ఆయన ఆపరు..ఈయన చెప్పరు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కన్పిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా రాజకీయాలు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ, టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. [more]

Update: 2019-09-22 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కన్పిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా రాజకీయాలు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ, టీడీపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ విశేషమేంటంటే….ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రోజుకొక అంశంపైన జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆత్మకూరు దళిత బాధితుల దగ్గర నుంచి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యవరకూ, పోలవరం రీటెండర్ల నుంచి ఏపీపీఎస్సీ పరీక్ష ల వరకూ చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై వెనక్కు తగ్గకుండా విమర్శలుచేస్తున్నారు. కానీ చంద్రబాబు విమర్శలకు సమాధానం జగన్ వద్ద నుంచి రావడం లేదు.

బాబు హయాంలో…..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత అమరావతిలోనే ఉంటున్నారు. జిల్లాపర్యటనలకు తప్పించి ఎక్కువ సమయాన్ని పరిపాలనకే కేటాయిస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే తరహాలో పాలన సాగించారు.చంద్రబాబు హయాంలోనూ బోటు ప్రమాదాలు జరిగాయి. ఆత్మహత్యలుజరిగాయి. కానీ అప్పట్లో చంద్రబాబు కీలక అంశాలను ప్రజలకు వివరించే బాధ్యతను తన భుజాన మీదే వేసుకునే వారు. పెద్ద సంఘటన అని భావిస్తే చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరించేవారు.

ఏ అంశంపైనేనా…..

కానీ వైఎస్ జగన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కన్పిస్తున్నారు. రాజధానిపై పెద్ద రచ్చే జరిగినా, ఏపీలో హాట్ టాపిక్ గా మారినా జగన్ మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. ఒక టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇది ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు దాదాపు ఒకే రోజు రెండు చోట్ల మీడియా సమావేశాలు పెట్టి ఆరోపించారు. కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు విమర్శలకు మంత్రలు, ఎమ్మెల్యేల నుంచే సమాధానం వచ్చింది. జగన్ మాత్రం స్పందించలేదు.

పోలవరంపై కూడా….

ఇక ఇటీవల పోలవరం రీ టెండర్లపై కూడా చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం రీటెండర్ల పేరుతో తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు చంద్రబాబు. జగన్ విధ్వంసక చర్యలతో పోలవరం నాణ్యత ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి జగన్ నుంచి సమాధానం లేదు. ఇక ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనికి సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పారు. ఇలా చంద్రబాబు చెప్పకుండా ఆపరు.. జగన్ మౌనం వీడరు అన్న రీతిలో ఏపీ పాలిటిక్స్ సాగుతున్నాయి.

Tags:    

Similar News