ఇక మూసేయడమేనా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇక కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకూ ఉన్న ఆశలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలతో నీరుగారిపోయాయి. ఇకపై తాను [more]

Update: 2019-10-25 11:00 GMT

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇక కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకూ ఉన్న ఆశలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలతో నీరుగారిపోయాయి. ఇకపై తాను వారానికి రెండు రోజుల పాటు తెలంగాణ పార్టీపై దృష్టి పెడతానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ విధంగానే ప్రతి శని, ఆదివారాల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో…..

తెలంగాణలో కనీస స్థాయి ఓట్ల శాతాన్ని తెచ్చుకుంటేనే తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా సాధ్యమవుతుంది. కానీ గత కొన్ని ఎన్నికల్లో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలతో పార్టీ క్యాడర్ చెల్లా చెదురయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు అసెంబ్లీ సీట్లను మాత్రమే సాధించింది. అదీ ఆంధ్రప్రదేశ్ కు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలో కావడం విశేషం.

పార్లమెంటుకు పోటీ చేయకుండా….

ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఏపీ ఎన్నికలు కూడా ఉండటతో తెలంగాణ టీడీపీని చంద్రబాబు పట్టించుకోలేదు. ఏపీలోనూ ఓటమిపాలు కావడంతో కాస్త ఫ్రీగా ఉన్న చంద్రబాబు తెలంగాణ టీడీపీపై దృష్టి పెట్టారు. ఈలోపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చింది. నల్లగొండ జిల్లాలో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉండటం, పార్టీకి మద్దతిచ్చే బలమైన సామాజిక వర్గం అండగా ఉండటంతో చంద్రబాబు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డిపాజిట్లు కూడా దక్కక పోవడంతో….

కానీ హుజూర్ నగర్ లో చంద్రబాబు అంచనా తప్పింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్ ను దెబ్బతీస్తామని భావించినా అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో తెలంగాణ టీడీపీ మరింత కుంగిపోయింది. ఇన్నాళ్లూ తమ క్యాడర్, ఓటు బ్యాంకు బలంగా ఉందని భావించిన చంద్రబాబుకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు షాకిచ్చినట్లే చెప్పవచ్చు. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని టీటీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ తెలంగాణలో ఇక టీడీపీ కోలుకోలేదన్నది వాస్తవమని హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News