ఆ మాటే మరిచారా…?

ఎన్నికలకు ముందు వరకు కాస్కో మోడీ అంటూ అన్ని రాష్ట్రాలకూ పరుగులు తీసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మోడీ మాట ఎత్తేందుకే జంకుతున్నారు. భారతీయ జనతా పార్టీ పేరును [more]

Update: 2019-07-26 03:30 GMT

ఎన్నికలకు ముందు వరకు కాస్కో మోడీ అంటూ అన్ని రాష్ట్రాలకూ పరుగులు తీసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మోడీ మాట ఎత్తేందుకే జంకుతున్నారు. భారతీయ జనతా పార్టీ పేరును కూడా ఆయన ప్రస్తావించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మోదీ మాటనే మర్చిపోయారు. దాదాపు రెండు నెలలుగా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలను కూడా పక్కనపెట్టేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చంద్రబాబునాయుడు పరిమితమయ్యారు.

జాతీయ స్థాయి నేతగా….

చంద్రబాబునాయుడు జాతీయ స్థాయి నేత. అందులో ఏమాత్రం సందేహం లేదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగిన నేత. ఇందులో కూడా అవాస్తవం లేదు. ఎన్నికల ముందు వరకూ ఆయన భారతీయ జనతా పార్టీపై కారాలు మిరియాలు నూరారు. మోదీని గద్దె దించాల్సిందేనంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ప్రచారంలోనూ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడానికి పట్టుదలగా ప్రయత్నించారు.

కర్ణాటకలో ఇంత జరిగినా….

అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చంద్రబాబునాయుడు స్పందించేందుకు ఇష్టపడటం లేదు. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు అక్కడే బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో జరుగుతున్న సంక్షోభం పై చంద్రబాబునాయుడు పెదవి విప్పడం లేదు. కర్ణాటక రాజకీయాలపై ఆయన మాట్లాడటమే మానేశారు.

మమతకు మద్దతేదీ?

ఇక పశ్చిమ బెంగాల్ లో దీదీ సయితం కష్టాల్లో ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసింది. అయినా సరే చంద్రబాబు నాయుడు మమత బెనర్జీకి మద్దతుగా వెళ్లలేదు. అసలు అంతదాకా ఎందుకు? ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన హస్తిన మొహమే చూడలేదు. ఇలా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు ఆయన దృష్టంతా అమరావతిపైనే ఉందట. ఇతర రాష్ట్రాలవైపు చూసే పరిస్థితి లేదంటున్నారు. ఒక్క రెండు నెలల్లో ఎంత మార్పు అని ఆ పార్టీలోనే నేతలు చెవులు కొరుక్కుంటున్నారు

Tags:    

Similar News