ట్రై చేసినా కుదరడం లేదే…?

తెలుగుదేశం పార్టీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది…ఇది ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి మాట. అయితే ఆయన కోరుకున్నట్లుగా జరగలేదు. ఎన్టీఆర్ బతికి ఉండగానే ఆయన చేతుల్లోంచి [more]

Update: 2019-10-26 11:00 GMT

తెలుగుదేశం పార్టీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది…ఇది ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి మాట. అయితే ఆయన కోరుకున్నట్లుగా జరగలేదు. ఎన్టీఆర్ బతికి ఉండగానే ఆయన చేతుల్లోంచి పార్టీని తీసుకుని అటు ముఖ్యమంత్రిగానూ, ఇటు పార్టీ అధ్యక్షుడిగానూ చంద్రబాబు అయిపోయారు. ఇప్పటికి పాతికేళ్ళుగా బాబు టీడీపీకి ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. పార్టీ పెట్టిన అన్న గారు కేవలం పద్నాలుగేళ్ళు మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఏడున్నరేళ్ళు పనిచేశారు. చంద్రబాబు మాత్రం దాదాపుగా పద్నాలుగేళ్ళ పాటు సీఎంగా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ పుట్టుక చంద్రబాబుకు కలసివచ్చింది. ఆయన ఎటువంటి కష్టం చేయకుండానే ఆ పార్టీకి చీఫ్ కాగలిగారు. ఇపుడు కూడా చంద్రబాబు మరిన్నేళ్ళు అధినేత హోదాలో కొనసాగాలనుకుంటున్నారు. కానీ దానికి ఆయన వయసే పెద్ద అడ్డంకి.

లోకేష్ ఎదగలేదుగా….

తన కుమారుడు బాలకృష్ణను టీడీపీ వారసునిగా, భావి ముఖ్యమంత్రిగా ఒకనాడు ఎన్టీఆర్ ప్రకటిస్తే అప్పట్లో పార్టీలో ఉన్న చంద్రబాబు తట్టుకోలేకపోయారని అంటారు. అన్నగారు ఖండించేవరకూ కూడా ఊరుకోలేదని చెబుతారు. అయితే ఇపుడు చంద్రబాబుకు మాత్రం తన ఏకైక‌ కుమారుడు టీడీపీకి రాజకీయ వారసుడు కావాలని మనసులో ఉంది. దాన్ని ఆయన ఆచరణలో పెడుతూండగానే ఓటమి పాలు అయ్యారు. మళ్ళీ టీడీపీకి పూర్వవైభవం అన్నది చాలా కష్టత‌రమైనా కూడా చంద్రబాబు మాత్రం ఆ బిగ్ టాస్క్ ని స్వీకరించారు. కొడుకు కోసం ఆయన ఇపుడు ఊరూ వాడా తిరుగుతున్నారు. అయితే తండ్రి చంద్రబాబు తన కోసం కష్టపడుతూంటే లోకేష్ మాత్రం ఆయనకు సహాయం అందించలేకపోతున్నారు. తండ్రికి ఈ వయసులో తోడుగా ఉండాల్సిన లోకేష్ ట్విట్టర్ పిట్టగా మారిపోయారు. తన వద్దకు పదవి తెచ్చిపెడితే స్వీకరించేందుకు మాత్రమే లోకేష్ తయారుగా ఉన్నారు. అంతే తప్ప క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీకి ఆయన చేస్తున్న కష్టం ఏంటో ఇప్పటివరకూ తెలిసిరాలేదు.

జూనియర్ మీద మనసు…

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో చంద్రబాబు లోకేష్ లను చూసేసిన క్యాడర్ మాత్రం జూనియర్ అంటూ కలవరిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు లేచి జూనియర్ ఎన్టీయార్ అంటూ నినాదాలు ఇచ్చారని ప్రచారం జరిగింది. వారిని మిగిలిన టీడీపీ నేతలు వారించి బయటకు పంపించారని కూడా చెబుతున్నారు. మరి ఇదే రకమైన అభిప్రాయం క్యాడర్లో ఉంటే మాత్రం చంద్రబాబు గారు ఎన్ని జిల్లాలు తిరిగినా పార్టీ గాడిన పడదు, పైగా లోకేష్ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కార్యకర్తలు తిప్పికొట్టే ప్రమాదం ఉంది.

అతడే నమ్మకమా….?

ఇక లాజిక్ తీసుకున్నా కూడా టీడీపీ ఇపుడున్న స్థితిలో సినీ గ్లామర్ తో పాటు నందమూరి వారసునిగా ఉన్న జూనియర్ ఎన్టీయార్ వస్తేనే జనాదరణ ఉంటుందని అనుకోవడంలో తప్పులేదు. చంద్రబాబు కి గ్లామర్ లేకపోయినా వ్యూహాలు ఉన్నాయి. దాంతో ఇన్నాళ్ళూ బండిని నెట్టుకొచ్చారు. లోకేష్ కి రెండూ లేవు, మరి వయసు అయిపోతున్న చంద్రబాబు మీద ధీమా ఉంచలేరు, అలాగని జూనియర్ మీద నమ్మకం పెంచుకోలేరు. అందుకే కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు సమీక్షలో ఈ జూనియర్ నినాదాలు వినిపించి ఉంటారని అంటున్నారు. అన్నం మొత్తం చూడక్కలేదు ఒక మెతుకు చాలు, అలాగే క్యాడర్ ఆలోచనలు ఏంటన్నది చెప్పేందుకు
సిక్కోలు మీటింగులో కొంతమంది జూనియర్ అంటూ నినదించిన తీరే తార్కాణం అంటున్నారు.

Tags:    

Similar News