అందుకే ఈయనంటే ఇష్టం లేదట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ప్రధానంగా ఉత్తారంధ్ర నేతలు మండి పడుతున్నారు. అమరావతి రాజధాని అంశం ఒకటైతే ఇప్పటి వరకూ విశాఖలో అడుగు పెట్టకపోవడాన్ని వారు తీవ్రంగా [more]

Update: 2020-09-16 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ప్రధానంగా ఉత్తారంధ్ర నేతలు మండి పడుతున్నారు. అమరావతి రాజధాని అంశం ఒకటైతే ఇప్పటి వరకూ విశాఖలో అడుగు పెట్టకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. చంద్రబాబు కరోనా సమయంలోనూ అప్పుడప్పుడూ విజయవాడ వచ్చి వెళుతున్నారు. కానీ అదే సమయంలో ఆయన విశాఖ రావడం లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ లో చర్చ జరుగుతోంది.

అయ్యన్న ఫైర్ అయింది…..

ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖకు చెందిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ కే పరిమితమయితే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని అయన్న సూటిగానే ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా తాళం వేస్తే ఎలా అని దాదాపుగా నిలదీసినంత పని చేశారంటున్నారు. ఇంతకీ అయ్యన్న అసలు కోపానికి కారణం చంద్రబాబు విశాఖను విస్మరిస్తున్నాడనేనన్నది పార్టీ నేతల అభిప్రాయంగా విన్పిస్తుంది.

ఏడాది అవుతున్నా……

చంద్రబాబు విశాఖకు వచ్చి ఏడాది దాటుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి విశాఖ వచ్చి రివ్యూ చేశారు. ఆ తర్వాత విశాఖ భూ దందాపై ప్రశ్నించేందుకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఎయిర్ పోర్టు నుంచే పోలీసులు వెనక్కు పంపారు. ఇది జరిగి దాదాపు పది నెలలు కావస్తుంది. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు చంద్రబాబు విశాఖకు వచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని అనుమతించాలని కేంద్ర హోంశాఖనుకోరారు. మోదీకి లేఖ రాశారు. అనుమతి రాకపోవడంతో విశాఖకు రాలేకపోయారు.

ఎందుకు రావడం లేదు…..

అయితే ఆ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించినా చంద్రబాబు విశాఖకు రాకపోవడాన్ని అక్కడి నేతలు తప్పుపడుతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థించినా విశాఖకు వచ్చేందుకు చంద్రబాబుకు మనసొప్పడం లేదంటున్నారు. పార్టీ క్యాడర్ లో భరోసా నింపాలంటే విశాఖకు రావాలి కదా? అని ఉత్తరాంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదని, కేవలం అమరావతికి మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నారని, ఏ జిల్లాకు చంద్రబాబు వెళ్లడం లేదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ విశాఖకు రాకపోవడాన్ని అక్కడి పార్టీ నేతలు మాత్రం అభ్యంతరం తెలుపుతున్నారు. మరి చంద్రబాబు విశాఖ టూర్ ఎప్పుడు ఉంటుందో?

Tags:    

Similar News