ఎవరిని అంటే ఎవరూరుకుంటారులే?

ఎవరిని అన్నా ఎవరు ఊరుకుంటారు? అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన వారే నోరు మెదపడం లేదు. అన్నీ పోగొట్టుకుని ఓటమి భారంతో కుంగిపోతున్న వారిమీద కయ్ కయ్ [more]

Update: 2019-11-12 09:30 GMT

ఎవరిని అన్నా ఎవరు ఊరుకుంటారు? అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన వారే నోరు మెదపడం లేదు. అన్నీ పోగొట్టుకుని ఓటమి భారంతో కుంగిపోతున్న వారిమీద కయ్ కయ్ మని లేస్తే ఊరుకుంటారా? ఇదీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఆవేదన. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అయి వ్యవహరించిన వారు మొహం చాటేస్తున్నా చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు.

ఇద్దరూ చక్రం తిప్పి…..

ఇందుకు వియ్యంకులు గంటా శ్రీనివాసరావు, నారాయణ ఉదంతమే నిదర్శనం. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి అధికారంలో ఉండగా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. పదవుల్లో కూడా ఏమాత్రం తగ్గలేదు. గంటా విద్యాశాఖ మంత్రిగా చక్రం తిప్పగా, ఆయన వియ్యంకుడు నారాయణ మున్సిపల్ మంత్రిగా, సీఆర్డీఏ వ్యవహారాలను చూసే మంత్రిగా చంద్రబాబు తర్వాత తానే అయి వ్యవహరించారు. రాజధాని అంటే నారాయణ అనే విన్పించేది ఆ అయిదేళ్లు.

పూర్తిగా దూరమై…..

నారాయణకు అంత ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసినా ఆయన మాత్రం ప్రత్యక్ష్య ఎన్నికల్లో గెలవాలని భావిాంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఘోర ఓటమిని చవి చూశారు. కోట్లు కుమ్మరించినా గెలుపు దక్కలేదు. ఓటమి తర్వాత నారాయణ పూర్తిగా సైలెంట్ అయ్యారు. నియోజకవర్గానికి కూడా వెళ్లడం లేదు. చంద్రబాబు నెల్లూరు వచ్చినప్పుడు కన్పించి వెళ్లడం మినహా నారాయణ పూర్తిగా విద్యా, వ్యాపార సంస్థలకే పరిమితమయ్యారు.

అంటీ ముట్టనట్లు…..

ఇక గంటా శ్రీనివాసరావుది కూడా సేమ్ టు సేమ్. ఆయన చంద్రబాబు విశాఖకు వచ్చినప్పుడు కన్పించి వెళ్లారు. అంతే తప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ లాంగ్ మార్చ్ కు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించినా గంటా బేఖాతరు చేశారు. ఇలా అగ్రనేతలే పార్టీని పట్టించుకోకపోవడంతో చంద్రబాబు చిన్నా చితకా నేతలపై చర్యలకు ఎలా దిగుతారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. అందుకే చంద్రబాబు ఇప్పుడు చర్యలకు దిగకుండా భరోసా కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఏమాత్రం చంద్రబాబు స్వరం పెంచినా ఎదురు తిరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News