లక్ష్యం నెరవేరుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగబోతున్నారు. అధికారాన్ని కోల్పోయిన ఐదు నెలల తర్వాత చంద్రబాబు [more]

Update: 2019-11-14 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగబోతున్నారు. అధికారాన్ని కోల్పోయిన ఐదు నెలల తర్వాత చంద్రబాబు తొలిసారి దీక్ష చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రిమంగా సృష్టింందని పేర్కొంటూ గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏమాత్రం దిగిరాకపోవడంతో చంద్రబాబు దీక్షకు సమాయత్తమయ్యారు.

పన్నెండు గంటల దీక్ష….

ఈరోజు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి రావాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలతో సహా నియోజకవర్గ బాధ్యులందరూ దీక్షలో పాల్గొనాలని కోరింది. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రమంతటా టీడీపీ శ్రేణులు ఎక్కడకక్కడ దీక్షలు చేపట్టనున్నాయి. ఇలా ఒక్క దీక్షతో చంద్రబాబు పార్టీలోనూ నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

పార్టీని సమాయత్తం చేసేందుకు…

ఇసుక కొరతపై దీక్షకు దిగుతున్నా చంద్రబాబు ఒకరకంగా పార్టీని సమాయత్తం చేయడం కోసమే. ఈ వయసులో చంద్రబాబు దీక్షకు దిగడం కొంత సానుభూతి కూడా లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వంపై వత్తిడి పెంచినట్లు అవుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల మద్దతును చంద్రబాబు కోరారు. సీపీఎం, సీపీఐ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు మద్దతు తెలిపాయి. దీక్షాస్థలికి ఎవరు వస్తారన్నది తెలియదు కాని విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు దీక్ష ఉపయోగపడుతుంది.

జాతీయ స్థాయిలోనూ….

అలాగే చంద్రబాబు దీక్షకు ముందే వైసీపీ ఎమ్మెల్యేలపై ఛార్జి షీటు కూడా విడుదల చేసింది. ఇసుకను విక్రయిస్తూ అక్రమార్జనను గడిస్తున్న 60 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల జాబితాను విడుదల చేసింది. ఇలా అధికార పార్టీ నేతలపై మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసింది. చంద్రబాబు దీక్ష పన్నెండు గంటల పాటు కొనసాగినా జాతీయ స్థాయిలో ప్రచారం పొందడానికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే టీడీపీ నేతలు పూర్తి చేశారు. మొత్తం మీద చంద్రబాబు ఇసుక దీక్ష పార్టీకి ఏ మేరకు ఉపయోగడపడుతుందనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News