ఇది మరీ టూమచ్ బాబూ

చంద్రబాబు జగన్ జపమే చేస్తున్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ తో చంద్రబాబుకు స్నేహం. కానీ ఆయన పేరుని పెద్దగా పలికింది లేదు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నపుడైనా [more]

Update: 2020-02-25 06:30 GMT

చంద్రబాబు జగన్ జపమే చేస్తున్నారు. ఆయన తండ్రి వైఎస్సార్ తో చంద్రబాబుకు స్నేహం. కానీ ఆయన పేరుని పెద్దగా పలికింది లేదు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నపుడైనా వైఎస్సార్ని ఇంతలా తిట్టింది లేదు. కానీ జగన్ అంటే మాత్రం చంద్రబాబు ఎందుకో చాలా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు. అంతకు ముందు అయిదేళ్ళ ప్రతిపక్షంలో ఉన్నపుడు, తరువాత అయిదేళ్ళు ముఖ్యమంత్రిత్వంలోనూ, మళ్ళీ ఇపుడు విపక్ష నేతగా చంద్రబాబు జగన్నామస్మరణతోనే తరించిపోతున్నారు. జగన్ అన్నట్లుగా కడుపు మంటతోనే ఇవన్నీ చేస్తున్నట్లుగా ఉంది మరి.

జగన్ అలా…

నిజంగా జగన్ ఈ విషయంలో చాలా బెటర్ అనిపిస్తుంది. జగన్ తండ్రిపోయిన తరువాత నుంచి ఇప్పటివరకూ గత పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ రాటుతేలుతున్నారు. ఏనాడూ ప్రత్యర్ధులను పెద్దగా విమర్శించినది లేదు. ఆ మాటకు వస్తే అపుడూ ఇపుడూ కూడా మీడియా ముందుకు జగన్ వచ్చిందీ లేదు. ఆయన అసెంబ్లీలోనో, ఎక్కడైనా మీటింగుల్లోనో చంద్రబాబుని విపక్ష నేతగా, ఇపుడు ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు తప్ప ఎక్కువ చేసింది లేదు. ఇక ప్రతిపక్షనేతగా జగన్ చంద్రబాబు పాలనా విధానాలను ఎండగట్టేవారు. అంతే తప్ప తెల్లారి లేస్తూనే రాత్రి పొద్దుపోయేవరకూ ఇప్పటి బాబులా తిట్ల దండకం లంకించుకోలేదు. చంద్రబాబు జాతకం జనమే తేలుస్తారని సరిపెట్టుకున్నారు.

తగ్గిపోతున్నారా?

చంద్రబాబు విషయానికి వస్తే నలభయ్యేళ్ళ అనుభవం అనీ చరిత్ర చూసి చెప్పాల్సిందే తప్ప బాబు మాత్రం దానికి తగినట్లుగా వ్యవహిరించిన తీరు ఎక్కడా కనిపించదు. అధికారంలో ఉండగా రాక్షసులు, గూండాలు అంటూ దారుణంగా జగన్ ని, ఆయన ఎమ్మెల్యేలను తిట్టిన చంద్రబాబు ఇపుడు విపక్షంలోకి రాగానే ఉన్మాది అంటున్నారు, రౌడీ సీఎం అని సంభోదిస్తున్నారు. పిచ్చి తుగ్లక్ అనేస్తున్నారు. అరాచకవాది, జైలు పక్షి, అవినీతిపరుడు అంటూ సీఎం కుర్చీకైనా కనీసం విలువ ఇవ్వకుండా నోరుచేసుకుంటున్నారు. అదీ జగన్ గద్దెనెక్కి ఎనిమిది నెలలు గట్టిగా కాలేదు. ఇన్ని తిట్లా అని జనం ముక్కున వేలేసుకునేల చంద్రబాబు దారుణమైన భాష వాడుతూ తనను తాను తగ్గించుకుంటున్నారు.

పధ్ధతేనా…?

అనుభవం కలిగిన వారి నుంచి భవిష్యత్తు స్పూర్తిని పొందాలి. చరిత్ర తీపి గుర్తులు మిగుల్చుకోవాలి. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆఖరుకు నిన్నా మొన్నా సీఎంలుగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య వంటి వారు తాము చేసిన పదవులకు తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం విమర్శలు పేరిట వీధి కుళాయి భాషను వాడుతున్నారని రాజకీయ మేధావులు విస్తుబోతున్నారు.

శాస‌నం వేయించారా…?

నిజమే చంద్రబాబుకు బాధ ఉండవచ్చు. అధికారం పోయిందన్న అక్కసు ఉండవచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థలను గౌరవించడం అంతకంటే ముఖ్యం. పదవులు వస్తాయి, పోతాయి. ఎల్లపుడూ సీఎం సీటు నారా ఫ్యామిలీకే దఖలు పడాలని శాస‌నం వేయించుకోలేదుగా. ఇపుడు జగన్ సీఎం అయ్యారు. రేపు వేరొకరు కావచ్చు. అది ప్రజాస్వామ్యం అందం. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుంటే చంద్రబాబుకు కడుపు మంటే మిగులుతుంది. అందుకే జగన్ అంటున్నారు భయంకరమైన వ్యాధులకైనా మందు ఉంది కానీ కడుపుమంటకు లేదూ అని.

Tags:    

Similar News