చంద్రబాబు చుట్టూ చక్రబంధం

విద్యార్ధి రాజకీయాలను కూడా కలుపుకుంటే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కి అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. అప్పట్లో తన మనుషులను విద్యార్ధి సంఘ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి చంద్రబాబు [more]

Update: 2019-11-24 15:30 GMT

విద్యార్ధి రాజకీయాలను కూడా కలుపుకుంటే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కి అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. అప్పట్లో తన మనుషులను విద్యార్ధి సంఘ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి చంద్రబాబు తన బుర్రకు ఎంత పదుని పెట్టరో గానీ ఇప్పటికీ ఆ పదును ఏ మాత్రం తగ్గకుండా అలాగే ఉంది. అయితే చంద్రబాబు రాజకీయం సరళ రేఖలా సాగలేదు. ఆయనకు దారులు కూడా ఎవరూ వేయలేదు, ఆయనే వెతుక్కుంటూ మరీ లక్ష్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. చాలా సార్లు ఆయన తోసుకుని మరీ దారి చేసుకుని దూసుకుపోయారు. గిట్టని వారు దాన్ని రాజకీయ కబ్జా అని, వెన్నుపోటు అని అన్నా చాణక్యుడు చెప్పిన రాజనీతి ప్రకారం చంద్రబాబు చేసింది కరెక్ట్ అంటారు విశ్లేషకులు. అవకాశం అర సెకన్ కూడా ఆగదు, అందిపుచ్చుకున్న వాడిదే అందలం. ఆ సంగతి బాగా ఎరిగిన వారు కాబట్టే చంద్రబాబు రాజకీయాల్లో సుదీర్ఘ జీవితాన్ని చూశారు. ఇక ఎంతటి ప్రతిభావంతుడికైనా ఏ రంగంలోనైనా కూడా కామాలే కాదు, ఫుల్ స్టాప్ కూడా ఎపుడో ఒకపుడు ఉంటుంది. మరి ఆ విధంగా చూస్తే చంద్రబాబు రాజకీయం ముగింపునకు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది.

ఎన్నడూ చూడని అనుభవమే….

ఇది మాత్రం వాస్తవం. చంద్రబాబు ఎన్నడు చూడని ప్రతికూలతను వర్తమానంలో అనుభవిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఓడిపోతే టీడీపీని రెడీ చేసి పెట్టారు మామ ఎన్టీయార్. ఇక టీడీపీ 1989లో ఓడిపోతే మామ గారు పార్టీ మొత్తం బాధ్యతలు అప్పగించి చంద్రబాబు హోదా పెంచేసారు. అపుడు అధికార కాంగ్రెస్ తో సాగిన పోరు చంద్రబాబులో కొత్త లీడర్ని తయారు చేసింది. ఇక 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలోకి రాకపోతామా అన్న ఆశ నాడు ఏ కోశానో ఉండేది. వైఎస్సార్ చనిపోయాక చంద్రబాబు కొంత ఇబ్బందులు పడ్డా అప్పట్లో కేంద్రంలోని యూపీయేతో చీకటి ఒప్పందాలు కుదిరాయన్నది ప్రచారంలో ఉందంటారు. అలా ఆయన విభజనకు అంగీకరించి కోస్తాలో బలంగా ఉన్న తన సామాజికవర్గం అండతో చిరకాలం పాటు అధికారంలో ఉండొచ్చు అనుకున్నారు. కానీ అయిదేళ్ళు కాకుండానే గద్దె దిగిపోవాల్సివచ్చింది.

వేటాడేస్తున్నారుగా…?

ఇక ఇపుడు అధికారం పోయింది. విపక్ష హోదాకు ఎసరు పెట్టేలా పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ, వైసీపీ ఏపీ వరకూ మాటల తూటాలు పేల్చుకుంటున్నా కేంద్ర నాయకత్వం మాత్రం జగన్ని ఏమీ అనడం లేదు. జగన్ సైతం ఢిల్లీతో తన మార్క్ దోస్తీ చేస్తూ వస్తున్నారు. ఇక బీజేపీకి ఏపీలో బలోపేతం కావడం ముఖ్యం. అడ్డుగా ఉన్నది టీడీపీ, దాంతో ఆ పార్టీ ఎలిమినేషన్ని కమలనాధులు గట్టిగా కోరుకుంటున్నారు. చంద్రబాబు లేని పార్టీ వారికి కావాలి. ఆ పని తాము చేస్తూనే జగన్ చేసినా సరేననే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరి ఉమ్మడి టార్గెట్ చంద్రబాబు కాబట్టి. దాంతో బాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. జాతీయ రాజకీయాలు సైతం ఏకపక్షంగా మారడంతో చంద్రబాబు రెండవ వైపు కూడా చూడలేకపోతున్నారు. ఓ విధంగా చంద్రబాబు రాజకీయంగా బాగా కార్నర్ అవుతున్నారు. ఇది పెను సవాల్ గా మారుతోంది. ఈ చక్ర బంధంలో నుంచి బయటపడగలితే చంద్రబాబు అజేయుడే. కానీ వర్తమాన రాజకీయంతో పాటు ఆయన వయసు, టీడీపీకి భవిష్యత్తు నాయకత్వ లేమి బాబుని మరింత బలహీనున్ని చేస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తే కాబోలు వైసీపీ మంత్రి ఒకరు చంద్రబాబు శకం ముగిసింది అని సులువుగా అనేస్తున్నారు.

Tags:    

Similar News