ఎవరికి పడితే వారికిస్తే అంతే?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఐదేళ్లు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు. అధినేత చంద్రబాబుకు సయితం మొహం చాటేస్తున్నారు. అధికారంలో ఉండగా [more]

Update: 2019-10-29 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఐదేళ్లు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు. అధినేత చంద్రబాబుకు సయితం మొహం చాటేస్తున్నారు. అధికారంలో ఉండగా పదవులను పొంది దర్పాన్ని వెలగబెట్టిన మంత్రులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. సహజంగా కేబినెట్ లో స్థానం దక్కాలంటే ప్రజల్లో పట్టు ఉండటం, సీనియారిటీతో పాటు సామాజిక వర్గాలు కూడా కారణమవుతాయి. చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ఐదేళ్ల కాలంలో మూడు సార్లు విస్తరించారు. అందులో ఒక సారి లోకేష్ కోసం కాగా, మరోసారి ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం కోసం.

అధికారానికి దూరం కావడంతో….

అయితే ప్రస్తుతం అధికారానికి టీడీపీ దూరం కావడంతో మంత్రులుగా వెలగబెట్టిన వారంతా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీపైనా, నాయకత్వంపైనా నమ్మకం లేని వారికి పదవులిస్తే ఇలానే ఉంటుందని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికారానికి దూరమయిన వెంటనే వారు సైడ్ అయిపోవడాన్ని కార్యకర్తలు సయితం తప్పు పడుతున్నారు. తమ జీవితంలో మంత్రి పదవి చేపడతామని ఊహించని నేతలకు సయితం చంద్రబాబు వారికి మంత్రి పదవులు గత ప్రభుత్వంలో ఇచ్చారు.

కొందరు మాత్రమే….

గత చంద్రబాబు కేబినెట్ లో పనిచేసిన వారిలో యనమల రామకృష్ణుడు,దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చినరాజప్పలు మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శలకు దిగుతున్నారు. ఇక అయ్యన్న పాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, జవహర్ లాంటి నేతలు అప్పుడప్పుడూ కన్పిస్తున్నారు. అమర్ నాధ్ రెడ్డి కూడా అంతే. ఇక మిగిలిన వారంతా పూర్తిగా పక్కకు జరిగి పోయారు.వీరు అసలు పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానం కూడా కలగక మానదు.

వీరంతా సైడయి పోయి….

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రాజకీయాలకు దూరమయిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు పూర్తిగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దారాఘవరావు కూడా రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడికి బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో ఉన్నారట. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ తన వ్యాపార సంస్థలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల చంద్రబాబు నెల్లూరు వచ్చినప్పుడు రెండురోజుల పాటు సమీక్షలకు హాజరైనా ఆ తర్వాతమళ్లీ మామూలే. ఇలా పదవులు అనుభవించిన నేతలే పత్తా లేకపోవడంతో పార్టీ క్యాడర్ కూడా వారిపై ఆగ్రహంతో ఉంది. ఇది చంద్రబాబు చేసుకున్న స్వయంకృతాపరాధమేనంటున్నారు కూడా.

Tags:    

Similar News