ఇలాగే ఉంటే… ఇక ఖాళీ అయినట్లే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాగే కూర్చుంటే ఉన్న నేతలు ఎవరూ మిగిలే అవకాశం లేదు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను వదిలి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. [more]

Update: 2020-10-01 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాగే కూర్చుంటే ఉన్న నేతలు ఎవరూ మిగిలే అవకాశం లేదు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను వదిలి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. హైదరాబాద్ లో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా ఆయన కరోనా వైరస్ తీవ్రతకు భయపడి హైదరాబాద్ ను వీడటం లేదు. ఫలితంగా అనేక మంది నేతలు పార్టీని వీడి వెళుతున్నారు.

వైరస్ ఉన్నంత వరకూ రారా?

కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. వైరస్ ఉన్నంత వరకూ ప్రజల్లోకి రాలేక పోతే ఎలా అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వయసు రీత్యా సొంత ఇంటిని వదిలి బయటకు రావడం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఏపీకి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. ఆయన హైదరాబాద్ ను వదిలి ఇప్పట్లో రారని స్పష్టమవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు కూడా నీరసపడుతున్నారు.

సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నా….

చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుంటే లాభం లేదని, ఏపీకి వచ్చి ఉంటేనే పార్టీలో జోష్ పెరుగుతుందని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటి నేతలు నేరుగా చెప్పారంటే క్షేత్రస్థాయలో దానిని క్యాడర్ ఒపీనియన్ గానే భావించాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మంది నేతలు అధికార పార్టీలోకి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా గుడ్ బైై చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో తిరిగి క్యాడర్ లో ధైర్యం నింపాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందంటున్నారు.

చూస్తేనే తెలియడంలా…..

చంద్రబాబు ఒకప్పుడు ఒక పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం క్యాడర్ స్పందించేది. ఇటీవల తిరుమలలో జగన్ పర్యటన సందర్బంగా టీడీపీ కంటే బీజేపీ క్యాడర్ ఫుల్ జోష్ లో కన్పించింది. టీడీపీ జెండాలుపట్టుకుని పట్టుమని పది మందికూడా లేరు. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏంటని నేతల నుంచి వస్తున్న ప్రశ్న. చంద్రబాబు నిత్యం నేతలతో టచ్ లోనే ఉంటున్నారు. కానీ పార్టీలో యాక్టివ్ గా ఉండే వారితోనే ఆయన టచ్ లో ఉంటున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టకపోతే పార్టీ నేతల్లో అనేక మంది వైసీపీ గూటికి చేరే అవకాశముందంటున్నారు. మరి చంద్రబాబు పార్టీ కోసమైనా హైదరాబాద్ ను వీడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News