ఇద్దరూ తగలేశారుగా… ఇక ఏమి మిగిలింది?

ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర అన్నారు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు, నిజంగా బంగారమే అనుకునేలోగానే విభజన చిచ్చు రగిలి ఉత్త ఏపీగా [more]

Update: 2020-06-09 06:30 GMT

ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర అన్నారు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు, నిజంగా బంగారమే అనుకునేలోగానే విభజన చిచ్చు రగిలి ఉత్త ఏపీగా పదమూడు జిల్లాలతో మిగిలిపోయింది. ఇక నవ్యాంధ్రకు మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకే జనం ఓటు వేశారు. చంద్రబాబు స్వర్ణాంధ్రను చేస్తారని కూడా ఆశ పడ్డారు. అయితే అయిదేళ్ళ బాబు పాలనలో అప్పుల ఆంధ్రాగానే మిగిలింది అని ఆర్హిక నిపుణులు సైతం లెక్కలు తేల్చారు. లేదు అని నిన్నటి దాకా ఖండిస్తూ వచ్చిన టీడీపీ ఇపుడు కూడా అసలు నిజాలు చెప్పేస్తోంది. అప్పుల తప్పులు జరిగాయని కూడా ఒప్పుకుంటోంది.

రెండున్నర లక్షల కోట్లు …

అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో మొత్తం అప్పులు రెండున్నర లక్షల కోట్లు అని వైసీపీ నేతలు లెక్కలు చెప్పారు. దానికి విభజన కాలం నాటి అప్పులు తొంబై వేల కోట్లు జతచేస్తే మూడున్నర లక్షల కోట్ల అప్పులతో జగన్ చేతికి ఏపీ ఖజానా వచ్చింది. ఇపుడు జగన్ సీఎం అయి ఏడాది గడచింది. టీడీపీ నుంచి అవే విమర్శలు వస్తున్నాయి. జగన్ ఏపీని మొత్తం అప్పులపాలు చేశారని బాబు జమానాలో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన యనమల రామక్రిష్ణుడు అంటున్నారు. ఇక ఆయన ఈ విమర్శలకు మరింత బలం చేకూరడం కోసం మేమూ అప్పులు చేశామని కొంతవరకూ నిజాన్ని ఒప్పుకోవడం విశేషం.

లక్షల కోట్లేనట…..

తెలుగుదేశం పాలనలో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలను మాత్రమే తాము అప్పు తెచ్చామని యనమల అంటున్నారు. అంటే నిన్నటిదాకా అసలు అప్పులు ఏవీ తాము చేయలేదు, ఏపీ సంపదను భారీగా పెంచామని, ప్రస్తుత పాలకులకు సంపద పెంచడం ఎలాగో చేతకావడంలేదని చంద్రబాబుతో సహా ఇదే పసుపు పార్టీ తమ్ముళ్ళు విమర్శలు చేసేవారు. ఇపుడు జగన్ ని తిట్టే ఊపులో గొంతులోని పచ్చి నిజాలను యనమలవారు గటగటా చెప్పేసారు. సరే యనమలవారు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా అయిదేళ్ల కాలానికి అక్షలారా లక్ష కోట్లు టీడీపీ అప్పులు తెచ్చి ఏపీ ప్రజల నెత్తిన పెట్టిందన్న మాట. మరి ఆ తెచ్చిన అప్పులతో ఏపీలో శాశ్వతమైన అభివృధ్ధి పనులు చేసి చూపించారా అంటే లేదన్నే మాట వినిపిసోంది. ఆ అప్పులూ వడ్డీలు జనాలకు మాత్రం తరతరాల భారంగా మారుతున్నాయన్నమాట.

నాలుగు లక్షల కోట్లా…?

ఇక జగన్ సర్కార్ కేవలం ఏడాది కాలానికే ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులను తెచ్చి ఏపీని ఊబిలోకి నెట్టిందని యనమల అంటున్నారు. ఇదే తీరుగా అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ బతికి బట్టకట్టడం కష్టమని ఆయన అంటున్నారు. యనమల చెప్పిన లెక్కలనే తీసుకుంటే అయిదేళ్ల పాలనలో వైసీపీ అక్షరాలా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందన్న మాట. అంటే ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల అప్పులకు ఈ నాలుగు లక్షల కోట్లు జమ అయితే ఏపీని బాగు చేయడానికి దేవుడి దిగిరావాల్సిందేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అప్పు చేయడం తప్పు కాదు కానీ అలా చేసిన అప్పులతో రాష్ట్రానికి శాశ్వతమైన అభివృధ్ధిని చూపిస్తేనే ప్రజల మీద్ భారం పడదని అంటున్నారు. కానీ రెండు పార్టీలు ఇప్పటిదాకా చూసుకుంటే నికరంగా ఏపీకి చేసిన అభివృధ్ధి ఒక్కటి కూడా లేకపోవడమే ఆంధ్రాకు విషాదం.

Tags:    

Similar News