అబ్బ…ఛా….నిజమా?

నాదనుకున్న వస్తువు వేరే చోటకు వెళ్ళిపోతే ఎవరూ భరించలేరు సహించలేరు. అయితే అక్కడికి వెళ్ళినా భద్రమే వెనక్కి తెచ్చుకోవచ్చు అన్న ధీమా ఉన్నపుడే స్తిమితపడతారు, శాంతపడతారు. చంద్రబాబు [more]

Update: 2019-11-02 08:00 GMT

నాదనుకున్న వస్తువు వేరే చోటకు వెళ్ళిపోతే ఎవరూ భరించలేరు సహించలేరు. అయితే అక్కడికి వెళ్ళినా భద్రమే వెనక్కి తెచ్చుకోవచ్చు అన్న ధీమా ఉన్నపుడే స్తిమితపడతారు, శాంతపడతారు. చంద్రబాబు వైఖరి ఇపుడు అలాగే ఉందని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఫిరాయింపులు, జంపింగుల విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కోలా వ్యవహరిస్తూండడంతోనే అందరికీ ఒక్కసారిగా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకరు కాదు, ఏకంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు, అదీ చంద్రబాబు ప్రవాసంలో ఉన్నపుడు జరిగిన సంఘటన. పైగా అలా వెళ్ళిన వారిలో ఇద్దరు చంద్రబాబుకు కుడి, ఎడమ భుజంగా వ్యవహరించిన వారు. అలాంటపుడు నిప్పులా బతికానని చెప్పుకునే చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండాలి. కనీసం దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ రోజు వరకూ టీడీపీ పెద్దాయన నెట్టుకువచ్చారు. అసలు వారు ఎక్కడికిపోయారు, నా దగ్గరే ఉన్నారన్న ధీమాతోనే ఉన్నారు. అటువంటి చంద్రబాబు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ ను కలసి వచ్చాక‌ మాత్రం ఒకలా ఉండడంలేదు. నానా విధాలుగా హైరానా పడిపోతున్నారు. అక్కడికి జగన్ ఏదో చేసేసి వంశీని ఆకట్టుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. వంశీ మీద అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారంటూ ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు.

నిజం చేస్తున్నారుగా….?

చంద్రబాబే దగ్గరుండి మరీ సుజనా బ్యాచ్ ని బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ఇప్పటి వరకూ ప్రతీ రోజూ ఆరోపణలు చేస్తూనే ఉంది. చూస్తూంటే అవే నిజం అనిపించేలా చంద్రబాబు వైఖరి ఉందని సాక్షత్తూ తమ్ముళ్లే అనుకుంటున్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యులను చేసి పార్టీలో ఎంతో విలువ ఇచ్చిన వారే కష్టకాలంలో కాడి వదిలేసి కమలం కొంగు పట్టుకుంటే చంద్రబాబు గారికి ఎక్కడా కాలిపోలేదు. ఆయన నిప్పులా మండిపోలేదు, కానీ రెండు సార్లు ఎమ్మెల్యేగానే గెలిచిన వంశీకి టీడీపీలో ఏ హోదా లేదు, మంత్రిగా కూడా అవకాశం ఇవ్వలేదు. వైసీపీ గాలిలో సైతం ఆయన గెలిచిన మొనగాడిగా పేరు తెచ్చుకున్నారు, అటువంటి వంశీ ఎక్కడ వైసీపీలో చేరుతాడోనని చంద్రబాబుతో సహా అంతా హడలిపోతున్నారు. అదే వంశీ బీజేపీ నాయకులను కలిస్తే ఇదే చంద్రబాబు గారు పెద్దగా పట్టించుకోకపోయేవారేమోన‌ని కూడా తమ్ముళ్ళు కూడా అనుకోవాల్సివస్తోందిపుడు.

ఇదేనా రాజనీతి….

తాను 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా వైసీపీ నుంచి లాగేసుకుని అందులో నలుగురిని మంత్రులుగా చేసినపుడు వారంతా అభివృధ్ధిని చూసి ప్రభుత్వం వైపు వచ్చారని కొత్త భాష్యం చెప్పారు ఇదే చంద్రబాబు. తెలంగాణాలో తలసాని శ్రీనివాస్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి మంత్రిగా మారితే ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ గర్జించించి కూడా టీడీపీ అధినేతే. జగన్ తాను ఫిరాయింపులు అనుమతించనని చెప్పినపుడు ఆనందించిన చంద్రబాబు పార్టీకి రాజీనామా చేసి కూడా ఎమ్మెల్యే తమ్ముళ్లు వెళ్ళిపోతామంటే మాత్రం కస్సుమంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబు తెలుసుకుంటే బాగుంటుందని అంటున్నారు. పైగా చంద్రబాబు సందర్భానికో విధంగా ఫిరాయింపులకు వక్ర భాష్యాలు చెప్పడం వలనే టీడీపీ కధ ఇంత వరకూ వచ్చిందని అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా ఫిరాయింపుల్లో కూడా చంద్రబాబుకు నచ్చిన పార్టీ, నచ్చని పార్టీ మమకారాలు ఉండడమే తెలుగువల్లభుడి అసలైన పాలిట్రిక్స్ కాబోలు.

Tags:    

Similar News