Chandrababu : స్ట్రాటజీ కమిటీతో సెట్ చేస్తున్నారట

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబు స్ట్రాటజీ కమిటీని నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఈ కమిటీ [more]

Update: 2021-11-11 06:30 GMT

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబు స్ట్రాటజీ కమిటీని నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం అభ్యర్థుల ఎంపిక, నేతల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఈ కమిటీ పనిచేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో నేతల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అవి మరింత ముదిరాయి. పెత్తనం కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ స్ట్రాటజీ కమిటీ ద్వారా తొలుత విభేదాలను పరిష్కరించాలన్నది చంద్రబాబు యోచన.

నియోజకవర్గాల వారీగా….

ఈ స్ట్రాటజీ కమిటీ నియోజకవర్గాల వారీగా సమావేశమవుతుంది. నియోజకవర్గ ఇన్ ఛార్జులతోనూ, వ్యతిరేక వర్గంతోనూ సమావేశాలను నిర్వహించి వారి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే స్ట్రాటజీ కమిటీ నియోజకవర్గాలను పర్యటించి ఇరు వర్గాల నేతలతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. దీనివల్ల నేతల్లో ఐక్యత పెరుగుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు.

సీనియర్ నేతలతో….

ఇందుకోసం సీనియర్ నేతలైన యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్రతో పాటు మరికొందరు ముఖ్యనేతలను ఈ కమిటీలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎన్నికల నాటికి విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు చంద్రబాబు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కమిటీ తొలుత క్లిష్టమైన నియోజకవర్గాల నేతలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

జిల్లాల పర్యటనకు ముందే….

అనంతపురంలో వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం లో మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. బెజవాడలో కూడా గ్రూపు విభేదాలున్నాయి. త్వరలోనే చంద్రబాబు జిల్లాలను పర్యటించాలని భావిస్తున్నారు. అంతకు ముందే ఈ విభేదాలు సమసిపోయేలా చూడాలని ఇప్పటికే నేతలను ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు జిల్లాలకు వెళ్లకముందే అక్కడ అంతా సెట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News