతా శత్రువులే. ఒకరిని ఒకరు ఓడించుకోవడం కాదు, రంగస్థలం నుంచి శాశ్వతంగా తప్పించడమే టార్గెట్. ఓ విధంగా ఏ [more]

Update: 2019-11-29 05:00 GMT

ఏపీలో రాజకీయాలు నడవడంలేదు. ప్రత్యర్ధులుగా నేతలు లేరు. అంతా శత్రువులే. ఒకరిని ఒకరు ఓడించుకోవడం కాదు, రంగస్థలం నుంచి శాశ్వతంగా తప్పించడమే టార్గెట్. ఓ విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో రాజకీయ అరాచకం పరాకాష్టకు చేరింది. తండ్రి పోయి అతి పెద్ద దెబ్బ తిన్న జగన్ ని సీబీఐ కేసుల్లో అక్రమంగా కాంగ్రెస్ తో కలసి చంద్రబాబు ఇరికించాడని మాటకు వస్తే చాలు వైసీపీ నేతలు అంటారు. అకారణంగా జగన్ ని 16 నెలలు జైలు గోడల నడుమ ఉంచారని, ఆయన జీవితాన్ని, పరువును పూర్తిగా మంటగలిపోరన్న ఆక్రోశం వైసీపీ నేతల్లో ఉంది. జగన్ చెల్లెలు షర్మిల అయితే అప్పట్లో తన పాదయాత్ర సందర్భంగా ఒక మాట అనేవారు. జగన్ అన్నను అకారణంగా జైలుకు పంపారని, రేపు కోర్టులు ఈ కేసు కొట్టేసి నిర్దోషి అని ప్రకటిస్తే జైలు గోడల మధ్య జగన్ కోల్పోయిన జీవితమే కాదు, ఆయన మీద పడిన బురద, ఇన్నేళ్ళుగా అనుభవించిన మనో వేదన తిరిగి ఇవ్వగలరా? అని. నిజమే ఇది చాలా విలువైన ప్రశ్న. జగన్ కనుక నిర్దోషి అని కోర్టులు చెప్పిన వేళ ఆయన్ని జైలు, బెయిలుతో కలిపి ప్రతీ నిముషమూ వెటకారం ఆడి మానసికంగా వేదనకు గురిచేస్తున్న విపక్షాలు ఏమని సమాధానం చెబుతాయి.

ఏసీబీ కేసు మీద గురి….

ఇవే రకమైన ఆలోచనలు అందరిలాగానే జగన్ లో కూడా ఉంటాయి కదా. ఆయన కూడా మానవమాత్రుడే. తనను అన్యాయంగా జైల్లో పెట్టారన్న అక్కసు ఆయనలో కూడా ఉంటుంది కదా. అందుకు పరిహారంగా చంద్రబాబుకి కూడా జరిగితే తప్పులేదని వైసీపీ నేతలు అనుకుంటారు కూడా. పాలనతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మీద పదకొండు చార్జిషీట్లు దాఖలు అయితే మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మీద కేసులు ఎందుకు ఉండవన్నది వైసీపీ నేతల వాదన. దానికి తగినట్లుగానే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చంద్రబాబు అక్రమాస్తుల మీద పెట్టిన కేసుల విషయంలో స్టే ఎత్తివేయడం వైసీపీ నేతలకు ఇపుడు మహదానందం కలిగిస్తోంది. పైగా లక్ష్మీపార్వతి ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆమె తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. ఈ కేసు పెట్టినపుడు ఆమెది ఒంటరి పోరాటం అయినా ఇపుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కీలక నేత ఆమె. దాంతో ప్రభుత్వ పరమైన సహాయసహకారాలు ఆమెకు ఈ కేసులో అందుతాయని అంటున్నారు. జగన్ సైతం లక్ష్మీపార్వతిని అస్త్రంగా చేసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది.

మళ్ళీ ఓటుకు నోటు…?

ఇక జగన్ కి అత్యంత సన్నిహితుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చంద్రబాబు ఓటుకు నోటు కేసును మరో మారు కదుపుతున్నారు. దీంతో తెలుగు రాజకీయాల్లో నాలుగున్నరేళ్ళ క్రితం సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. సుప్రీం కోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ ని రామక్రిష్ణారెడ్డి దాఖలు చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది. 2017ల్లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీం కోర్టులో పిటిషన్ లిస్ట్ కాలేదు. దీంతో ఆయన మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

కోర్టు మెట్లు ఎక్కించాలని…..

ఈ కేసులో చంద్రబాబుతో పాటు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు కనుక విచారణకు సుప్రీం కోర్టు లిస్ట్ చేస్తే మాత్రం చంద్రబాబుకు కొత్త కష్టాలు ప్రారంభమైనట్లే. ఇలా ఓ వైపు లక్ష్మీ పార్వతి, మరో వైపు ఆర్కే బాబుని కోర్టు మెట్లెక్కించడానికి రెడీ అవుతున్నారు. వెనకాల ఉన్నది మాస్టర్ మైండ్ జగన్ అని వేరే చెప్పనక్కరలేదు. మరి ఏదో విధంగా బాబుని న్యాయస్థానాల పలు చేసి తనకు జరిగిన దానికి టిట్ ఫర్ టాట్ చెప్పాలని జగన్ పట్టుదల మీద ఉన్నట్లుగా చెబుతున్నారు. విశేషమేంటంటే బాబు మీద ఉన్న మరిన్ని స్టేల విషయంలో కూడా ఎత్తివేయించేందుకు వైసీపీ ఇపుడు సీరియస్ గానే పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో

Tags:    

Similar News