భయపడిందంతా జరుగుతోందే

నిజమే… చంద్రబాబు భయపడిందంతా జరుగుతోంది. ఘోర ఓటమితో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా తేరుకోలేదు. అసలే ఎన్నికల్లో ఖర్చు చేసి ఉండటం, చంద్రబాబు రోజుకొక్క ఆందోళనలకు పిలుపునివ్వడం [more]

Update: 2019-11-08 06:30 GMT

నిజమే… చంద్రబాబు భయపడిందంతా జరుగుతోంది. ఘోర ఓటమితో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా తేరుకోలేదు. అసలే ఎన్నికల్లో ఖర్చు చేసి ఉండటం, చంద్రబాబు రోజుకొక్క ఆందోళనలకు పిలుపునివ్వడం తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఒక రోజు ఆందోళన చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. కార్యకర్తలను సమీకరరించడం, వారికి టిఫిన్ నుంచి భోజన సదుపాయాలను సమకూర్చడం వంటివి జిల్లాపార్టీ అధ్యక్షుడు కాని, టీడీపీ నేతలు కాని భరించాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నేతలు దూరంగా ఉంటున్నారు.

ఇసుక కొరతపై….

ఇటీవల ఇసుక కొరతపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆందోళనలు చేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఈ కార్యక్రమంలో సాక్షాత్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామచర్ల జనార్థన్ కూడా పాల్గొన లేదు. ప్రకాశం జిల్లాలో ఒక కనిగిరి నియోజకవర్గం మినహా ఎక్కడా ఆందోళనకు టీడీపీ దిగలేదు. దామచర్ల జనార్థన్ తోపాటు మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు కరణం బలరాం, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టి పాటి రవికుమార్, ఏలూరి సొంబశివరావులు నిరసనల్లో పాల్గొనకపోవడం గమనార్హం.

సీరియస్ అయిన బాబు….

ఒక్క ప్రకాశం జిల్లా మాత్రమే కాదు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండల కేంద్రాల్లో ఆందోళనలను నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిస్తే కనీసం నియోజకవర్గం కేంద్రాల్లో సయితం తెలుగు తమ్ముళ్లు అందుకు సిద్ధపడకపోవడం విశేషం. దీనిపై ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు. ఏ ఒక్క జిల్లాలోనూ పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు ఆందోళనల్లో పాల్గొనలేదని తెలియడంతో చంద్రబాబు పార్టీ నేతలపై సీరియస్ అయినట్లు తెలిసిది. తాను స్వయంగా పిలుపునిచ్చినా స్పందన రాకపోవడానికి కారణాలేంటని కొందరు నేతలకు ఫోన్ లో క్లాస్ పీకినట్లు సమాచారం.

ఖర్చు చేయలేమంటూ….

అయితే నేతలు కొందరు చంద్రబాబు ఎదుటే కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. గడచిన నాలున్నర నెలల్లో అనేక ఆందోళనలకు పిలుపునిచ్చారని, కార్యకర్తలు కూడా కార్యక్రమానికి వచ్చేందుకు జంకుతున్నారని వారు వివరించినట్లు సమాచారం. ఆందోళనల్లో పాల్గొంటే అవనసర కేసులు నమోదవుతాయని క్యాడర్ కూడా భయపడిపోతున్నట్లు కొందరు నేతలు చంద్రబాబుకు తెలిపారు. అంతేకాకుండా తాము ఖర్చు భరించేందుకు కూడా సిద్ధంగా లేమని కొందరు పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం జిల్లా పార్టీ నేతలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఖర్చును కేంద్ర పార్టీయే భరిస్తుందని వివరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు వైసీపీ సర్కార్ పై తరచూ చేసే ఆందోళనలకు తెలుగుతమ్ముళ్లే చెక్ పెట్టినట్లు తెలిసింది.

Tags:    

Similar News